2022 రౌండప్ ..
posted on Dec 13, 2022 @ 3:28PM
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
జనవరి 1
2021 సంవత్సరం వస్తూనే విషాదాన్ని మోసు కొచ్చింది. కొత్త సంవత్సరం తొలి పొద్దు విషాద వార్తతో కళ్ళు తెరిచింది. ప్రతి సంవత్సరంలానే,ఈ సంవత్సరం కూడా, జనవరి ఫస్ట్’న జమ్మూలోని వైష్ణవదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో తమను చల్లగా చూడమని, వైష్ణవదేవీ మాతను ప్రార్ధించేందుకు భక్తిపారవశ్యంలో పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది.12 మంది ప్రాణాలు వదిలారు, 20 మంది వరకు గాయాల పాలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతర ముఖ్య నేతలువిచారం వ్యక్తపరిచారు.చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం క్షతగగాత్రులకు సహాయం అందించింది.
జనవరి 4
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మణిపూర్ లో పర్యటించారు. ఐదు జాతీయ రహదారులు, 200 పడకల సెమి – పెర్మనెంట్ ఆసుపత్రితో పాటుగా నాలుగు వేల 815 కోట్ల విలువైన 22 అభివృద్ధి పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మణిపూర్ అభివృద్ధి ప్రణాళికతో ఈశాన్య భారతం, భారతదేశ అభివృద్ధి వాహనానికి చోదక శక్తిగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త పరిచారు.
జనవరి 5
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన, భద్రతా లోపం కారణంగా రద్దయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన పై జనవరి 7న, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం వేర్వేరుగా విచారణకు ఆదేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, పంజాబ్ పరిణామాలను వివరించారు. కాగా ప్రధాన మంత్రి పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పై చర్చించేందుకు సుప్రీం కోర్టు జనవరి 12న ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
జనవరి 15
సైనిక దినోత్సవం... భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రతి సంవత్సరంలానే ఈ సవత్సరం కూడా, దేశ వ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, సైనిక శిక్షణ సామర్ధ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
జనవరి 20
బ్రహ్మ కుమారీల అధ్య్వర్యంలో, సంవత్సరకాలంపాటు జరిగే అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేద్ర మోడీ ప్రారంభిచారు.
జనవరి 23
నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి. దేశ రాజధాని ఢిల్లీలో గేట్ వే అఫ్ ఇండియా వద్ద, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభ చిహ్నంగా సుభాష్ చంద్ర బోస్, విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోడీ, భారత్ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి, నవ భారత నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.
జనవరి 30
మహాత్మాగాంధీ వర్ధంతి. అమర వీరుల దినోత్సవం. ఈ సందర్భంగా రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. అలాగే, అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని అన్నారు.
జనవరి 31
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
(ఫిబ్రవరి 22 రౌండప్ రేపు)