కేంద్రం ఎన్నికల కుతంత్రం.. బీఆర్ఎస్ పై జమిలి బాణం
posted on Apr 14, 2023 @ 4:19PM
తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ పై జమిలి బాణం సంధించేందుకు సమాయత్తమౌతోంది. జమిలి ఎన్నికల వ్యూహంతో బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఆ లోగా 'ఒకే దేశం.. ఒకే ఎన్నికల విధానం పై చట్టాన్ని తీసుకొచ్చి జమిలితో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. లోక్‌సభ ఎన్నికలతోనే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం పెద్దలు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్ సర్కారుపై పరోక్షంగా హెచ్చరికలు చేయడం ఈ చర్చకు తావిచ్చింది. బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు సృష్టించి భాజపాలోకి లాక్కునేందుకు ఢిల్లి స్థాయిలో వ్యూహం, రాష్ట్ర స్థాయిలో అమలుకు కార్యాచరణ గోప్యంగా చేస్తోందని చర్చ సాగుతోంది. అందుకోసమే ఇటీవల చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కమలం హైకమాండ్ హస్తినకు పిలిపించుకుని చర్చలు జరిపిందంటున్నారు.
రాష్ట్రంలో ఇటీవల అధికార పార్టీని వీడి బీజేపీలో చేరిన కొంతమంది బడా నాయకులు ఇందుకు పూర్తిగా దోహదం చేస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఢిల్లి స్థాయిలో జోరుగా చర్చ జరుగుతోంది. దేశంలో నరేంద్రమోడీపై నేరుగా తిరగబడిన కేసీఆర్ తేలిగ్గా తీసుకుని వదిలేస్తే జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రమాదంఉందన్న భావనతో మోడీ, అమిత్‌షా సహా కొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ క్రమంలోనే జమిలి ఆయుధాన్ని రెడీ చేయాలన్న వ్యూహం రచించిందంటున్నారు. పలు సందర్భాల్లో జమిలి ఎన్నికల గురించి ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. బలమైన పోటీ-దారులు అయిన మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్ లాంటి వారిని ఒంటరిగా ఎదుర్కోలేమని, సార్వత్రిక ఎన్నికలతోపాటే కొట్టాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీకి అసెంబ్లీకి పార్లమెంట్‌కు ఒకటే ఓటు- పడడం ఖాయమని ఇలా చేస్తే రాష్ట్రాల్లోనూ అధికారం దక్కుతుందన్న విశ్వాసం బీజేపీలో కనిపిస్తోంది. అందుకే ఈసారి డిసెంబర్లో తెలంగాణ ఎన్నికల కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు వెళ్లకుండా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.