"ఇంకెవరైనా వీధిలో పడుకుంటున్నారా?" అన్నాడు శేఖరం.
"సత్యంగారు పడుకుంటారట-" అన్నాడు గోపాలం.
"వాడా! సరే...వాడికి నువ్వంటే ఏమాత్రం పడదు ఆ సంగతి నీకు తెలుసా?" అన్నాడు శేఖరం.
"ఏం-?" అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా.
"వాడు దుర్గను ప్రేమిస్తున్నాడు..." అన్నాడు శేఖరం.
"ఓహో! ఆయన దుర్గ బావ కదూ-నాకీ విషయమే స్ఫురించలేదు-"
"దుర్గాకే కాదు. నాకూ బావే వాడు-" అన్నాడు శేఖరం.
"అవునవును-" అన్నాడు గోపాలం.
"కానీ వాడంటే నాకు అసహ్యం-"
"ఏం?"
"వాడికి దుర్గ కావాలి. కానీ దుర్గకోసం ఏమీ వదులుకోలేడు-"
"అంటే?"
"వాడి నాన్నకు కట్నం కావాలి. నేను కట్నమివ్వనని చెప్పేశాను. కట్నం ఎగేయిడంకోసం సత్యాన్ని ఎరవేసి పట్టానని వాళ్ళ నాన్న అన్నాడు. నా చెల్లెలు తళుకుబెళుకులతో వాణ్ణి వశపర్చుకోవాలనుకుందిట. ఆయనలాగన్నప్పుడు వాడేమీ మాట్లాడలేదు. ముంగిలా కూర్చున్నాడు. మీ నాన్న మాటల్ని ఖందడించరా అని నిలదీశాను. అయినా ఏమీ అనలేదు-"
"పాపం-తండ్రి చాటు బిడ్డ కాబోలు-" అన్నాడు గోపాలం.
"అలాంటి వాళ్ళనుంచే ఆడవాళ్ళకు ప్రమాదం-" అన్నాడు శేఖరం.
"మంచి విషయం చెప్పావు. రాత్రి నేను సత్యాన్ని ఆటపట్టిస్తాను. అతడి గురించి ఏమీ ఎరుగనివాడిలా నటిస్తూ అతడిలాంటి మగాళ్ళని దుమ్మెత్తిపోస్తాను-"
"అలా ఉత్సాహపడకు. వాడు చాలా ప్రమాదకర మైన మనిషి. నాకు బాగా తెలుసు. వాణ్ణి ఆవేశపెడితే ఆ ఆవేశంలో ఏమైనా చేస్తాడు...." అన్నాడు శేఖరం.
"ఆవేశపరులను ఆపడం నాకు తెలుసు-" అన్నాడు గోపాలం.
4
గోపాలం మడత మంచం తీసుకునేందుకు గదిలోకి వెడితే అక్కడ దుర్గ వుంది. ఆమె అతణ్ణి చూస్తూ-"మీరు వీధిలో పడుకోవద్దు-" అంది.
"ఏం?" అన్నాడు గోపాలం.
"వీధిలో సత్యం బావకూడా పడుకుంటున్నాడు-" అన్నదామె.
"పడుకుంటే నాకేం?"
"వాడికి మీరంటే కోపం-"
"ఎందుకని?"
"ఎందుకో అందుకు-నా మాట విని మీరీ గదిలోనే పడుకోండి. మీ కోసం ఓ ఫ్యాను కూడా ఏర్పాటు చేస్తాను" అంది దుర్గ.
"చెమట వాసన.....భరించలేను...." అన్నాడు గోపాలం.
"చాలా తెలివిగా మాట్లాడుతున్నారులెండి. మీరు లోపల పడుకునేమాటైతే...." అంది దుర్గ.
"అయితే?"
"రాత్రి నేను మీతో కాసేపు మాట్లాడతాను...."
గోపాలం తనువు పులకించినట్లయింది. ఈమె తనను ఆశపెడుతోంది. ఎందుకు? సత్యం నిజంగా ప్రమాదకరమైన మనిషా? లేక రాత్రి ఆమె నిజంగా తనతో మాట్లాడాలనుకుంటున్నదా?
అతడి ఆలోచనలు పరిపరివిధాల పోయాయి. ఆమె అతడితో ఏదో చెప్పాలని అనుకుంటున్నది. అది సూటిగా చెప్పలేక ఇలా సత్యం గురించి చెబుతున్నది.
"థాంక్స్!" అన్నాడు గోపాలం.
"రాత్రి ఇంట్లో పడుకుంటే నేనే మీకు థాంక్స్ చెబుతాను-" అంది దుర్గ.
"చూడండి-" అన్నాడు గోపాలం-"ఈ ఎండలు అలవాటు తప్పి కొన్నేళ్ళయింది. ఈ ఉక్క నేను భరించలేకపోతున్నాను. మీతో మాట్లాడ్డంకోసం నేనీ గదిలో పడుకోగలను. కానీ మీరు లేకుండా ఒక్కక్షణం కూడా ఇక్కడి ఉక్క భరించలేను. ఫ్యాన్ వున్నా భరించలేని వేడి ఇది. మీరు రాత్రి ఎన్నింటికి నాతో మాట్లాడతారో చెప్పండి. సరిగ్గా అన్నింటికి నా పక్క లోపలకు మారుస్తాను-"
"ఏమనుకున్నదో-"రాత్రి ఒంటి గంటకు-" అంది దుర్గ.
గోపాలం మంచం తీసుకుని వీధిలో వేసుకున్నాడు. సత్యం అప్పటికే అక్కడ పడుకుని వున్నాడు. వీధి తలుపు తాళం వేసి చెవి తన జేబులో వుంచుకున్నాడు గోపాలం.
సత్యం కదలడంలేదు.
"బాగా నిద్రపట్టి వుండాలి-" అనుకున్నాడు గోపాలం. అతను తనూ పక్కమీద వాలాడు.
పెద్దగా గాలివేయడంలేదు. వీధిలో కూడా అంత బాగోలేదు. ఎటొచ్చీ లోపల పట్టినట్లుగా చెమటలు లేవు.
గోపాలానికి సత్యాన్ని లేపి ఏమైనా అనాలని వున్నది. అందుకు రెండు కారణాలున్నవి. తను ప్రేమించిన దుర్గను అతడూ ప్రేమించడం ఒకటి. దుర్గను అతడు అవమానించడం రెండవది.
"సత్యంగారూ!" అన్నాడు గోపాలం నెమ్మదిగా.
సత్యం ఉలకలేదు. పలకలేదు.
గోపాలానికి అతన్ని తట్టి లేపాలని అనిపించింది. అతికష్టంమీద అతడా కోరికను నిగ్రహించుకున్నాడు.
అతడు తన చేతికి వున్న ఎలక్ట్రానిక్ వాచ్ లోని అలారం సరిగ్గా ఒంటిగంటకు మ్రోగేలా ఏర్పాటు చేసుకున్నాడు. అతడి ఆలోచనలు సత్యాన్ని వదిలి దుర్గ చుట్టూ తిరగసాగాయి.
దుర్గ తనతో ఏం మాట్లాడుతుంది?
రాత్రి ఒంటిగంటకు తనకు ఎటువంటి అనుభవం రాసిపెట్టి వుంది?
మనసు కలలు కనమని ప్రోత్సహిస్తున్నదో ఏమో అతడికి త్వరగా నిద్రపట్టింది. అతఃడలా ఎంతసేపు నిద్ర పోయాడో ఏమోకానీ ఓ రాత్రివేళ ఎవరో అతణ్ణి తట్టి లేపారు. ఉలిక్కిపడి కళ్ళు నులుముకుని అతడు ముందు తన్ను తట్టిలేపిన మనిషిని చూశాడు.
"మీ జేబులో తాళంచెవి ఓసారిలా ఇవ్వండి-" అన్నాడు సత్యం.
గోపాలానికి కళ్ళు మూతలు పడుతున్నాయి. చాలా మత్తుగా వున్నదతడికి.
తాళంచెవి ఇస్తూ టైము చూసుకున్నాడు. పదకొండున్నర అంది.
తను దుర్గను కలుసుకొనడానికి చాలా టైమున్నది.
"తాళం చెవి మీ తలగడక్రింద వుంచుతాను-" అన్నాడు సత్యం.
"ఊఁ" అన్నాడు గోపాలం. అతడింకేమీ వివరాలడగలేదు. నిద్రమత్తు ప్రభావం అటువంటిది.
సత్యం ముందు లోపలకు వెళ్ళాడు. ఓ పదినిమిషాలుండి ఒక్కడూ మళ్ళీ బయటకు వచ్చాడు. ఈసారి అతడు మడతమంచం లోపలకు తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ బయటకు వచ్చి తాళంచెవిని గోపాలం తలగడక్రింద వుంచాడు.
అప్పుడు సత్యం ఒక్క క్షణం ఆగాడు, గోపాలాన్ని పరీక్షగా చూశాడు. అతడు మంచి నిద్రలో ఉన్నట్లు తెలుస్తున్నది. కానీ....
"ఎందుకైనా మంచిది...." అనుకున్నాడు సత్యం. అతడి జేబులోంచి చిన్న సీసా బయటకు తీశాడు. దాని మూత తీశాడు.
సీసాను గోపాలం ముఖంమీదకు వుంచి రెండుసార్లు మెత్తగా నొక్కాడు. తుస్సుమని చప్పుడయింది.
ఇప్పుడు గోపాలం గాఢనిద్ర పోతున్నవాడిలా కాక చచ్చినవాడిలా పడున్నాడు. సత్యం తృప్తిగా నిట్టూర్చి లోపలకు వెళ్ళిపోయాడు.