సీఎం కుర్చీ కోసం పీసీసీ చీఫ్ బొత్స కుట్రలు

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కుర్చీ నుంచి దించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుట్ర పన్నారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు బొత్స కంకణం కట్టుకున్నారని జోగి రమేష్ ధ్వజమెత్తారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుండి ఎమ్మెల్యేలను ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నించారు.


రాజ్యాంగ సంక్షోభానికి బొత్స తెర తీశారని ఆయన విమర్శించారు. కాంగ్రెసులో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మైనారిటీలో పడిందని బొత్స ఎలా చెబుతారని ఆయన అడిగారు. బలనిరూపణకు గవర్నర్ ఆదేశిస్తే ఏం చేస్తారని, తెలుగుదేశం పార్టీ మద్దతుతో గట్టెక్కుతారా అని ఆయన అడిగారు. బొత్స వ్యాఖ్యలతో ప్రభుత్వం మైనారిటీలో పడినట్లు తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో కల్లోలం సృష్టించడానికి, కాంగ్రెసులో అంతర్గత కలహాలు సృష్టించడానికి బొత్స ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదని, బహిష్కరించిన వారిలో తన పేరు ఉంటే బయట పెట్టాలని  జోగి రమేష్ డిమాండ్ చేశారు. తాము సమైక్యాంధ్ర ప్రదేశ్ను కోరుకుంటున్నామని, ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే ఎదురిస్తామని అన్నారు. పార్టీ నుండి బహిష్కరించిన ఎమ్మెల్యేల పేర్లను బయటపెట్టాలన్నారు.