అక్కడ 33.. ఇక్కడ 32! ఏపీలో మారిన కొత్త జిల్లాల లెక్క?
posted on Nov 9, 2020 @ 2:00PM
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి దీనిపై లోతుగా అధ్యయనం చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోయినా ఏపీలో ఏర్పడబోయే జిల్లాలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది 25 జిల్లాలని.. మరికొందరు 26, 27 వరకు ఉంటాయని చెబుతున్నారు. తాజాగా ఏపీలో 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని మరో ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన మంత్రి తానేటి వనిత కూడా ఇదే విషయం చెప్పారు. కొత్తగా 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికి ప్రస్తుతం 32 జిల్లాలు ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మంత్రి ప్రకటనతో ఏపీలో కొత్తగా మరో 19 జిల్లాలు ఏర్పాటు కావొచ్చని.. వచ్చే ఏడాది జనవరి కల్లా దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
ఉత్తరాంధ్రలో ప్రస్తుతం మూడు జిల్లాలు ఉండగా పునర్విభజనతో అని ఏడుకు పెరగబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు కొత్తగా పలాస, పార్వతీపురం, అరకు, అనకాపల్లి జిల్లాలు వస్తాయని సమాచారం. ఇక గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలుగా మారనున్నాయి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయని చెబుతున్నారు. కృష్ణా జిల్లాను విజయవాడ,మచిలీపట్నం జిల్లాలుగా విభజించనున్నారు.గూంటూరు జిల్లా నాలుగు ముక్కలు కానుంది. గుంటూరుతో పాటు అమరావతి, బాపట్ల, నర్సరావుపేట కేంద్రాలుగా కొత్త జిల్లాలు రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఒంగోలు.. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు జిల్లాలు రానున్నాయట.
రాయలసీమ మొత్తం 10 జిల్లాలుగా మారబోతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. చిత్తూరుతో పాటు ఆధ్యాత్మిక నగరం తిరుపతి , మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుత అనంతపురం జిల్లా అనంతపురం, హిందూపురం జిల్లాలుగా విభజన కానుందంటున్నారు. ప్రస్తుత కర్నూల్ జిల్లా కర్నూల్, అదోని, నంద్యాల జిల్లాలుగా మూడు ముక్కలు అవుతుందని చెబుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కొత్తగా రాజంపేట జిల్లా వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
జగన్ సర్కార్ రూపొందిస్తున్న కొత్త జిల్లాల ప్రతిపాదనలు, అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పునర్విభజన తర్వాత రాయలసీమలో 10 జిల్లాలు ఉండనుండగా.. ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలుగా మారబోతోంది. ఉభయ గోదావరి ఐదు జిల్లాలుగా విభజన కానుండగా.. కోస్తాంధ్ర 10 జిల్లాలుగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కర్నూల్, విశాఖ, చిత్తూరు, తూర్పు గోదావరి మూడు ముక్కలు కానున్నాయి. ఏపీలో పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు నాలుగు జిల్లాలుగా విడిపోనుంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు , కడప, అనంతపురం , పశ్చిమగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రెండుగా విడిపోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ 25 జిల్లాలుగా పునర్విభజన జరగనుందని వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న 25 లోక్ సభ నియోజకవర్గాలనే జిల్లాలుగా మారుస్తారని భావించారు. ఆ దిశగానే ప్రభుత్వం నియమించిన జిల్లాల పునర్విభజన కమిటి కూడా కసరత్తు మొదలు పెట్టిందని ప్రచారం జరిగింది. అయితే తమ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చాయి. మార్కాపురం, గూడూరు, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ప్రభుత్వం కూడా మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కనే తాజాగా 32 జిల్లాల ప్రతిపాదన తెరపైకి వచ్చిందంటున్నారు.
మరోవైపు 32 జిల్లాల ప్రతిపాదనపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వాదనలు వస్తున్నాయి. 32 జిల్లాలతో ప్రయోజనం ఉంటుందా అని కొందరు పోస్ట్ చేస్తున్నారు. 32 జిల్లాలు అవసరమంటారా అంటూ మరికొందరు జనాల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న జిల్లాల వల్ల వచ్చే ప్రయోజనాలేంటీ, నష్టాలేంటీ అన్న విషయాలపైనా ఏపీ ప్రజల్లో మంచి చర్చ జరుగుతోంది. తన ఫ్రెండ్ కేసీఆర్ బాటలోనే జగన్ నడుస్తున్నారని, తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు కావడంతో ఇక్కడ కూడా అలాగే చేయాలని చూస్తున్నారనే సెటైర్లు కొందరు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.