దేశభక్తి వివాదంలో మెహబూబా ముఫ్తీ
posted on Mar 28, 2016 @ 4:10PM
తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణం తరువాత కశ్మీర్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టనున్న మెహబూబాకు జాతీయవాద సెగ తగులుకుంది. శివసేన నాయకుడు సంజయ్ రానౌత్ మెహబూబాను కూడా భారత్‌మాత వివాదంలోకి లాగేందుకు సిద్ధపడుతున్నారు. ‘మెహబూబా ముఫ్తీ భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?’ అని అడుగుతున్నారు సంజయ్. అంతేకాదు! పార్లమెంటు మీద దాడి కేసులో ఉరితీయబడిన అఫ్జల్ గురు విషయంలో మెహబూబా అభిప్రాయం ఏమిటో చెప్పాలని పట్టుబడుతున్నారు సంజయ్.
అఫ్జల్ గురు విషయంలో మెహబూబాకు చెందిన పీడీపీ పార్టీ ఇన్నాళ్లూ సౌమ్యంగానే వ్యవహరిస్తూ వస్తోంది. అఫ్జల్ గురుని ఉరితీయాల్సింది కాదన్నది ఆ పార్టీ భావన. అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏంటని కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. మరి ఇటు మిత్రపక్షమైన శివసేనతో పాటు, అటు ప్రతిపక్షాలకు బీజేపీ ఎలాంటి సమాధానం చెప్పనుందో, ఈ విమర్శలకు మెహబూబా ఏమని జవాబు చెబుతారో చూడాలి!