Bharat Ratna for NTR says Naidu

The TDP leaders and activists of Telugu Desam Party who had gathered at Gandipeta , Hyderabad for the second day of the Mahanadu celebrations which coincidently also happens to be the 91st birth anniversary of the late Chief Minister of Andhra Pradesh and the founder president of TDP Nanadamuri Taraka Rama Rao (NTR). Speaking at the event the TDP party head and CM designate for Rest of Andhra Pradesh region, paid homage to the departed leader as the founding father of the party .He acknowledged the party cadre support for the resounding success in the elections and went on to exalt the services rendered by NT Rama Rao to the state of Andhra Pradesh and his role in National Politics .Mr Naidu pledged that he would speak to the Central Government and ensure that N T Rama Rao gets the Bharat Ratna as it was long due which was fitting tribute to the departed leader.

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  

గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?

రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.

తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియామకం

  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.  

తెలంగాణ మునిసి‘పోల్స్’ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణలో మునిసిల్  ఎన్నికలకు రేవంత్ సర్కార్ దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇప్పట్ల కాదని విస్పష్టంగా చెప్పేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల తరువాత జడ్పీఎన్నికలు ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.  పరిషత్ ఎన్నికల కంటే ముందే ముమునిసిపోల్స్ పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్లను కూడా వేగవంవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే  రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల తయారీ , ప్రచురణకు సంబంధించి  షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఖరారు చేసిన వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాలను జనవరి పదో తేదీలోపు ఖరారు చేసి ప్రకటించేదిశగా అడుగులు వేస్తున్నది.  పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఈ విభజన ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ,తుది జాబితా ప్రచురణ జనవరి పదో తేదీకి పూర్తి  కానున్నది.  ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు ,అభ్యంతరాలను స్వీకరిచిన తరువాత,  మార్పులు చేర్పులు చేసి నిర్దేశిత   గడువులోగా తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. వార్డుల విభజన , రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా దీనికి సమాంతరంగా సాగుతోంది. ముఖ్యంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాతే ఓటర్లను ఆయా వార్డులకు కేటాయించనున్నారు. ఇక పాత విధానంలోనే రిజర్వేషన్ల అమలు ఉండనుంది.    

జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

రప్పారప్పా అన్న వారిని రఫ్పాడిస్తున్న పోలీసులు వైసీపీ కార్యకర్తల మెడకు రప్పారప్పా కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇష్టారీతిగా రప్పరప్పా అంటూ దౌర్జన్యాలకు పాల్పడతామంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా, రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలకు మూగజీవాలను బలి ఇచ్చి రక్తాభిషేకాలు రెచ్చిపోయిన కార్యకర్తలు, జగన్ అభిమానులు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు.   ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు  సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు. ఇప్పుడు ఆ విషయంలోనే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఔను ఎక్కడెక్కడ ఎక్క‌డ ర‌ప్పా ర‌ప్పా అంటూ  ఈ జంతు బ‌లులు ఇచ్చారో అక్కడక్కడ అలా రక్తతర్పణాలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యర్తలపై కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ కార‌ణంగా జైళ్ల‌కు పోయి వ‌చ్చిన లీడ‌ర్ల‌ సంఖ్య విప‌రీతంగా ఉంటే ఇప్పుడది కార్యకర్తల వరకూ పాకింది.  అంటే జ‌గ‌న్ ప్రాపకం కోసం కార్యకర్తలు చేసిన అతి వారిని కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. అయినా రప్పారప్పా పోస్టర్లను, జంతు బలులను, రక్తాభిషూకాలు, రక్తతర్పణాలను అడ్డుకుని, అందుకు పాల్పడిన వారిని మందలించాల్సింది పోయి, జగన్ వారిని ప్రోత్సహించడం వల్లే పరిస్థితి ఇంత వరకూ వచ్చిందని ఇప్పుడు వైసీపీ క్యాడరే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. జగన్ తన కార్యకర్తలను కూడా క్రిమినల్స్ గానే తీర్చిదిద్దాలన్న భావనలో ఉన్నారు కనుకనే  ఎంతగా రెచ్చిపోతే అంతగా ప్రోత్సాహం అన్నట్లుగా వారిని రెచ్చగొడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జ‌గ‌న్  పై కేసులు ఉన్నాయి.. అయితే ఆయన లీగల్ టీమ్ ను కోట్లు చెల్లించి మరీ పోషిస్తున్నారు. అయితే.. సామాన్య కార్యకర్తకు ఆ వెసులుబాటు ఉండదు. కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ నుంచి ఇసుమంతైనా సాయం అందదు. దీంతో వారు జైళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్  కార్యకర్తలను క్రిమినల్ కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే..  జ‌గ‌న్ త‌న హయాంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో  కార్యకర్తలను పట్టించుకున్న పానాన పోలేదు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం ఇంత చేస్తే తమకు జైళ్లు, కేసులూ బహుమతా అంటూ ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్న పరిస్థితి.   

అజ్ణాతంలో వల్లభనేని వంశీ .. గాలిస్తున్న పోలీసులు?

చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటారు. చేసిన పాపం ఊరికే పోదని కూడా నానుడి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 204 వరకూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ఒకరు ఇద్దరే అని కాదు గత వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు అరెస్టై జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరి కొందరు అరెస్టై ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. ఇంకా కొందరు అరెస్టు అవుతామన్న భయంతో వణికి పోతున్నారు. కొందరైతే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలాంటి నేతలలో వల్లభనేని వంశీ ఒకరు.  వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో నమోదైన అభియోగాలపై ఆయన ఇప్పటికే అరెస్టై.. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్ల భనేని వంశీ కొద్ది కాలం కిందట బెయిలుపై విడుదలయ్యారు.  బెయిలుపై విడుదలైనా ఆయన రాజకీయాలకు దూరంగా దాదాపుగా ఏకాంత వాసం అనుభవిస్తున్నట్లుగా మెలుగుతున్నారు.  అయితే తాజాగా ఇప్పుడు ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.  కొత్తగా తనపై నమోదైన కేసులో అరెస్టు భయంతోనే ఆయన అజ్ణాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై తాజాగా కొత్త కేసు నమోదైంది.  జూన్ 2024లో  వంశీ తన అనుచరులతో సునీల్ ను హత్య చేయడానికి కుట్రపన్నారన్నది ఆ కేసు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ వంశీ  హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా పోలీసులు వంశీకి నోటీసులు అందించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఇప్పటికే వల్లభనేని వంధీ కిడ్నాప్, బెదరింపులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్, తెలుగుదేశం గన్నవరం కార్యాలపంపై దాడి తదితర కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ కేసులలో అరెస్టై బెయిలపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా కేసులో అరెస్టు భయంతో  వల్లభనేని వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.