బుద్ధి గడ్డితిని...
posted on Jan 18, 2014 @ 4:46PM
ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడు బుద్ధి గడ్డితిని ఈ పార్టీలో వున్నాం అని పశ్చాత్తాపపడుతున్నారు. వీలైనంత త్వరగా వైకాపా నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళలోనే కాదు.. ఈ మధ్యకాలంలో వైకాపాలో చేరిన నాయకులలో కూడా పశ్చాత్తాపం మొదలైందని తెలుస్తోంది. వాళ్ళు కూడా బుద్ధి గడ్డితిని వైకాపాలో చేరామని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఉత్తరాంధ్రలో కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి అయిన ఒక పెద్దమనిషి తాజాగా వైకాపాలో చేరాడు. తన రాజకీయ చతురత అంతా ఉపయోగించి పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలని, జగన్‌కి చేరువైపోవాలని కలలు కన్నాడు. అయితే ఆయనకి జగన్ ఊహించని షాకులు ఇవ్వడంతో ఆయన కూడా వైకాపాలోకి అనవసరంగా వచ్చానా అన్న ‘ధర్మ’ సందేహంలో పడిపోయాడట. సాధ్యమైనంత త్వరగా ఈ పార్టీ నుంచి బయటపడిపోయే ఆలోచనలో వున్నాడట.
ఇంతకీ ఆ పెద్దమనిషికి ఎలాంటి షాకులు తగిలాయంటే, కొత్తగా వైకాపాలోకి వెళ్ళిన ఆయన చాలా ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టాడట. ఉత్తరాంధ్రలో తన బలాన్ని జగన్‌కి ప్రత్యక్షంగా చూపించాలన్న ఉద్దేశంతో ఒక బహిరంగసభ ఏర్పాటు చేయాలని సంకల్పించాడట. రెండు లక్షల మందితో భారీ స్థాయిలో సభ నిర్వహించాలని భావించాడట. ఆ సభకు రావాలని జగన్‌ని ఆహ్వానించినప్పుడు జగన్ ప్రతిస్పందించిన తీరు చూసి సదరు సీనియర్ నాయకుడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందట.
రెండు లక్షల మందితో సభ పెట్టబోతున్నా మీరు తప్పకుండా రావాలని ఆ నాయకుడు జగన్‌ని అడిగితే, ‘‘ఆ రెండు లక్షల మంది వచ్చేది నువ్వు సభ ఏర్పాటు చేశావని కాదు.. వాళ్ళు వచ్చేది నన్ను చూడటానికి. అంచేత ఎప్పుడు, ఎక్కడ సభ పెట్టాలో నేను డిసైడ్ చేస్తాను. మీరు ఫాలో అవ్వండి. అంతేతప్ప మీ అంతట మీరు ఉత్సాహంగా సభలు ఏర్పాటు చేయొద్దు’’ అని స్పష్టంగా చెప్పేశాడట. జగన్ అన్న మాటలు విని సదరు నాయకుడు నోరు తెరవడం మినహా ఏమీ మాట్లాడలేకపోయాడట. రాజకీయాల్లో చాలా సీనియారిటీ వున్న తనను జగన్ పూచికపుల్లలా తీసిపారేయడాన్ని ఆయనగారు జీర్ణించుకోలేకపోతున్నాడట. అనవసరంగా వైకాపాలోకి వచ్చానని బాధపడిపోతూ, ఈసారి ఏ పార్టీలోకి వెళ్ళాలా అని వెతుక్కుంటున్నాడట.