బీజేపీ ముక్త దక్షిణ భారత్!
posted on May 15, 2023 8:01AM
కాంగ్రెస్ ముక్త భారత్.. ఇది గత తొమ్మిదేళ్లుగా బీజేపీ నినాదం. కాంగ్రెస్ బలహీనతల కారణంగా అత్యథిక రాష్ట్రాలలో ఆ పార్టీ అధికారంలో లేకపోయి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న భావన ఆ పార్టీలోనే కాదు.. జనంలోనూ ఉంది. ఇతర రాజకీయ పార్టీలలోనూ ఉంది. అందుకే బీజేపీ వ్యతిరేక కూటమి ప్రస్తానవ గత నాలుగేళ్లలో ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కేంద్రంగానే చర్చలు జరుగుతున్నాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో జనం ఒకింత నిరాశ చెందుతున్నారన్న మాట కూడా వాస్తవమే. కానీ కాంగ్రెస్ కొట్టింది. కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలన్నట్లుగా సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు.. అలాగే అంతకంటే ముందు మరికొన్ని కీలక రాష్ట్రాలలో ఎన్నికలు జరగడానికి ముందు, ఆ ఎన్నికలన్నిటికీ లిట్మస్ టెస్ట్ లా పరిశీలకులే కాదు.. పార్టీలూ బలంగా విశ్వసిస్తున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని అందుకుని బీజేపీని కంగు తినిపించింది. కాంగ్రెస్ ముక్త భారత్ సంగతి ఏమిటో కానీ, బీజేపీ ముక్త దక్షిణ భారత్ అని కాంగ్రెస్ డంకా భజాయించి మరీ చెప్పింది. సర్వేలే హంగ్ అన్నాయి, స్వల్ప అధిక్యత అన్నాయి. జనం నాడిని పట్టుకున్నా.. ఆది ఉన్నదున్నట్లు వెల్లడించలేని బలహీనత కారణంగా కొన్ని మీడియా సంస్థలు బీజేపీదే కర్నాటకలో మరోసారి అధికారం అనీ చెప్పేశాయి.
ఫలితాలు బీజేపీకి దిమ్మతిరిగేలా వచ్చాయి. స్వల్ప ఆధిక్యత కాదు. మ్యాజిక్ ఫిగర్ కంటే 22 స్థానాలు అధికంగా వచ్చాయి. సీఎం ఎవరన్న విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడితే పడుతూ ఉండొచ్చు. విజయం తరువాత కూడా విభేదాలు మరచి ఆ పార్టీ కర్నాటక నేతలంతా ఏకతాటిపై నిలబడి ఇచ్చిన ప్రకటనలు కాంగ్రెస్ లో కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లే కనిపిస్తోంది. సరే అది పక్కన పెడితే.. బీజేపీకి ఈ పరాజయం కేవలం పరాజయం కాదు. మసకబారిన మోడీ ప్రతిష్టకు, ఆ పార్టీ ఇంతకాలం నమ్ముకున్న హిందుత్వ అజెండాను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికీ కూడా నిదర్శనం. తన హోదా, పదవి, పరిధి కూడా మరచి మోడీ ప్రచారంలో జై బజరంగ్ బలి నినాదం చేయడం, సున్నిత అంశాలను ప్రస్తావించి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం, చివరాఖరికి ది కేరళ స్టోరీ సినిమాను ప్రమోట్ చేసి ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించడానికి ప్రయత్నించడం ఇవేమీ కూడా బీజేపీ పట్ల వ్యతిరేకతను ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం..
తేలికగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే.. ఆ రాష్ట్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు మార్గదర్శిగా అందరూ చెప్పుకునే బీఎల్ సంతోష్ జీ సొంత రాష్ట్రం. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని వాస్తవం చేయడానికి దేశంలోని రాష్ట్రాలలో బీజేపీ విజయానికి రూట్ మ్యాప్ లిఖించారని చెప్పబడుతున్న బీఎల్ సంతోష్ జీ సొంత రాష్ట్రం, అలాగే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం పార్టీ తన చతురంగ బలాలనూ దించింది. బీజేపీ జాతీయ నాయత్వమంతా కర్నాటకలో మోహరించి ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు తక్కువ వారం రోజులు ఆ రాష్ట్రంలో సుడి గాలి పర్యటనలు చేశారు. రెండు పదులకు పైగా సభలలో ప్రసంగించారు. తన వాక్చాతుర్యమంతా ప్రదర్శించి మరీ కాంగ్రెస్ అవినీతిని ఎత్తి చూపారు. ఫలితం లేకపోయింది.
చివరకు ఆఖరి క్షణంలో వారు నమ్ముకున్న భజరంగ్ దళ్ వివాదం కూడా వారికి ఓటమి నుంచి బయటపడేయలేకపోయింది. బీజేపీ పాలనలోని 40 శాతం అవినీతిని నిలువెత్తు లోతులో పారేసి గురివింద సామెతను బీజేపీకి గుర్తు చేశారు. ఎప్పుడూ సొంతగా గెలవకుండా.. రెండుసార్లు కాంగ్రెస్-జెడీఎస్ పార్టీల నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో, నిలబెట్టుకున్న బీజేపీ అధికార సామ్రాజ్యం, ప్రజావ్యతిరేక పవనాలకు ఎగిరిపోయింది.