డీఎల్ రవీంద్రారెడ్డి కి కాంగ్రెస్ సపోర్ట్
posted on Jun 3, 2013 @ 12:16PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంతో పార్టీలో కలకలం రేగింది. పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు కేకె ముఖ్యమంత్రి చర్యను తప్పుపట్టారు. మంత్రి పదవి అంటే గులాంగిరి కాదని, డీఎల్ లాంటి వ్యక్తిని ఇలా అవమానకరంగా తొలగించడం అన్యాయమని విమర్శించారు. మంత్రి జానారెడ్డి కూడా డీఎల్ కు మద్దతుగా మాట్లాడారు. ఆయన బర్తరఫ్ బాధాకరమని, పార్టీలో సమస్యలు చక్కదిద్దేందుకు వెంటనే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని అన్నారు.
అంతకుముందు జానారెడ్డితో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. డీఎల్ బర్తరఫ్ వ్యవహారమే వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని జానా అంటున్నారు. ఇక డీఎల్ బర్తరఫ్ ను మంత్రి బస్వరాజు సారయ్య కూడా తప్పుపట్టారు. మీడియాతోనే ఆయన బర్తరఫ్ విషయం తనకు తెలిసిందని, మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయం చర్చిస్తామని అన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కిరణ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.