వివేకా హత్య కేసు.. ఇక విచారణ వాయిదాలకే పరిమితమా?
posted on Feb 27, 2024 @ 3:21PM
ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 27)న సీబీఐ కోర్టులో హాజరయ్యారు. కోర్టు కేసు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. పెద్దగా ప్రాముఖ్యత లేని వ్యవహారంలా వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ మారిపోయిందనడానికి ఈ కేసు విచారణ జరుగుతున్న తీరే నిదర్శనం. కానీ గత ఏడాది ఫిబ్రవరి నుంచి మే నేలాఖరు వరకూ మాత్రం ఇహనో ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు అన్న వాతావరణమే ఉండింది. అప్పట్లో రాజకీయ వర్గాలు కూడా అవినాష్ అరెస్టు కాకుండా అడ్డుకోవడం ఇక ఎవరి తరం కాదన్నట్లుగానే భావించాయి. గత ఏడాది ఫిబ్రవరి 24న వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. అప్పట్లోనే కోర్టు హాలు నుంచి బయటకు రాగానే అవినాష్ ను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయిందని, అలాగే మరోవైపు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిడం చూస్తుంటే.. ఇక ఈ హత్య కేసులో వరుస బెట్టి ఆరెస్ట్‌లే తరువాయి అన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది.
వాస్తవానికి వివేకా హత్య కేసులో అవినాష్ ను 2023 జనవరిలోనే అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది. అయితే ఆయన కాల్ డేటాను పరిశీలించి.. వాటి వివరాల ఆధారంగా కాల్స్ వెళ్లిన వారిని ఓ సారి విచారిస్తే.. ఆ తర్వాత తమ పని మరింత సులువు అవుతుందన్న ఓ ఆలోచనతో అప్పటికి వెనక్కు తగ్గిన సీబీఐ ఆయన ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణీ వైయస్ భారతి పీఏ నవీన్‌లకు నోటీసులు జారీ చేసి.. వారిని విచారించింది. వారిని విచారించిన అనంతరం అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు పంపింది. దీంతో ఇక అవినాష్ అరెస్టే అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పట్లో సీఎం జగన్ సైతం తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. అవినాష్ అరెస్టు తరువాత సీబీఐ తట్టేది తాడేపల్లి ప్యాలెస్ తలుపులేనన్న చర్చ కూడా అప్పట్లో జోరుగా సాగింది. జగన్ హస్తిన పర్యటనతో పరిస్థితి సద్దుమణిగిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్ చల్ చేశాయి.
ఆ తరువాత మళ్లీ గత ఏడాది మేలో కూడా అవినాష్ రెడ్డి అరెస్టునకు సీబీఐ విశ్వ ప్రయత్నం చేసింది. తల్లికి గుండెపోటు కారణంగా సీబీఐ విచారణకు రాలేను అంటూ అవినాష్ విజ్ణప్తిని సీబీఐ తోసిపుచ్చింది. దీంతో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలు దేరిన అవినాష్ రెడ్డి అంతలోనే మనసు మార్చుకుని కడపకు పయనమయ్యారు. దీంతో సీబీఐ ఆయనను సినీ ఫక్కీలో ఛేజ్ చేసింది. మార్గ మధ్యంలో ఆయన రూటు మార్చి తన తల్లిని కర్నూలులోని ఓ అసుపత్రిలో చేర్చారంటూ అక్కడకు వెళ్లారు. ఆ తరువాత గంటల తరబడి డ్రామా కొనసాగింది. అవినాష్ రెడ్డి ఆసుపత్రి లోపల, సీబీఐ అధికారులు ఆసుపత్రి బయట మధ్యలో వందల సంఖ్యలో అవినాష్ అనుచరులు. అప్పట్లో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. అవినాష్ అరెస్టు కు సీబీఐ స్థానిక పోలీసుల సహాయం కోరితే.. వారు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమౌతుందంటూ చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక సీబీఐ వెనుదిరిగింది. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చూపి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతే ఆ తరువాత నుంచీ వివేకా హత్య కేసులో పురోగతి ఏమిటి అన్న విషయంపై ఇసుమంతైనా సమాచారం లేదు.
అవినాష్ ను అరెస్టు చేయడానికి నానా హడావుడీ చేసి చివరకు చేతులెత్తేసిన సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ. కానీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన ఏపీ సీఐడీ మాత్రం జగన్ రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసే విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కేసింది. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టుకు వెళ్లి మరీ అరెస్టులు చేసింది. గోడలు దూకి వెళ్లి మరీ అరెస్టులు చేసింది. ఇలా ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారిలో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు చివరాఖరికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు. వీళ్లెవరూ టెర్రరిస్టులు కారు. రాత్రికి రాత్రి పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించి మరీ అరెస్టులు చేశారు. వందల మైళ్లు కార్లలో తిప్పారు. వైసీపీ రెబల్ ఎంపీపై అయితే ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ మాత్రం వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేక చోద్యం చూసిన తీరు ఆ సంస్థ ఇంటిగ్రిటీపైనే అనుమానాలు కలిగేలా చేసింది.