తిరుమలలో భక్తుల రద్దీ
posted on Jan 1, 2023 @ 10:31AM
ఆయన వడ్డీ కాసుల వాడు.. వడ్డీ సహా వాసులు చేస్తాడు. ఏ కారణంగా అయినా ఆయనకు ఇస్తానన్నది ఇవ్వక పోయినా, చెల్లించవలసినది చెల్లించక పోయినా వదిలి పెట్టడు. ధర్మ వడ్డీ లెక్కకట్టి మరీ వసూలు చేస్తాడు. ఇక మొక్కుకుని మరిచి పోయానంటే అసలే వదిలి పెట్టడు. ముక్కు పట్టుకుని ఈడ్చుకు వెళ్లి మొక్కులు రాబట్టు కుంటాడు. తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి వారి గురించి భక్తుల విశ్వాసం.
అయితే గడచిన రెండేళ్ళలో కరోనా కారణంగా ప్రయాణ సదుపాయాలు లేక పోవడం వల్లనైతే నేమి, కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న కారణంగా 2020 మార్చి నుంచి ఆలయంలోకి భక్తులకు టీటీడీ అనుమతించక పోవడం వల్లనైతేనీమే, దాదాపు 83 రోజులపాటు శ్రీనివాసుడికి ఏకాంతంగానే సేవలు నిర్వహించడం వల్లనైతే నేమీ, ఏడు కొండలకు భక్తుల రద్దీ చాల వరకు తగ్గి పోయింది. అయితే, ఈ ఏడాది ( 2022) కరోనా ప్రభావం తగ్గటంతో పూర్తి స్థాయిలో తిరుమల ఆలయంలోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. 2022 ఉగాది నుంచి కరోనా నిబంధనలు పూర్తిగా తొలగించారు. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది స్వామి వారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. అలానే కానుకలు, ముడుపుల, హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలోనే సమకూరింది.
సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్ హుండీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,116.25 కోట్లతో టీటీడీ బడ్జెట్ ను అంచనా వేసింది. తర్వాత దాన్ని రూ. 3,243. 19 కోట్లకు సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేశారు.. అంచనా కన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. ఇవి కరోనా రాక ముందు పద్దులు. కొవిడ్ వచ్చినప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా.. టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ 721 కోట్లు రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో వార్షిక బడ్జెట్ ను సవరించి రూ. 2,553 కోట్లకు కుదించారు. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,837 కోట్ల రూపాయలు అంచనా వేశాయి పాలక వర్గాలు.
2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 21-22ఆర్థిక సంవత్సరానికి 2,937.85 కోట్ల రూపాయలకు పాలకమండలి సభ్యులు పచ్చజెండా ఊపారు.. కోవిడ్ తరువాత భారీగా భక్తుల సంఖ్య పెరగడంతో గతంలో మాదిరే హుండీ ఆదాయంతో పాటుగా, కళ్యాణ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు వంటి రూపాల్లో ఆదాయం పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగటంతో పాటుగ హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు కానుకలు సమర్పించారు.
ఈ క్రమంలో 2022 సంవత్సరానికి గాను శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ లెక్కలను టీటీడీ విడుదల చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,35, 58,325 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే రూ. 1446 కోట్లు హుండీ, విరాళాల రూపంలో వచ్చాయి. 1,08,51,706 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 11,42,78,291 శ్రీవారి లడ్డులను భక్తులకు విక్రయించారు. అయితే వెంకన్న దేవును ఆదాయం పెరిగిన స్థాయిలో భక్తుల సౌకర్యాలు పెరగడం లేదు. మరో వంక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీటీడీలో అన్యమతస్తుల ప్రమేయం,అన్యమతస్థులు అరాచకాలు పెరిగి పోయాయనే విమర్శలు ఎకువయ్యాయి. ఇక టీటీడీలో నిధుల దుర్వినియోగం, ఆస్తుల విక్రయం వంటి ఆరోపణల గురించి అయితే చెప్పనే అక్కర లేదు. చివరకు వెంకన్న హుండీలో కానుకలు వేయవద్దని ప్రధాన అర్చకులే భక్తులకు విజ్ఞప్తి చేశారంటే .. పరిస్థితి ఏమిటో వేరే చెప్పనకరలేదని అంటున్నారు