తెలంగాణ నాయకులపై కక్ష కట్టిన కిరణ్
posted on Apr 13, 2013 @ 11:38AM
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనపై కక్ష కట్టి తీవ్రమైన ఒత్తిళ్లకు గురి చేస్తున్నాడని పెద్దపల్లి ఎంపీ వివేక్ పేర్కొన్నారు. రెండు నెలలుగా తెలంగాణ గురించి పోరాడే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంత నాయకులను ముందు పెట్టి తమపై కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇస్తానని, కాంట్రాక్టులు ఇస్తానంటూ సీఎం ఎర వేస్తున్నాడన్నారు. జిల్లాలో నేదునూరి విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన యేండ్లు గడిచినా ఇంత వరకు గ్యాస్, నిధులు ఇప్పించలేదన్నారు. నేదునూరి గతి 'బీ'థర్మల్‌కు పట్టకూడదనే తాను కోల్ లింకేజికి డిమాండ్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే విషయంలో ముఖ్యమంత్రి పక్షపాతానికి పాల్పడుతున్నారని, వెయ్యికోట్ల నిధులు వెచ్చిస్తే ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రాణహితకు నిధులు కేటాయించకుండా తిరుపతికి రూ.5వేల కోట్లు తీసుకువెళ్లారన్నారు.