అయోధ్యకు ఆహ్వానం అందలేదు: విహెచ్
posted on Jan 17, 2024 @ 3:17PM
రాముడి పేరు మీద బిజెపి రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లను రాబట్టుకోవాలని బీజేపీ యత్నిస్తోందని ఆయన విమర్శించారు. అయోధ్య రామ మందిరానికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పారు. మోదీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అయోధ్య రామమందిర ఆహ్వానం అందలేదని విహెచ్ విమర్శించారు. దేవుడిపై అందరికీ భక్తి ఉంటుందని... తాము కూడా వీలైనప్పుడల్లా అయోధ్య రాముడిని దర్శించుకుంటామని తెలిపారు.25 కోట్ల మంది పేదల జీవితాలను కాంగ్రెస్ అతలాకుతలం చేసిందని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని వీహెచ్ అన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని అన్నారు. మద్దతు ధర పెంచాలనే రైతుల డిమాండ్ ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను వీహెచ్ కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈరోజు తమ్మినేనిని పరామర్శించారు.