బాబు ఎప్పుడో విభజించమన్నారు..అయినా ఈ నిందలేంటి?
posted on Jul 2, 2016 @ 5:07PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి దాదాపు రెండేళ్లవుతోంది..ఎవరి పరిపాలన వారు చేసుకుంటున్నారు. ఉద్యోగుల, అధికారుల విభజన కూడా జరిగిపోయింది. ఇప్పుడిప్పుడే పాత గొడవలన్ని మరచిపోయి రెండు రాష్ట్రాల ప్రజలు సోదరుల్లా కలిసిపోతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో ఉన్న ఉమ్మడి హైకోర్టులో సాక్షాత్తూ న్యాయం చెప్పే న్యాయాధికారులే తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కారు. ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 2, 2014 నాటికి 205 మంది న్యాయాధికారులు వివిధ జిల్లాలలో పనిచేస్తున్నారు..వీరిలో 95 మంది న్యాయాధికారులను తెలంగాణకు, 110 మంది న్యాయాధికారులను ఏపీకి కేటాయించారు. అయితే తెలంగాణకు కేటాయించిన 95 మంది న్యాయాధికారులలో 58 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే కావడం వివాదానికి దారి తీసింది.
ఏపీలో ఖాళీలు ఉన్నప్పటికీ, ఆప్షన్లు పేరిట జూనియర్ సీనియర్ జడ్జీలతో కలిపి మొత్తం 143 మందిని ఏపీకి చెందిన న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడంతో వివాదానికి కారణమైంది. దీంతో తెలంగాణకు చెందిన వారు పదోన్నతులు కోల్పోతారంటూ ఆ ప్రాంత న్యాయవాదులు భగ్గుమన్నారు. ఈ పరిస్థితుల్లో తమకు సొంత హైకోర్టు ఉన్నపుడే న్యాయం జరుగుతుందని న్యాయాధికారుల సహా తెలంగాణ న్యాయవ్యవస్థ మొత్తం పోరాటానికి దిగింది. హైకోర్టు విభజన అనేది కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం, ఈ విషయం చట్టమే చెప్పింది. ప్రతీ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం నాయకులకు అలవాటే కదా..ఈ వివాదం కూడా రాజకీయ రంగు పులుముకుంది. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు అందరూ కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పడ్డారు.
హైదరాబాద్‌లోని ఆంధ్రా సచివాలయాన్ని ఆగమేఘాల మీద అమరావతికి తరలించినప్పుడు హైకోర్టును ఎందుకు విభజించరని టీఆర్ఎస్ ఎంపీ కవిత చంద్రబాబు మీద ఫైరయ్యారు. ఆంధ్ర విడిపోయినప్పటికీ ఇంకో 20-30 సంవత్సరాలు కోర్టుల ద్వారా తెలంగాణను ఏలాలని చంద్రబాబు స్కెచ్ గీస్తున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఆంధ్ర జడ్జీలు ఉండేలా కేంద్ర పెద్దలతో కలిసి బాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. న్యాయం చెప్పాల్సిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ కూడా ఆశ్చర్యకరంగా చంద్రబాబునే నిందించారు. హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా ఏపీ సీఎం మాత్రం ముందుకు రావడం లేదని సదానంద మీడియా సాక్షిగా అన్నారు.
“ హైకోర్టు విభజన ఉమ్మడి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు పరిధిలోని అంశం. ఇందులో కేంద్రం చేయగలిగిందేమీ లేదు. ఈ విషయమై మేం చేయగలిగిందల్లా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కు, రాజ్యాంగ అధిపతి గవర్నర్ కు లేఖ రాయడం. అది ఇంతకుమునుపే చేశాం. మళ్ళీ చేస్తాం. అంతే తప్ప కోర్టు పై ఒత్తిడి తేలేం. విభజనపై ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా హైకోర్టు పరిశీలనలో ఉంది. అంటే వ్యవహారం సబ్ జుడిస్ ( కోర్టు పరిశీలనలో ఉన్నది). ఇప్పుడు మేం జోక్యం చేసుకోలేమని సదానందగౌడ వ్యాఖ్యానించారు.
కానీ వాస్తవంలో హైకోర్టు విభజనకు చంద్రబాబు ముందు నుంచి కృషి చేస్తున్నారు. హైకోర్టు విభజనను వేగవంతం చేయాలంటూ గతేడాది మార్చి 23న అప్పటి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్‌గుప్తాకు చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 సెక్షన్ 31లోని సబ్ సెక్షన్ (2) ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారని అయితే హైకోర్టు నిర్మాణానికి స్థలాన్ని రాష్ట్రప్రభుత్వమే కేటాయించాలని తెలిపింది. దాంతో పాటుగా కొత్త రాష్ట్రంలో హైకోర్టు నిర్మాణానికి కావలసిన ఆర్ధిక చేయూతను కేంద్ర ప్రభుత్వమే కల్పించాలని సబ్ సెక్షన్ (3) నిర్దేశించిందని చంద్రబాబు లేఖలో పేర్కోన్నారు. ప్రధాన న్యాయమూర్తికి రాసినట్లే కేంద్రప్రభుత్వానికి కూడా లేఖ రాశారు.
రైతుల నుంచి ల్యాండ్‌పూలింగ్ ద్వారా నూతన రాజధాని కోసం సేకరించిన ప్రాంతంలో హైకోర్టు నిర్మాణానికి స్థలం కూడా కేటాయించారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్రమంత్రి సుజనా చౌదరి ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కేంద్ర బృందం పరిశీలించిందని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. విభజన చట్టంలో హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం భూమిని మాత్రమే ఇవ్వాలని ఉందన్న ఆయన మౌలిక వసతుల కల్పించాల్సింది కేంద్రప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు భూమిని ఇప్పటికే కేటాయించినా, దాని నిర్మాణానికి కేంద్రం ఇంత వరకు నిధులు ఇవ్వలేదు. మరి ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు స్పందించలేదు? వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి (అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు, ఇతర ప్రధాన కార్యాలయాలు) కేంద్రమే నిధులు ఇవ్వాలి. మరి ఇప్పుడు సదానందతో పాటు టీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారో చూడాలి. హైకోర్టు విభజనకు బాబు అడ్డం పడుతున్నారో లేక మరేవరు అడ్డం పడుతున్నారో ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే మంచిది. అదేం తెలుసుకోకుండా ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడం దేనికి..?