ఓటర్లు మోసం చేయరు: పద్మావతి
posted on Apr 15, 2011 @ 12:30PM
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కడప జిల్లా ఓటర్లు మోసం చేయరని శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి అన్నారు. శుక్రవారం జగన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆమె పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ఎంతమంది ఏకమైనా జగన్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు వైయస్ వారసత్వం కాంగ్రెసు పార్టీది అని చెబుతున్నారని కానీ అసలైన వైయస్ వారసులం తామేనని చెప్పారు. వైయస్‌ని తామంతా గుండెల్లో పెట్టుకున్నామన్నారు.
జగన్, విజయమ్మలను విమర్శించిన వారికి కడప జిల్లా ప్రజలు జీవితాంతం గుర్తుండేలా బుద్ధి చెబుతారని తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. జగన్ నాయకులను నమ్ముకొని రాలేదని ప్రజలను నమ్ముకొని వచ్చిన వాడన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ డి శ్రీనివాస్, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని సినీ నటి రోజా అన్నారు. వైఎస్‌ను దూషించనవారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ ఫోటో లేకపోతే ఓట్లు పడవని ఆయన ఫోటోతో ప్రచారానికి దిగాయని రోజా దుయ్యబట్టారు.