పేదోడి బియ్యాన్ని కూడా బొక్కేసిన జగన్ సర్కార్: గోరంట్ల
posted on Nov 8, 2022 9:25AM
జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అధ్వానంగా తయారైంది. తన తుగ్లక్ విధానాలతో ఆయన రాష్ట్రంలోని ప్రతి వర్గాన్నీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తాజాగా ధాన్యంకొనుగోళ్ల విషయంలో జగన్ సర్కార్ విధానాలు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయని తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పేదోడి బియ్యాన్ని కూడా బొక్కేసే దౌర్బాగ్య స్థితికి చేరిందన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇంతటి దౌర్భాగ్య సర్కార్ అధికారంలో ఉండటం ఏపీ దౌర్బాగ్యమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నూతన నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గోరంట్ల అన్నారు. గత ఏడాది రైతులు విక్రయించిన ధాన్యానికే ఇప్పటికింకా సొమ్ములు అందక నానా అగచాట్లూ పడుతున్నారని ఆయన అన్నారు. జగన్ పాలనలో రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారనీ, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. పంటలకు మద్దతు ధర లేదు, పంట నష్టపోయిన వారికి పరిహారం లేదు, రైతు భరోసా రైతు దగాగా రూపాంతరం చెందిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. అన్న దాతల ఆత్మహత్యలలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందంటే వ్యవసాయాన్ని జగన్ సర్కార్ ఎంత సంక్షోభంలో ముంచేసిందో అర్ధం చేసుకోవచ్చని గోరంట్ల చెప్పారు.
గత తెలుగుదేశం పాలనలో రైతులకు వారం రోజుల్లోనూ ధాన్యం బకాయిలు అందేవనీ, జగన్ హయాంలో అయితే నెలలు గడుస్తున్నా ధాన్యం బకాయిలు చెల్లించడం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జగన్ నూతన నిబంధనలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్)లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు.
దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఆర్భాటంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు వైకాపా నేతల అవినీతి కేంద్రాలుగా మారాయని దుయ్యబట్టారు. వైసీపీ నేతల ఇష్టాయిష్టాల మేరకు అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని విమర్శించారు.ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు.