జాట్ రిజర్వేషన్..నాలుగో రోజుకి చేరిన ఉద్యమం
posted on Feb 17, 2016 @ 4:30PM
హర్యానాలో తమకు రిజర్వేషన్లని కల్పించమంటూ జాట్ వర్గంవారు చేస్తున్న ఉద్యమం ఇవాల్టికి నాలుగోరోజుకి చేరుకుంది. రాష్ట్రంలో ప్రముఖ జిల్లాలైన రోహ్‌తక్, సోన్‌పేట్ వంటి ప్రాంతాలలో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఆందోళనకారుల రాష్ట్ర రహదారులని సైతం నిర్బంధించడంతో రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. రైళ్లు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. హర్యానా ముఖ్యమంత్రి ‘మనోహర్‌లాల్ ఖట్టర్’ జాట్‌లను చర్చలకు ఆహ్వానించినప్పటికి కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉండటం విశేషం. వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే జాట్ వర్గం వారు తమకి రిజర్వేషన్లని కల్పించమని ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఒకోసారి ఈ ఉద్యమాలు హింసాత్మకంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి హర్యానాలో 47 శాతం వరకూ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం 50 శాతం వరకూ రిజర్వేషన్లను పొడిగించవచ్చు. కాబట్టి మిగిలిన 3 శాతం రిజర్వేషన్లను జాట్ వర్గానికి కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కానీ జాట్ నేతలు మాత్రం కంటితుడుపు ప్రకటనలు కాకుండా స్పష్టమైన హామీలను ఇస్తేనే తాము ఉద్యమాన్ని విరమిస్తామని పట్టుదలతో ఉన్నారు.