బామ్మా.. నువ్వు సూపరెహె!
posted on Jun 7, 2014 @ 2:32PM
ఆమె వయసు 91 సంవత్సరాలు. అందులోనూ కేన్సర్ వ్యాధికి గురై ఈమధ్యే కోలుకుంటున్న ముసలమ్మ... అయినా సరే 42 కిలోమీటర్ల దూరం మారథన్ రన్ చేసింది. ఈ దూరాన్ని 7 గంటల 7 నిమిషాల 42 క్షణాల్లో పూర్తిచేసింది. అమెరికా వాషింగ్టన్‌లోని లుకేమియా లింఫోమియా సొసైటీకి నిధుల సేకరణ కోసం నిర్వహించిన మారథాన్ పరుగులో ఆరోగ్యం సహకరించకపోయినా హారియట్ థాంప్సన్ అనే ఆ బామ్మ ఉత్సాహంగా పాల్గొంది. మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి మారథాన్‌లో చాలా సంవత్సరాల క్రితం ఒక బామ్మ పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిందట. ఇప్పుడు మన హారియట్ థాంప్సన్ రెండో బామ్మ. 42 కిలోమీటర్ల మారథాన్‌లో సగం పరిగెత్తేసరికి తన పని అయిపోయిందని తాను భావించానని, కానీ, తన మారథాన్‌ను చూస్తు్న్న వారు ఇచ్చిన ప్రోత్సాహమే తనకు మారథాన్ పూర్తి చేసే ఉత్సాహాన్ని ఇచ్చిందని బామ్మ చెప్పింది. బామ్మ విజయవంతంగా మారథాన్ పూర్తి చేసినందుకు ఈ మారథాన్ నిర్వహించిన సంస్థకు 90 వేల డాలర్లు దక్కాయి. మన బామ్మ గతంలో ఒకసారి మారథాన్లో పాల్గొంది. అప్పుడు పరుగుకు నాలుగు వారాల ముందు వరకు ఆమె 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకుంది. దాని ఫలితంగా రెండు కాళ్ల మీద విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ ఆమె పరుగు తీసింది. ఈసారి పరిగెత్తినప్పుడు బామ్మగారి 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా ఆమెతో పాటు పరిగెత్తి, ఆమెకు సాయం చేశాడు. వచ్చే సంవత్సరం నాటికి తాను బతికుంటే.. మరోసారి మారథాన్ రన్ చేస్తానని బామ్మ ఉత్సాహంగా చెబుతోంది. అందుకే.. బామ్మా.. నువ్వు సూపరెహె!