ములాయం, అఖిలేష్ తాట తీయండి...!
posted on Dec 13, 2012 @ 12:50PM
సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ములాయం తో పాటు ఆయన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ల ఫై విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీం సిబిఐ ను ఆదేశించింది. ఈ తీర్పును ములాయం స్వాగతించారు. ఈ విచారణతో తనఫై ఉన్న ఆరోపణలు తొలగిపోతాయని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో సిబిఐ తనఫై విచారణ చేయడాన్ని సవాల్ చేస్తూ ములాయం గతంలో సుప్రీం ను ఆశ్రయించారు. దీనిఫై విచారణ చేసిన సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన దర్యాప్తును స్వతంత్రంగా చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సిబిఐ ను ఆదేశించింది. ములాయం మరో కుమారుడు ప్రతీక యాదవ్ ఫై కూడా విచారణ చేయాలని సుప్రీం ఆదేశించింది. అయితే, ఈ కేసునుండి అఖిలేష్ భార్య డింపుల్ కు కోర్టు మినహాయింపును ఇచ్చింది.
2007 మార్చి 1వ తేదీన సుప్రీం ములాయం ఆస్తులఫై విచారణకు ఆదేశించింది. అప్పటినుండి సిబిఐ ఈ విచారణను నిర్వహిస్తోంది. మరోవైపు ములాయం ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యారు.