పెద్దపల్లి బుగ్గస్వామి గుట్టపై క్రీ.శ. 8వ శతాబ్ది శివలింగం
posted on Mar 24, 2024 @ 2:09PM
రాష్ట్ర కూటుల కాలపు శివలింగం
కాపాడుకోవాలంటున్న శివనాగిరెడ్డి
కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో తెలకపల్లి మండలం పెద్దపల్లి బుగ్గస్వామి గుట్ట పైన రాష్ట్ర కూటుల కాలపు శివలింగం ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
ప్రముఖ కవులు వనపట్ల సుబ్బయ్య ,ముచ్చర్ల దినకర్ ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక వెంకటేశ్వర ఆలయ జీర్ణోద్దరణ పనులపై పరిసరాలను పరిశీలిస్తుండగా రాతిని తొలిచి మలిచిన 5 అడుగుల వ్యాసంతో పానవట్టం మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించటం కోసం అడుగు వ్యాసంలో ఆరు అంగుళాల లోతున గుంట చెక్కబడిందని, వాస్తు శిల్పశైలిని బట్టి ఈ శివలింగ పానవట్టం ఇప్పటికి 1200 ల , సంవత్సరాల నాటిదని ఆయన పేర్కొన్నారు. క్రీ.శ.8వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాష్ట్ర కూటుల కాలానికి చెందిన ఈ శివలింగాన్ని కాపాడుకోవాలన శివనాగిరెడ్డి అన్నారు.
అదే గుట్టపై 200 సంవత్సరాల నాటి శాసనముందని అందులో దేవేంద్రపురికి చెందిన మునీశ్వరుని శిష్యులైన ఉపేంద్రపురి విశ్వనాధుల ప్రస్తావన ఉందని వీరిద్దరూ ఇక్కడ సిద్ధిపొందారని ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి గ్రామస్తులు సురభి సత్యపాల్ రావు,కేశవులు గౌడ్ ,దర్శి రాజయ్య ,కందూర్ లక్ష్మణ స్వామి, బాలస్వామి గౌడ్,అర్చకులు వంశీకృష్ణ స్థపతి భీమిరెడ్డి వెంకట్ రెడ్డి శిల్పి ఎల్లయ్య బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు.