దేశంలో కరోనా పంజా.. 11 రాష్ట్రాలు యమ డేంజర్
posted on Apr 2, 2021 @ 7:47PM
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరిగిపోతోంది. వైరస్ సెకండ్ వేవ్ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.11 రాష్ట్రాల్లో ‘తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు’ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 14 రోజులలో ఈ రాష్ట్రాల నుంచి 90 శాతం కేసులు వచ్చాయని వెల్లడించింది. గత కరోనా దశ కంటే ఈసారి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
మహారాష్ట్రలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు రాజీవ్ గౌబా. మహారాష్ట్ర విషయంలో మాత్రం తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. కోవిడ్ కేసుల విషయంలో తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌ను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న అన్ని వనరులనూ ఉయోగించాలని, ఆరోగ్య శాఖే కాదు, ఇందుకు అన్ని శాఖలూ ప్రభుత్వాలకు సహకరించాలని రాజీవ్ గౌబా విజ్ఞప్తి చేశారు.