Previous Page Next Page 
విరాజి పేజి 38

 

     " మమ్మల్నీ , రచయితల్నీ చాలా ఘాటుగా విమర్శిన్నారే." అన్నాడు రమణమూర్తి.

    "నేను విమర్శించటం లేదు. నన్ను దహించువేస్తోన్న ఆవేదన వెళ్ళగ్రక్కుకుంటున్నాను."

    ''అయితే మీరు మా పత్రికకు సీరియల్ రాయరా?"

    "రాస్తాను మీరు అనుకున్నట్లు కాదు. నేననుకున్నది రాస్తాను,"

    "అంటే?"
   
    నాదముని లోపలకు వెళ్ళి ఓ లావుపాటి బైండ్ తీసుకొచ్చారు.

    నేనిక్కడ్నుంచి వెళ్ళిపోయాక అనేక ఊళ్ళు తిరుగుతూ, నాకు నచ్చినచోట నెలల తరబడి మజిలీచేస్తూ, దాదాపు సంవత్సర౦పాటు దీమ్ తయారుచేసుకోవడం కోసం వెచ్చింది, తర్వాత రెండుసంవత్సరాలు రాయటం మీద దీక్ష నిలిపి, అహర్నిశలూ కృషిచేసి పూర్తీచేశాను. కాని మీరాశించే కమర్షియల్ నవలకాదు. కమర్షియల్ నవలలు యింక రాయను , రాయలేను. కుత్రిమ హంగులతో భేషజాలతో , అర్బటాలతో మనసాహిత్యం ఇప్పటికే గంగ వేర్రులెత్తిపోతోంది. దీన్ని సరియైన దారిలోకి మళ్ళించడానికి నావంతు కృషి చేయదలిచాను. మీకు యిష్టమైతే యీనవల ప్రచురించండి" అన్నారు.

    రమణమూర్తి  ఆ బైండ్ అందుకున్నాడు. కాని అతని మొహంలో నిరుత్సాహం కొట్టోచ్చినట్టు కనబడుతోంది.

    "చదివి చూస్తాను" అన్నాడు నెమ్మదిగా .

    నాదముని ముందు యిదివరకు ఆ మాట అనే ధైర్యంలేదు రమణ మూర్తికి అతనికేకాదు ఏ సంపాదకుడికీలేదు. ఈ రోజు అది కమర్శినియల్ గా పనికివచ్చే నవల కాదనేసరికి చాలా తేలిగ్గా యీ మాట అని పారేశారు.

    ఒక్క క్షణంలో రచయిత తన విలువ ఎంత పోగొట్టుకుంటాడో నాదముని కర్ధమైనది. అయినా అతను కోపం తెచ్చుకోలేదు. జీవితంలోని నిజమైన విలువలు తెలుసుకున్న వ్యక్తిని యీ పై పై రాగద్వేషాలు చలింప జేయలేవు.

    "చూడండి ఫర్వాలేదు" అన్నాడు.

    తర్వాత వారంరోజులు ఆ నవల తన దగ్గర వుంచుకుని రిగ్రెట్స్ తో తిరిగి పంపించేశాడు సంపాదుకుడు.

    నాదముని తొణకలేదు.

    అతని దగ్గరకు యింకా నాలుగుయిదుగురు పత్రికలవాళ్ళు వచ్చారు అందరూ వారపత్రికలవాళ్ళే. వాళ్ళందరూ కూడా అదే సమాధానం చెప్పితాను రాసిన "గాయం" నవల యిచ్చారు ఒకరి తర్వాత ఒకరుగా అందరి దగ్గరనుంచీ అదే జవాబు రిగ్రెట్స్ తో.

    నాదముని బాధపడలేదు. తన ధోరణితో తాను యింకో ఇతివృత్తం తయారుచేసుకుంటున్నాడు.

    మరో పదిహేనురోజులు గడిచాక ఓ వారపత్రిక సంపాదుకుడు వచ్చాడు. అతను యువకుడు భావాల్లో పరిపక్వత వున్నట్లు కనిపించాడు.

    అతను నాదమునిరాసిన "గాయం" నవల తీసుకుకెళ్ళి రెండురోజుల్లోనే ఎంతో ఉత్సాహంతో వచ్చాడు. "నవల నాకెంతో నచ్చిందండీ నేను పభ్లిష్ చేస్తాను" అన్నాడు .

                               *    *    *    *   

    అనాస్తవికమైన యితివృత్తాలతో, అసహజమైన ధోరణీలో మ్రగ్గిపోతున్న నవలా సాహిత్యంలో నిర్మలంగా , స్వచ్చంగా అత్యంత సహజంగా సాగిపోతోన్న "గాయం" గొప్ప రిలీఫ్ యిచ్చింది సంవత్సరాల తరబడి ఎప్పటికయినా ఓ ఉత్తమమైన నవల వస్తుందో అని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పాఠకుల గుండెలపై పన్నీటి జల్లు కురిసినట్లయింది అవాస్తవిక సాహిత్యం చదవటానికి అలవాటు పడిపోయిన పాఠకులకు సైతం యీ నవల గొప్ప అనుభూతినిచ్చింది. వారం వారం పాఠకుల ఆదరణ విపరీతంగా పెరిగి. ఏడెనిమిది వారాలు గడిచేసరికి ఏ కమర్షియల్ నవలా అవనంత సూపర్ హిట్ అయికూర్చుంది. ఆ పత్రిక సర్కులేషన్స్ విపరీతంగా పెరిగిపోయింది. సాహిత్య ప్రపంచంలో ఆ నవల గొప్ప సంచలనం తీసుకువచ్చింది. ఏ యిద్దరు  కలసినా ఆ నవల గురించి మాట్లాడుకోవటం తప్పని సరి అయింది 'గాయం' సాధించిన విజయంచూసి దాన్ని తిరగోట్టిన పత్రికాధిపతులు ముక్కుమీద వేలేసుకున్నారు. అంతేకాదు వారు  ఎంతో తెలివిగా యితివృత్తాలుపేని, ఆయా రచయితలతో కూలంకషంగా చర్చించి, వాళ్ళతో సిడ్నీ షెల్టన్ లూ, ఇర్విన్ వాలేస్ లూ చదివించి పాయింట్లు పీకిడికి వ్రాయించి సీరియల్ గా ప్రారంభించిన నవలలన్నీ ఘోరంగా పరాజయం పొందాయి.

    ఎక్కడ చూసినా నాదముని పేరు మారుమ్రోగింది.

                                                             *    *    *    *

    నాదముని టేబుల్ ముందు కూర్చుని రాసుకుంటుంటే ఫోన్ మ్రోగింది. రిసీవ్ చేసుకున్నారు.

    "నేను గౌతమ్ ని " అని వినిపించింది అవతలనుంచి.

    "గౌతమ్! కులాసాగా వున్నావా?"

    "అదే తెలియట్లేదు."

    నాదముని నవ్వాడు. "నువ్వు వెడుతోన్న వేగంతో తెలుసుకోవటం కష్టమే!" అన్నాడు.

    "మీ నవల చదువుతున్నాను. అద్భుతంగా వుంది."

    "నీకు నచ్చిందా?"

    "చెప్పానుగా అద్భుతంగా వుందని, ఇంత గొప్పగా ఎలా రాయగలుగుతున్నారు?"

    "ఇన్నాళ్ళకి నేనేమిటో , నాకేం కావాలో తెలుసుకున్నానుగనుక ." 

    "నేనెందుకు .... నేనెందుకు తెలుసుకోలేకపోతున్నాను?"

    "ప్రతి కళాకారుడి జీవితంలో యీ సంఘర్షణ తప్పదు గౌతమ్. ఈ సంఘర్షణలో ఎప్పుడో ఒకప్పుడు వెలుగు ఆవిర్భవిస్తుంది."

    "నేను ఎదుగుతోన్న కొద్దీ చీకట్లోకి వెళ్ళిపోతున్నాననిపిస్తోంది."

    "ఇది చీకటికాదు గౌతమ్. నీకు నిన్ను పెట్టుకుంటున్న పరీక్ష ."

    "... నాకు మనశ్శా౦తి లేదు."

    "ఒక గమత్తు చెప్పనా? నాకూ మనశ్శాంతిలేదు, ఇప్పుడుకూడా."

    "గౌతమ్ ఆశ్చర్యంగా వింటున్నాడు.

    "ఒక కళాకారుడు అనుకున్నది సాధించలేకపోయినా మనశ్శాంతి వుండడు. సాధించినా మనశ్శాంతి వుండడు. ఈ అశాంతి కళాకారుడిని ఎప్పుడూ వెన్నడూతూనే వుంటుంది. కాని అరోగ్యకరమైన అశాంతికి , చాలా తేడా వుంటుంది. గౌతమ్.

    "ఏం చేసినా యీ వొంటరితనం పోద౦టారా?"

    "కళాకారుడి ఈ వొంటరితనం నీడలా ఎప్పుడూ వెన్నాడుతూనే వుంటుంది  కాని మన మనస్సు నిర్దేశించినపుడు తృప్తివుంటుంది. ఈ తృప్తి వొంటరితనం వ్యధనుంచి కొంతవరకూ రక్షిస్తూవుంటుంది."

    గౌతమ్ కు నిర్మలహృదయుడైన ఆప్తమిత్రుడు దొరికినట్లుగా వుంది.

    "గౌతమ్ నువ్వు ఎంతపైకి వెళ్ళిన, ఎంత డబ్బు సంపాదించినా ఈ వొంటరితనం నిన్ను వీడిపోదు. రంగూ, రుచీ, వాసనా తెలీని యంత్ర జీవి అయితే వీటి గురించి ఆలోచించారు. కాని అర్ధ్త్రత , సున్నితత్వం జిజ్ఞాస ఉన్నవారికి యీ శాపం తప్పదు."

    గౌతమ్ తన్మయుడై వింటున్నాడు.

    "గౌతమ్ ఇంకో సత్యం చెప్పడానికి జీవితాన్ని మన్ను మనం మరచుకుంటున్నవేళపరిపాలించేది ప్రేమ. సజీవమైన, మనకు నూటికి నూరుసార్లు కావాల్సిన ప్రేమ మనకు దక్కదు అందుకని చివరిదాకా యీ అశాంతితో పోరాటం తప్పదు గౌతం దొరికినట్లు దొరుకుతూ అనుక్షణం చేతిలో౦చిజారి పోతూవుండేది యీ ప్రేమే.

    "మీరు....."

    హఠాత్తుగా మాటమార్చి సమాజపరంగా రచయితల బాధ్యతా, వాళ్ళ వ్యామోహాలూ ప్రలోభాలూ యివన్నీ ఓ నవలకు ఇతివృత్తాన్ని తయారుచేస్తున్నారు గౌతమ్ ఇందులో ఓ స్త్రీ పాత్రకు కూడా ప్రాధాన్యత వుంటుంది. ఆ స్త్రీ ఓ కళాకారిణి అయివుండడానికి అవకాశముంది బహుశా యిద్దరు రచయితల మధ్య అడుగడుక్కి ఎదురయే పోటీ యీ నవలంతా అల్లుకుని వుంటుంది.  ఈ నవల చాలా అరిస్టిట్ గా రాద్దామనుకుంటున్నాను అన్నాడు నాదముని.

    గౌతం కళ్ళముందు ఏవేవో దృశ్యాలు గోచరిస్తున్నాయి.

    "నేనొచ్చి ఒకసారి మిమ్మల్ని కలుస్తాను" అన్నాడు గౌతమ్

    "నువ్వెందుకులేగౌతమ్ చాలా బిజీగా వుంటావు. నీ టైము నీ అధీనంలో వుండడు. నేనే వచ్చి కలుస్తాను" అన్నాడు నాదముని.

    ఫోన్ పెట్టేసి కొంచెంసేపు రిలాక్స్ అవుదామని కుర్చీలోంచి లేచే ప్రయత్నం విరమించి వెనక్కీ అనుకుని కూర్చున్నాడు.

    గుమ్మం దగ్గర అలికిడయింది.

    తలతిప్పి వచ్చిన మనిషిని చూసేసరికి అతని ముఖం సంతోషంతో వికసించింది.

    విరాజి!

    "రా విరాజీ!" అన్నాడు నాదముని చాలా ఆదరంగా.

    విరాజి అతని ముఖంలోకి చూసింది. కళ్ళలో గొప్ప తేజస్సుతో. మూర్తీభవించిన కళాస్వరూపంలా గోచరించాడు.

    దగ్గరకువెళ్ళి అతని కెదురుగా కుర్చీలో కూచుంది.

    నాదముని కూడా ఆమె వంక తన్మయంగా చూస్తున్నాడు. లోతైన ప్రపంచాన్ని అవలోకిస్తున్నట్లు వెల్గుతో నిండిన విశాలమైన కనుదోయి, ప్రతి కదలికలో మనసుని రంజింప జేసే కళాత్మకమైన భావ ప్రకటన, నిరంతర యాత్రికురాలిలా, నిజాన్ని అన్వేషించే భావుకురాలిగా, ముఖంలో నిండుతనంతో కూడిన తపనా....

    "విరాజీ! బ్వున్నావా!" అన్నాడు నాదముని.     

 Previous Page Next Page