ఏం తెలుసుకుంటావు నా గురించి ? తెలుసుకుని చేసేదేముంది? మూర్ఖుడా! యిక్కడ్నుంచి వెళ్ళిపో."
అతని జవాబుకోసం ఎదురుచూడకుండా వెనక్కీ తిరిగి సందులోకి వెళ్ళిపోయి చీకట్లో మాయమైపోయింది.
ఒక్క నిముషం నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అతని వెన్నుమీద ఎవరోచరిచినట్లయింది.
నెమ్మదిగా తేరుకుని అక్కడ్నుంచి కదిలి గదివైపు సాగిపోయాడు.
* * * *
రాత్రి రెండు గంటలకు .....
గదిలో వొంటరిగా కూర్చుని తాను రాసిన నవలలోకి ఒక్కొక్కడు పెజీతీసి నిర్ధాక్షిణ్యంగా చించి ప్రక్కన ఓ గుట్టగా పోస్తున్నాడు గౌతమ్.
ఒక విధమైన కసితో, బాధతో అలుముకున్న అరుణిమతో అతని కళ్ళు రెండు నీలాల్లా మెరుస్తున్నాయి.
జీవితం గురించి ఏమీ తెలుసుకోకుండా జటిలమైన సమస్యలన్నీ నిశితంగా పరిశీలించకుండా కేవలం మేధస్సుమీద ఊహలమీద ఆధారపడటం అహంభావం కాదు, అజ్ఞానం.
నేనెప్పటికీ ఉత్తమ రచయితను కాలేను, నాకున్న శక్తి చాలదు.
నా కృషి సరిపోదు. చేతికి ఏదోస్తే అది రాసేవాడు ఎప్పటికీ ఉత్తమ రచయితా కాలేడు.
పేజీలన్నీ , అతను రోజుల తరబడి రాత్రింబవళ్ళు కష్టపడి రాసిన పేజీలన్నీ చిమ్చటం పూర్తయింది. ఆ ముక్కలన్నీ గుట్టగా ప్రోగుచేసి , ఆల్మైరాలోంచి అగ్గిపెట్టెతీసి అంటించాడు.
చిన్నమంట మొదలై _ క్రమంగా పైకిలేస్తోంది.
ఆ వెలుగులో నిర్భయంగా , కొంచెం క్రౌర్యంతో ప్రకాశించే అతని కళ్ళు యిప్పుడు పూర్తీ కెంపులా మెరుస్తున్నాయి.
2
ప్రొద్దుటే పెట్టెలో డబ్బులు చూసుకున్నాడు. పాతికరూపాయలు కంటె లేవు.
ఈ పాతికరూపాయలతో జాగ్రత్తగా అయిదారుజులు గడుపుకోవాలి.
తర్వాత .....?
అతనికి నవ్వు వచ్చింది. తర్వాత ఏదో వస్తున్నట్లు , జరగబోతున్నట్లు వెర్రి ఆశ .
ఈ ఆశతోనే రెండుమూడేళ్ళబట్టీ గడిపేస్తున్నాడు. ఎక్కడ్నుంచి వొస్తుంది? తనేమయినా ఉద్యోగం చేస్తున్నాడా? పోనీ ఉద్యోగం చేయటానికి యిష్టపడుతున్నాడా?
ఏదో జరుగుతుంది. అంతే, తెగింపు.
రాత్రి కాల్చేసిన కగీతాలన్నీ నుసిగా మారిపోయి __ కిటికిలోంచి దూసుకు వస్తున్న గాలికి చెదిరిపోతోంది. వాటివంక ఓసారి అనసక్తంగా చూసి, బయట పారబోయించటానికి ఏ పాత పేపరులోనికి ఎత్తుతున్నాడు. సొంత బిడ్డ చనిపోతే, దాహానం చేశాక అస్థికలు సమీకరిస్తున్న అనుభూతి కలిగింది. ఒకటి రెండు నిమిషాలపాటు వైరాగ్యభావం .... ఇంచుమించు మూడునాలుగునెలల కష్టం బూడిదైపోయింది. కాని అంతలోనే తేరుకుని. బాధనో అలాంటి భావాన్నో పారద్రోలేసుకుని పేపరులోకి ప్రోగుచేసిన ఆ నుసినంతా బయటకు తీసుకొచ్చి పారబోసేశాడు.
ఆప్రయత్నంగా అతని చూపులు ఎదుటి మేడమీదకు వెళ్ళాయి. కిటికీలోంచి ఓ జతకళ్ళు అతన్ని చూసి నవ్వినట్లనిపించింది. ఎందుకానవ్వు? తన యింట్లో పని తాము చేసుకోవటం తప్పా? వాళ్ళింట్లో చేసుకోరా?
స్నానంచేసి పదిగంటలకల్లా గాడికి తాళంపేట్టి బయటకు బయల్దేరాడు.
* * *
వారపత్రిక ఆఫీసు ముందు నిలబడి కాసేపు టాటాపటాయించాడు. గేటు దగ్గర ఓ ఘుర్ఖా నిలబడివున్నాడు. అతను చూస్తుండగానే రెండు మూడు కార్డు లోపలకు వెళ్ళిపోయాయి. కొంచమాగి అతనుకూడా లోపలకు పోబోయాడు.
గేటు దగ్గర ఘూర్ఖా అతన్ని ఆపాడు.
"ఎవరికోసం?' అని హిందీలో అడిగాడు.
"వీక్లీ ఎడిటర్గారు"
"టైం ఆఫీసులో చెప్పండి"
ప్రక్కనేవున్న తిమాఫీసులోకి వెళ్ళాడు. అక్కడ కౌంటర్ మీద రెండుమూడు ఫోన్లు వున్నాయి. వాటివెనుక ఒకతను ప్రపంచాన్ని పరిపాలిస్తూన్నంత ధీమాగా కూర్చుని వున్నాడు.
"ఏంకావాలి?" అన్నట్లు చూశాడు పెదవి కదపకుండా.
"వీక్లీ ఎడిటర్ గారు"
"మీ పేరు?"
యీసారి దయదలిచినట్లు మాట్లాడాడు.
చెప్పాడు.
"ఏం చేస్తారు?"
"రచయితని "
"అది సరే , ఏం చేస్తారు?"
"ఇంకేటీ చెయ్యను. రచనలు చేస్తాను"
"ఉద్యోగమేమీ చెయ్యరా?"
"ఎడిటర్ గారని కలుసుకోవాలంటే వీటన్నింటికి జవాబు చెప్పాలా?" అన్నాడు యిహా కోపమాపుకోలేక.
"అక్ఖర్లేదుగానీ" అని అతను ఒక వక్రచాలనంచేసి "ఏమిటన్నారు మీ పేరు గౌతమ్ కదూ . ఎక్కడా మీ పేరు వినలేదే" అన్నాడు కవ్వించటానికన్నట్లు.
"విని వుండరు లేండి"
"బహుశా పిల్లరచయిత అయివుంటాడు." అని తనలో తాను అనుకున్నట్లుగా ఎదుటి మనిషికి వినిపించేట్టట్లుగా అని రిసీవరెత్తి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడాడు.
"ఎడిటర్ గారు నాదముని గారితో మాట్లాడుతున్నారట. కాసేపు వెయిట్ చెయ్యమన్నారు" అన్నాడు గౌతమ్ వంక తిరిగి.
గౌతమ్ ఏమీ జవాబివ్వకుండా అక్కడున్న బెంచిమీద కూర్చుకునేందుకు వెడుతున్నాడు.
"నాదముని గారంటే తెలుసుకదా"
గౌతమ్ తెలుసుకున్నట్లు తల ఊపాడు.
"ఏం తెలుసు?"
"రచయిత"
"వొట్టి రచయిత కాదు. మహారచయిత . ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. అయన సీరియల్స్ కోసం పత్రికలూ ఎగబడతాయి. అయన కథలు వేలకువేలిచ్చి సినిమా వాళ్ళు కొంటున్నారు"
తెలుసునున్నట్లు గౌతమ్ తల ఊపాడు.
"బహుశా ఎడిటర్ గారు ఆయనతో కొత్త సీరియల్ ప్లాన్ చేస్తున్నట్లున్నారు. అయన ఊ అంటే చాలు. వొచ్చే వారంనుంచీ పభ్లిసిటీ మొదలపోతుంది. అలాగా ఎనిమిది వారాలు పబ్లిసిటీ మ్రోతమోగిపోయాక, ఒక్కో ఇన్ స్టాల్ మెంట్ చొప్పున మేటర్ వస్తూవుంటుంది."
"గౌతమ్ వినీవిననట్లు ఊరుకున్నాడు.
ఓ పావుగంట గడిచాక _ బయట కారేదో స్తారీ అయిన చప్పుడు వినిపించింది. గౌతమ్ తలత్రిప్పిచూశాడు, తళతళ మెరుస్తున్న నీలం రంగు ఫియట్ కారు. కారు డ్రైవర్ చేస్తున్నా వ్యక్తి ముఖం సరిగ్గా కనబడలేదు. బహుశా నాదముని అయివుంటాడనకున్నాడు.
కౌంటర్ మీద ఫోన్ మ్రోగించి. టైమ్ కీఫర్ ఫోన్ రిసీవ్ చేసుకుని గౌతమ్ వంక తిరిగి "మీరు వెళ్ళండి. ఎడిటర్ గారి దగ్గరకు" అన్నాడు.
గౌతమ్ లేచి లోపలకు వెళ్ళాడు. చాలపెద్ద ఆఫీసు. కొంతమంది కుర్రాళ్ళు అటూఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. టేబుల్స్ దగ్గర ఎవరెవరో కూర్చుని పనిచేసుకుంటున్నారు.