కెసిఆర్‌పై జగ్గారెడ్డి నిప్పులు
posted on Nov 8, 2012 @ 1:25PM
టీఆర్ఎస్ పార్టీ ప్రైవేటు లిమిటెడ్ పార్టీగా పనిచేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకోడానికే కేసీఆర్ యత్నిస్తున్నారని, తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ ఓ కొత్త నాటకానికి తెరతీసిందన్నారు. తెలంగాణ పై కాంగ్రెస్ ఎప్పుడూ డెడ్‌లైన్లు పెట్టలేదని, డెడ్ లైన్‌ను పెడుతూ ప్రజలను మభ్యపెడుతుందని టీఆర్ఎస్సే అని మండిపడ్డారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పారు.
కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి పిలుపు రాకుండానే కేసీఆర్ నెల రోజులుగా ఢిల్లీలో మకాం వేసారని, జేఏసీ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌లో పాల్గొనకూడదనే ఢిల్లీ వచ్చారన్నారు. కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి అని ఆగ్రహం వ్యక్తపరిచారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం జరిపిన కొండా లక్ష్మణ్‌బాపూజీ మరణిస్తే కేసీఆర్ హాజరుకాకపోవడం బాధాకరమని జగ్గారెడ్డి గుర్తుచేశారు.