చంద్రబాబు అను నేను @30
posted on Sep 1, 2025 @ 9:54AM
ఏపీ అంటే బాబు- బాబు అంటే ఏపీ. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా నవ్యాంధ్రప్రదేశ్ అయినా ఆయన ముద్ర చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. రాజకీయాలంటే జనసామాన్యంలో.. ఒక ఆసక్తి కలగజేసింది కూడా చంద్రబాబు అనే చెప్పాలి. అటు ప్రధానులను, రాష్ట్రపతులను కాదు.. ఒకరిద్దరు ముఖ్యమంత్రులను చేసిన ఘనత కూడా చంద్రబాబుదే. ఇక చంద్రబాబు ప్రభావంతో ఎంత మంది యువత ఐటీ నిపుణులయ్యారో చెప్పలేం. తన సతీమణి భువనేశ్వరి సహా ఎందరు మహిళా మణులు వ్యాపారవేత్తలుగా రాణించారో.. ఎందరు ఆయన స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక చంద్రబాబంత!
చంద్రబాబు సీఎంగా తొలి సారి పగ్గాలు చేపట్టి 2025, సెప్టంబర్ 1నాటికి సరిగ్గా ముప్పై ఏళ్లు అవుతోంది. ఈ ముప్పై ఏళ్లలో నాలుగు సార్లు సీఎం అయ్యారాయన. అప్పుడప్పుడూ ఓటమి ద్వారా ఏర్పడ్డ r ఉత్థాన పతనా లను ఎదుర్కుంటూనే తిరిగి కోలుకోవడంలో పడిలేచిన కెరటానికే పాఠాలు నేర్పించగల సమర్ధుడు చంద్రబాబు. బాబు అంటే మోడ్రన్ అడ్మినిస్ట్రేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ అని బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం చదివినా తెలిసిపోతుంది.
బాబు సామర్ధ్యానికి పరీక్ష పెట్టిన ఎన్నికలు 1999 నాటివి. అసలైన ఎన్టీఆర్ వారసులెవరో ప్రజలు తమ ఓటుతో తెలియ చెప్పే ఎన్నికలు కూడా అవే. ఆ ఎలెక్షన్లలో చంద్రబాబు.. 44.14 శాతం ఓట్లతో 181 సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
తర్వాత 2004, 2009ల్లో వరుస ఓటములు ఎదురయ్యాయి. అవి ఇటు పార్టీకి కానీ, అటు బాబుకు కానీ అత్యంత కఠినమైన రోజులు. మాములుగా అయితే ఇలాంటి కష్టకాలం తట్టుకోలేక ఇతరులు పారిపోతారు. పార్టీ పట్టు జారవిడుస్తారు. కానీ బాబులో పదవి, అధికారం ఉండటం వల్ల మాత్రమే రాణించడం అనేది ఉండదు గాక ఉండదు.
బాబు- బ్లడ్ పాలిటిక్స్, బాబు- ఫుడ్ పాలిటిక్స్, బాబు- బెడ్ పాలిటిక్స్.. అవి తప్ప తనకేమీ తెలీదు. ఆ మాటకొస్తే రాజకీయమంటే అధికారంలో ఉండటం మాత్రమే కాదు.. ప్రతిపక్షంలో ఉండటంలోనే మరింత ఎక్కువ రాజనీతి ప్రదర్శించే అవకాశముందని దాన్ని కూడా విపరీతంగా ప్రేమించి అక్కడా తనదైన మార్క్ పాలిటిక్స్ తెలుగు జాతికి చవి చూపిన వన్ అండ్ ఓన్లీ లీడర్ చంద్రబాబు.
చంద్రబాబును ప్రత్యేకించి పొగడక్కర్లేదు. ఆయనేం చేశారో చెబితే చాలు.. అదే అతి పెద్ద ప్రశంసగా మారుతుంది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎంగా.. మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు చంద్రబాబు. ఆ తర్వాత 2019లో మళ్లీ మరో మారు ఓటమి పలకరించింది. అయినా సరే, అదరక బెదరక వెన్ను చూపించక.. ముందుకెళ్లి పోరాడ్డమే లక్ష్యంగా పని చేశారు. ఒక పక్క తన శ్రేణులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నారు.. మరో పక్క ఇటు తన పార్టీ లీడర్లు అరెస్టులు, దాడులు వంటి ప్రమాదాలను ఎదుర్కుంటున్నా.. ముందుకెళ్లడం తప్ప వెనక్కు మళ్లడం సాధ్యం కానిదని బలంగా నమ్మారు చంద్రబాబు. ఆ మాటకొస్తే ఆ విధంగా ముందుకెళ్లడమే బాబు మార్క్ పాలిటిక్స్ గా ఈ తెలుగు రాష్ట్రాలకు చాటి చెప్పారాయన.
2019-24 మధ్య ఆ ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ ఎన్నిరకాలుగా నష్టపోయిందో లెక్క కట్టడం చాలా చాలా కష్టం. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి పరిసర ప్రాంతం అత్యంత దారుణంగా దెబ్బ తింది. ఏ దుష్టకన్ను పడింతో..తెలియదు కానీ ఒక్కసారిగా జనం విలవిలలాడిపోయారు. ఇటు జనం మాత్రమే కాదు అటు బాబు సైతం వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలను చవి చూశారు. చివరికి ఆయన సతీమణిని సైతం అవమానించడానికి వెనుకాడలేదు జగన్ దుర్మార్గ పాలన.
అలనాడు నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానంలాంటిది చేసి చూపింది జగన్ దుర్యోధన, దుశ్శాసన పాలన. ఈ కురుసభ గౌరవ సభగా మారినపుడు మాత్రమే తాను తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతానని భీషణ ప్రతిజ్ఞ చేసి బయటకెళ్లిపోయారు చంద్రబాబు. ఆ తర్వాత 2023 సెప్టంబర్ 9న బాబు జైలుకెళ్లడం రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా నమోదయ్యింది. అయినా సరే ఆ అష్టకష్టాలకు ఓర్చి... 2024లో కూటమి కట్టి విజయ ఢంకా మోగించారు చంద్రబాబు.
ఇది 1999 ఎన్నికల నాటికన్నా అతి పెద్ద విజయంగా నమోదయ్యింది. కూటమితో ఎన్నికలకు వెళ్లినా.. కూటమి సపోర్టు లేకున్నా.. పెద్ద మొత్తంలో మెజార్టీ సాధించి బాబు తనదైన మ్యాజిక్ చేసి చూపించారు. నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యి తిరిగి నవ్యాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఒక సమయంలో నాకొక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన జగన్ జనం కూడా మాకొక్క ఛాన్స్ వచ్చి బతికి బట్టకట్టాలంటే తిరిగి చంద్రబాబు చేతికే పాలన అందించాలన్న కృత నిశ్చయానికి వచ్చారు. దీంతో ఆయన మరోమారు ముఖ్యమంత్రి పీఠమెక్కి బాబు@4. 0 పాలనకు శ్రీకారం చుట్టారు.
ఇది క్లుప్తంగా చంద్రబాబు వ్యక్తిగత చరిత్రే అయినా.. ఇది రెండు రాష్ట్రాలకు చెందిన సుమారు 10 కోట్ల మంది చరిత్ర కూడా. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ల నాటి రాజకీయ r ఉత్థాన పతనాల చరిత్ర కూడా.