త్రీడీ ప్రింటింగ్ ద్వారా బాడీ పార్ట్స్..!!
posted on Feb 16, 2016 @ 2:05PM
త్రీడీ ప్రింటింగ్ ఇప్పటి వరకూ వస్తువులకే పరిమితమైంది. తాజాగా త్రీడీ ప్రింటింగ్ సహాయంతో, అవయవాల్ని సృష్టించి సక్సెస్ ఫుల్ గా పనిచేయించారు అమెరికన్ వైద్యులు. జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అవడంతో, త్వరలోనే మనుషులకు కూడా దీన్ని ఉపయోగించి కోల్పోయిన భాగాల్ని అద్భుతంగా పున:సృష్టించవచ్చని చెబుతున్నారు. శరీరంలోని కీలక అవయవాల్లో ఏం కోల్పోయినా, కృత్రిమ అవయవాల్ని సృష్టించి తిరిగి పనిచేసేలా చేయవచ్చు. కానీ ఇలా ప్రింట్ చేసిన టిష్యూల్లోని సెల్స్ బ్రతికి ఉండేలా చేయడం ప్రస్తుతం సైంటిస్టులకు ప్రధానమైన ఛాలెంజ్ గా మారింది. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ను లివింగ్ సెల్స్ ఉన్న ఒక జెల్ తో కలిపి అవసరమైన చోట అమరుస్తారు. కొన్నాళ్లకు ఆ భాగం నుంచి ప్లాస్టిక్ కరిగిపోయి, ఆకారం ఉండిపోతుంది. ఈ త్రీడీ ప్రింటింగ్ ద్వారా, అవసరమైన చోట, అవయవాల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఆరంభ దశలోనే ఉన్నా, భవిష్యత్తులో ఇది చాలా కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు సైంటిస్టులు.