ఇన్ స్పెక్టర్ భానోజీరావు కుర్చీలో కూర్చుని-"మా పనులన్నీ అయ్యాయి. ఇంక మీరు మా ప్రశ్నలకు జవాబు చెప్పవలసి వున్నది-" అన్నాడు.
అక్కడ శేఖరం, సత్యం, దుర్గకాక పదిమంది వున్నారు. భానోజీరావు ముందా పదిమందినీ కొన్ని పశ్నలువేసి పంపించేశాడు. వాళ్ళనుంచి అతడికి తగిన సమాచార మేదీ లభించలేదు.
మిగిలిన ముగ్గురిలోనూ భానోజీరావు ద్య్ర్గను ముందు ప్రశ్నించాడు. దుర్గ కాసేపు ఏమీ మాట్లాడలేదు.
"మీరలా మౌనం వహిస్తే ఏమీ లాభంలేదు. ఒకో సారి మీరు మామూలు సమాచారం అనుకున్నది మాకెంతో ప్రయోజనకారి కావచ్చు...." అన్నాడు భానోజీరావు.
"అడగండి-" అంది దుర్గ.
"గోపాలం గురించి మీకు తెలిసినదంతా చెప్పాలి-"
"అతడు నన్ను ప్రేమించాడు. పెళ్ళిచేసుకుంటానన్నాడు. విషయం అన్నయ్యతో చెప్పాడు. అన్నయ్య అంగీకరించాడు-"
"మీ సంగతేమిటి?"
"చిన్నప్పట్నించీ నాకు నా బావంటే ఇష్టం-బావకూ నేనంటే ప్రేమ, బావకు నన్ను పెళ్ళిచేసుకోవాలని వుంది. కానీ తండ్రి కట్నం కావాలంటే కాదనలేకపోతున్నాడు. అందుకని అన్నయ్యకు అతడంటే ద్వేషం-"
"అంటే మీ అన్నయ్య కట్నమిచ్చి బావతో పెళ్ళి జరిపించాలని మీరు కోరుకుంటున్నారా?" అన్నాడు భానోజీరావు.
"ఊఁ" అన్నది దుర్గ.
"ఒకవేళ మీ అన్నయ్య గోపాలంతో పెళ్ళి జరిపిస్తే సంతోషించి వుండేవారా?"
"చెప్పలేను-"
"గతరాత్రి మీరు గోపాలంతో మాట్లాడేరా?"
దుర్గ ఒక్కక్షణం ఆలోచించి-"లేదు-" అన్నది.
"వీధిలో గోపాలం, మీ బావ సత్యం-ఇద్దరూ పడుకున్నారు. కానీ ఒక రాత్రివేళ సత్యం ఇంట్లోకి వచ్చేశాడు. ఆ తర్వాత ఒలారీ ఆ వీధిలోంచి వెడుతూ-గోపాలం మంచాన్ని గుద్దేసింది. గోపాలం వెంటనే మరణించాడు. ఈ సంఘటనపై మీ అభిప్రాయమేమిటి?"
"యాక్సిడెంట్!" అంది దుర్గ.
"సత్యం ముందుగా లోపలకు రావడం...."
"యాక్సిడెంటల్...." అన్నదామె.
"మీరు వెళ్ళొచ్చు-" అన్నాడు భానోజీరావు.
దుర్గ వెళ్ళింది. శేఖరం వచ్చాడు.
"సత్యం ప్రమాదకరమైన మనిషి. ఇందులో వాడి చేయి వున్నదీ లేనిదీ నాకు తెలియదు. కానీ...." అని ఆగిపోయాడు శేఖరం.
"కానీ...." అన్నాడు భానోజీరావు.
"వాడు గోపాలాన్ని చంపాలని అనుకున్నట్లు నాకు తెలుసు-...."
"ఎలా?"
"దుర్గ పెళ్ళి ఎవరితో కుదిర్చినా ఆ వరుణ్ణి బ్రతకనివ్వనని సత్యం నాతో చాలాసార్లు అన్నాడు-"
"ఎందుకని?"
"కట్నమివ్వడానికి తగిన డబ్బు నావద్ద వున్నదట. అందుకని తన తండ్రి కట్నమడగడంలో తప్పులేదని వాడి వాదన-...."
"అవునూ - మీరు సత్యానికి కట్నమివ్వకూడదని ఎందుకనుకున్నారు?" అన్నాడు భానోజీరావు.
"కట్నమిస్తే వాడికే ఎందుకివ్వాలన్నది నా బాధ! అదీకాక గోపాలాన్ని నేను చిన్నతనంనుంచీ ఎరుగుదును. వాడు యోగ్యుడు. కానీ కట్నం లేకుండా నా చెల్లెల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగని వాడికే మైనా లోపాలున్నాయా అందామంటే కట్నాల బజార్లో వాడి రేటు - ముఫ్ఫై వేల దాకా వుంది. అలాంటివా డుండగా కట్నమిచ్చి సత్యానికివ్వాల్సిన కర్మ నాకేమిటి?"
భానోజీరావు క్షణం ఆలోచించి-"సత్యం గోపాలాన్ని చంపి వుండవచ్చునని మీరనుకుంటున్నారా?" అన్నాడు.
శేఖరం ఎంతోసేపు ఆలోచించలేదు-"రాత్రి నేనో దృశ్యం చూశాను-" అన్నాడతడు-"సత్యం లోపలకు మంచం మార్చుకుని గోపాలం ముఖంమీదకు ఏమో స్ప్రే చేశాడు. మధ్యలో నిద్ర చెడిపోయినపుడు నేనా దృశ్యం చూశాను. అప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించాలనుకోలేదు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే నాకా విషయం గుర్తుకు వచ్చింది-"
భానోజీరావు ఉత్సాహంగా-"మీరు చెప్పిందంతా నేను జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నాను. నిద్ర మత్తులో మీరు భ్రమపడడం లేదుగదా!" అన్నాడు.
"లేదు కానీ అప్పుడే నా బుర్ర పదునెక్కివుంటే ఈ ప్రమాదం జరిగివుండేది కాదు గదా అనిపిస్తోంది-" అన్నాడు శేఖరం బాధగా.
"ఇంకా ఏమైనా చెప్పగలరా మీరు?" అన్నాడు భానోజీరావు.
"లారీ డ్రైవర్ దిగా భావించబడుతున్న తాళాల గుత్తిమీద పుర్రె బొమ్మ వున్నదిగదా-అది స్కెలిటన్ గ్రూపుదని మీరే అన్నారు. స్కెలిటన్ స్మగ్లింగ్ గ్రూప్ నాయకుడు వరాలయ్య అని చాలామంది చెప్పుకుంటారు కానీ పోలీసుల వద్ద అందుకు సరైన ఆధారాలు లేవు. నాకు తెలిసినదల్లా మా సత్యానికీ వరాలయ్యకూ మంచి స్నేహం వున్నదన్న విషయం...." అన్నాడు శేఖరం.
"అంటే మీరు చెప్పేదేమిటి?"
"గోపాలాన్ని వీధిలో పడుకోమని ప్రోత్సహించింది సత్యం. తనూ అతడితోపాటు కాసేపు పడుకుని ఓ రాత్రివేళ లోపలకు వచ్చేశాడు. దీని అంతరార్ధం మీరే ఆలోచించండి. ఈ విషయమై ఇంక నేనేమీ చెప్పలేను-" అన్నాడు శేఖరం.
భానోజీరావు శేఖరాన్ని పంపించేసి సత్యాన్ని రప్పించాడు.
"గోపాలం చావుపై మీ అభిప్రాయం-"
"యాక్సిడెంట్-"
"కొంతసేపు వీధిలో పడుకుని తర్వాత మీరు బయట నుంచి లోపలకు పోవాలనుకోవడం...."
"యాక్సిడెంటల్-"
"మీ మరదలు దుర్గ కూడా సరిగ్గా ఇవే పదాలు ఉపయోగించింది-"
"ఆమె నా మరదలు-" అన్నాడు సత్యం గర్వంగా.
"మీ ఇద్దరిదీ ఒకేమాట కావచ్చు. కానీ ఇద్దరూ తప్పే చెప్పారు. మీరు ఇంట్లో పడుకోబోతూ గోపాలం ముఖంమీద మత్తు స్ప్రే చేయడం ఒకరు చూశారు-"
సత్యం తెల్లబోతూ-"ఎవరు?" అన్నాడు.
"చెప్పింది ఎవరైనప్పటికీ-అది నిజం!" అన్నాడు భానోజీరావు.
"నిజమే-" అన్నాడు సత్యం నీరసంగా.
"ఎందుకలా చేశారు?"
"దుర్గ గోపాలాన్ని రాత్రి ఒంటిగంటకు కలుసుకోవాలనుకుంది-"
"ఎందుకు?"
"నాకు తెలియదు-"
"అయితే మీరు గోపాలంమీద మత్తుమందు ఎందుకు జల్లారు?"
"అతడికాసమయానికి మెలకువ రాకూడదని...."
"వస్తే ఏమవుతుంది?"
"దుర్గకు అన్యాయం జరుగుతుంది!"
"ఇంతమంది వున్న ఇంట్లో దుర్గకు అన్యాయం ఎలా జరుగుతుంది?"
సత్యం తల వంచుకుని - "దుర్గ సంగతి తెలిస్తే మీరిలా అనేవారు కారు-" అన్నాడు.
"చెప్పండి-" అన్నాడు భానోజీరావు.
"మగవాడు చొరవచేస్తే దుర్గ అభ్యంతరం పెట్టలేదు...."