‘భారత రత్న’ రవి శంకర్ ఇకలేరు
posted on Dec 12, 2012 @ 12:57PM
ప్రముఖ సితార్ విద్వాంసుడు, ‘భారత రత్న’ పండిట్ రవి శంకర్ ఈ ఉదయం అమెరికాలోని సాన్ డియాగో లో కన్ను మూశారు. 92 సంవత్సరాల రవి శంకర్ గత కొంత కాలంగా శ్వాస సంభందిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన లా జోల్లాలోని స్క్రిప్స్ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
సంగీత కారునిగా, కంపోసర్ గా ఆయనకు మంచి పేరు ఉంది. సంగీత ప్రపంచంలో భిన్నమైన స్టయిల్ ను ఆయన కొన సాగించారు. మన సంగీతానికి విదేశాల్లో మంచి గుర్తింపు రావడానికి రవి శంకర్ చేసిన కృషి మరవలేనిది. ఆయన యూరోప్, అమెరికాల్లో కూడా హిందుస్తానీ క్లాసిక్ సంగీత ప్రదర్సనలు ఇచ్చారు. బోధన, ప్రదర్శనల ద్వారా ఆయన ఈ తరహా సంగీతానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపును తీసుకు వచ్చారు.
1920 ఏప్రిల్ 7న ఆయన వారణాసిలో జన్మించారు. 1999లో కేంద్ర ప్రభుత్వం రవి శంకర్ ను‘భారత రత్న’ తో సత్కరించింది. 1986 నుండి 1992 వరకు ఆయన రాజ్య సభ సభ్యునిగా కూడా ఉన్నారు. మూడు సార్లు గ్రామీ అవార్డులను అందుకున్న ఘనత ఆయనదే.
ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆయనను జాతీయ సంపదగా కొనియాడారు. ఆయన మృతితో ఓ శకం ముగిసిందని ప్రధాని అన్నారు.