ఆ ఫోటో చూసి మంత్రిగారు ఎందుకు షాకయ్యారు?
posted on Aug 27, 2016 @ 3:50PM
ఒక్కోసారి వంద మాటలు చెప్పలేని విషయం ఓ ఫోటో చెబుతుంది. అందుకే, కెమెరా కనుగొన్న కొత్తలోంచీ ఇప్పటి సెల్ఫీల కాలం వరకూ ఫోటోకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకి పెరుగుతోంది! ఏదో సరదాగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవటమే కాదు సీరియస్ గా ఫోటో జర్నలిజమ్ చేసేవారు కూడా వుంటారు. ఎందరో ప్రతిభావంతులైన ఫోటో జర్నలిస్టులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సార్లు తమ ఫోటోలతో సంచలనాలు సృష్టించారు కూడా! ఈ మద్య అలాగే ఓ సంఘటన జరగింది మంత్రి కేటీఆర్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో...
కేటీఆర్, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ వాళ్లు ఏర్పాటు చేసిన అధికారిక ప్రొగ్రామ్ కి అటెండ్ అయ్యారు. అయితే, ఆయన అసోసియేషన్ వాళ్లు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించారు. కాని, ఒక్క ఫోటో వద్ద మాత్రం కేటీఆర్ షాకైపోయి నిలబడిపోయారు. ఆ ఫోటోలో రంగరెడ్డి జిల్లా మన్సురాబాద్ లోని ఒక పాఠశాలలో వంద మంది అమ్మాయిలు టాయిలెట్ వద్ద క్యూ కట్టిన పరిస్థితి దర్శనమిచ్చింది! ఇంకా ఇలాంటి పరిస్థితులు వున్నాయా అంటూ నిర్ఘాంత పోయిన మంత్రి వెంటనే ఆ జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు!
గవర్నమెంట్ పాఠశాలల్లో టాయిలెట్ల లేమీ అంటూ మనం ఎన్నో సార్లు న్యూస్ పేపర్ రిపోర్ట్ లు చూస్తుంటాం. కాని, అలాంటి వంద రిపోర్టులు కూడా చేయలేని ఈ ఒక్క ఫోటో చేసింది!