జగన్ పార్టీ నుంచి కృష్ణంరాజు బిజేపిలోకి జంప్
posted on Jan 30, 2014 @ 10:40AM
గత మూడు నాలుగు రోజులుగా వైకాపా నేత రఘురామకృష్ణంరాజు పార్టీ వీడి కాంగ్రెస్ లోకో, బీజేపీలోకో వెళ్లిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి2న తను స్వయంగా జగన్మోహన్ రెడ్డి తో సమావేశమయిన తరువాత తగిన నిర్ణయం తీసుకొంటానని ఆయనే స్వయంగా ప్రకటించారు కూడా. అయితే ఆయన నిన్నబీజేపీ నేత వెంకయ్య నాయుడిని వెళ్లి కలవడంతో బీజేపీలో చేరబోతున్నట్లు దాదాపు ఖాయమయిపోయినట్లే భావించవచ్చును. ఆయన నరసాపురం నుండి పోటీ చేసేందుకు వైకాపా అంగీకరించినట్లు సమాచారం. కానీ కొందరు స్థానిక పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తుండటంతో ఆయన ఈవిషయాన్ని జగన్ దృష్టికి తీసుకు వెళ్ళినా ఆయన నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో బాధపడిన రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి తన గోడు వెళ్ళబోసుకోవలనుకొన్నారు. కానీ, ఇంతలోనే ఏమయిందో తెలియదు కానీ ఆయన వెంకయ్య నాయుడిని వెళ్లి కలిసి వచ్చారు.
అదేవిధంగా మల్కాజ్ గిరీ కాంగ్రెస్ శాసనసభ్యురాలు జయసుధ ఈసారి అక్కడి నుండే లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నందున, ఆ సీటు సిట్టింగ్ యంపీ సర్వే సత్యనారాయణకే కేటాయించే అవకాశం ఉండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో జేరేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే టికెట్ కోసం పార్టీలు మారే ఇటువంటి వారికి పార్టీలు, సిద్దాంతాలు, సమైక్య, విభజన వాదనలు ఏవీ కూడా అడ్డుకావని అర్ధం అవుతోంది.