అందరి అభిప్రాయాలు విన్నాం : షిండే

 

 

 

తెలంగాణా విషయాన్ని చర్చించేందుకు ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యి తమ పార్టీల వాణిని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ముందు వినిపించారు.

 

ఈ సమావేశం ముగిసిన అనంతరం షిండే విలేఖరులతో మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను విన్నామని, ఈ విషయంలో నెల రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. అంత వరకూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా యువత, సంయమనంతో ఉండాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకొంటామని షిండే అన్నారు.

 

ఆయా పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కేంద్రానికి తెలియచేస్తానని షిండే అన్నారు. సమావేశమంతా స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని ఆయన అన్నారు. ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయాన్ని చర్చించేందుకు ఇదే చివరి అఖిల పక్ష సమావేశమని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణాఫై కేంద్రం నిర్ణయం ఉంటుందని అన్న షిండే సమావేశంలో వివిధ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను చెప్పేందుకు మాత్రం నిరాకరించారు.