Previous Page Next Page 
భారతి పేజి 9

    ఆమెకు భయం వేసింది. తనంటే  అసహ్యం వేసింది. "ఓయ్ భగవంతుడా? నీకిదేం బుద్ధి?" అనుకుంది నిట్టూరుస్తూ. తల ఎత్తి ఆకాశం వైపు  చూస్తూంది  ఎవరినో  తిట్టుకుంటూ.

    ఇంతలో వెనుక నుండి  ఏవో ధ్వనులు....అరుపులు, ఆమె త్రుళ్ళిపడి  వెనక్కి తిరిగి చూసింది. ఎంతోమంది జనం....రాళ్లూ రప్పలూ. కర్రలూ, కుళ్ళిపోయిన  పళ్ళు  పట్టుకుని  గుంపుగా, వేగంగా వస్తున్నారు ఆమె వైపు. వాళ్ళ కేకలు  ఆమె కర్ణపుటాలను ఛేదిస్తూ సోకినాయి.

    "కుష్టుముండ. ఊళ్ళోకి వస్తుందా? దాన్ని తన్నండి. చంపండి!"

    హడలిపోయింది. బాప్ రే! తన కంత్యకాలం  సమీపించింది. ఒక్క ఉదుటున తేరుకుని పరుగెత్తసాగింది.
    "పారిపోతోంది, పట్టుకోండి, తన్నండి, చంపండి!"

    గుంపు ఆమె వెంటబడి  తొందర తొందరగా  కదిలి వస్తూంది. ఆమె చెమటలు గ్రక్కుతూ ఆయాసంతో వక్షస్థలం  ఎగిరి పడుతూండగా  ప్రాణభయంతో  పరిగిడుతూంది. అయినా ఆడది, ఎంతకని తప్పించుకోగలదు. గుంపు దగ్గర పడుతూంది. విసిరేస్తున్నారు  రాళ్లూ, కుళ్ళువాసన  కొడుతూన్న పళ్ళూ, గాజుపెంకులూ.

    ఆమె ఒడలంతా  గాయాలు, చీరుకుపోయి, గీరుకుపోయి రక్తం ప్రవహిస్తూంది. ఆ గాయాల నుండి ఒళ్ళంతా మంటలు, బాధ.

    ఉన్నట్లుండి చీరకుచ్చెళ్ళు  పాదాలకు అడ్డుతగిలి  గభాలున క్రింద పడిపోయింది. పడిపోతూ  అంతిమ ఆశ క్షీణిస్తూండగా  తల వెనక్కి త్రిప్పి  చూసింది. వచ్చేస్తున్నారు  వాళ్ళు దగ్గరకు. ఆయాసంతో ఉక్కిరి బిక్కిరవుతూ చూస్తూంది. వచ్చేశారు. చుట్టూ క్రమ్మేశారు. నోటికి వచ్చినట్లు వదరుతున్నారు. మీదకు వస్తున్నారు.

    ఒకడు వికారంగా పళ్ళికిలిస్తూ  ఆమె తలను వెయ్యి  ప్రక్కలు చేయటానికి  కర్ర పైకి ఎత్తాడు.

    వణికిపోతూ, కళ్ళు గట్టిగా  మూసుకుని  ఒక్క పెనుకేక వేసింది.

    భారతి కళ్ళు విప్పి చూసింది. గోడనున్న దీపం  గాలికి  రెపరెపలాడుతూ  ఆరిపోవటానికి  సిద్ధంగా వున్నట్లు  భ్రమ కలిగిస్తూంది. తను నిజంగానే వణికిపోతూంది. కాని నిజంగానే  గావుకేక  పెట్టిందా? అది మట్టుకు లేదు. పెట్టి వుంటే ప్రక్క  మంచంమీద  పడుకుని  నిద్రపోతూన్న  పిన్నికి తప్పక మెలకువ వచ్చేది. ఆమె మూగది  అయితే కావచ్చుగాని చెవుడు మాత్రం లేదు.

    హఠాత్తుగా భారతి  రెండు చేతుల్లో  తలదాచుకుని  వెక్కి వెక్కి ఏడవసాగింది  గుండెలు బ్రద్దలయేటట్లు  ప్రాణం  శోషపోయేటట్లు  ఏడుస్తూంది.

    తొలికోడి  కూసింది. తరువాత  ఎప్పటికో  హరిదాసు ఒకడు  గజ్జం చప్పుడుతో కీర్తన పాడుకుంటూ  సంచారానికి బయలుదేరాడు. చాలామందికి  భళ్ళున  తెల్లవారింది. భారతికి అలాకాదు. పది యుగాల తరువాత తెల్లవారుతూన్నట్లుంది. తూర్పున  తొలిరేఖలు  తెల్లతెల్లగా విచ్చుకుంటున్నాయి. భారతి ఏడుస్తూనే వుంది.


                                                                          *    *    *


    పెళ్ళివారి అంతస్తూ, వైభవమూ చూసి భారతి నిజంగా  భయపడిపోయింది. పది రోజుల నుండీ  తండ్రి ఇంటిపట్టున వుండకుండా  ఇంచుమించు నూజివీడులోనే  మకాంపెట్టి  కావలసిన ఏర్పాట్లన్నీ  చేస్తున్నాడు. డబ్బు మంచినీళ్ళలా  ఖర్చు  అవుతున్నది .ఈ డబ్బంతా ఆయన ఎక్కడ నుంచి  తెస్తున్నాడో, ఈ మహాభారాన్ని  భుజస్కంధాల మీద ఎలా భరిస్తున్నాడో  భారతికి  అర్ధమయేది కాదు. ఆలోచించలేక పోయేదికూడా.

    ఇరువైపులా  ఏర్పాట్లన్నీ  గంగాధరంగారే  పర్యవేక్షణ చేస్తూ శ్రద్ధగా జరిపిస్తున్నట్లున్నాడు .గౌరీపతిగారి కుటుంబం, అతిధులు  వుండటానికి  ఒక పెద్ద ఇల్లూ, పెళ్ళివారి విడిది క్రింద మరో పెద్ద భవనమూ తీసుకోబడ్డాయి. పెళ్ళివారు బిలబిలమంటూ  ఎక్కడెక్కడి నుంచో  దిగుతున్నాం. వాళ్ళ బలగం ,సిబ్బందీ  చూసి భారతి ఆశ్చర్యపడింది. ఆమెను పెళ్ళివారింటికి కూడా  తీసుకువెళ్ళి  చూపించారు. అది చాలా విశాలమైన, ఎత్తైన సౌధం, ఆ వూళ్ళో అంత పెద్ద భవంతులు రెండు మూడుకంటే  ఎక్కువ లేవు.
                 
    పెళ్ళికి మల్లిక వచ్చింది. భారతి  మల్లికను క్షణం  విడిచి పెట్టకుండా  చెంగు పుచ్చుకుని కూడా  తిరుగుతూంది. తనని  విడిచి  ఆమె నెక్కడికి కదలనియ్యటం లేదు.

    నువ్వు చాలా అదృష్టవంతురాలవు  భారతీ!" అంది ఆమె ఒకసారి  గదిలో  ఇద్దరూ ఒంటరిగా  కూర్చున్నప్పుడు.

    "ఏం అదృష్టమో! భయంతో నాకు  ఊపిరి ఆగిపోయేటట్లు  వుంది. ఈ డబ్బుతో తులతూగే  మనుషులూ, అంతులేని చుట్టాలూ, ఎడ తెరిపిలేని  హడావుడీ__ ఈ వాతావరణంలో  ఒక్కదాన్నీ  ఎలా నెట్టుకు రాగలనా అని హడిలిపోతున్నాను మల్లికా! నన్ను చూస్తే నీకు జాలి వెయ్యటంలేదూ?" అన్నది భారతి దీనంగా  ముఖంపెట్టి.

    స్నేహితురాలి ముఖం  చూసిన  మల్లికకు నవ్వు వచ్చింది. "భారతీ! ఈ అమాయకత్వమంతా పదిరోజుల్లో  ఎగిరిపోతుంది సుమా! ఆ రోజున మాబోటి వాళ్ళు మీ యింటికి వస్తే నువ్వే విసుక్కుంటావు  ఈ బెడదేమిటని?" అంది చిలిపిగా.

    "పో దొంగా, అన్నీ నేర్చుకున్నావు" అంది భారతి ఆమె భుజం కొద్దిగా  త్రోసి.

    భారతిని కాబోయే అత్తవారి  యిల్లు  చూపించటానికని  తీసుకువెళ్ళిన  రోజున  ఆమె స్నేహితురాల్ని కూడా  రమ్మని బలవంతం చేసింది. కాని ఆమెను తీసుకుపోవటానికి  వచ్చింది  సాక్షాత్తూ  అత్తగారే కావటంవల్ల  మల్లిక సౌమ్యంగా ప్రక్కకు తప్పుకుంది.

    రంగాజమ్మగారు ఇంకా  నలభయ్యో ఏట అడుగుపెట్టని, ఒక శాంతిరేఖ వంటి మహిళ. ఆమె ముఖంలోని  సౌమ్యభావం, ఉట్టిపడే కళాకాంతులూ, పొంగిపొర్లే  ఆపేక్షా చూసి  విస్తుపోయింది భారతి. "ఈ సౌజన్యమూర్తా నా అత్తగారు? ఈ విధంగా  నా అదృష్టానికి  అవధులు లేవు" అని పొంగిపోయింది.
 
    కారు దిగాక కోడలి చేయి పట్టుకుని ఆపేక్షగా  లోపలకు తీసుకుపోయిందావిడ. భారతి కళ్ళప్పగించి  ఆశ్చర్యంగా చూస్తూ  వుండిపోయింది. హుందాగా, ఠీవిగా, పురాతనపు ఔన్నత్యాన్ని సూచిస్తూ నిలబడివున్న ఎత్తైన సింహద్వారాలూ, ఖరీదైన సోఫాలతో, రంగురంగుల తివాచీలతో, గోడలకు అమర్చిన శిల్పాలతో నిండివున్న  ముఖ్యమైన క్రిందిహాలూ, విశాలమైన మిగతా గదులూ, వాటిలోని విలువైన సామగ్రితో  అవటానికి చిన్న బస్తీయే అయినా ఏ పట్టణంలోనో  ఉండవలసిన సుందరభవనంలా  కనిపించిందామెకు.

    "ఇదిగో, ఇది మా పడకగది. మేము క్రిందే పడుకుంటాము. బాబు మాత్రం పైనే పడుకుంటాడు. అతనికి నలుగురిలోనూ  వుంటే  ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా  వుంటుంది. ఎవరితోనూ సులువుగా  కలిసిపోయే  స్వభావంకాదు. మరి నీతో ఎట్లా  కలిసిపోయిందో!" అంది నవ్వుతూ రంగాజమ్మగారు.

    భారతికి సిగ్గుతో  భూమిలోకి తల క్రుంగిపోయి, బుగ్గలు ఎరుపెక్కాయి.

    రంగాజమ్మగారు ఆమె చుబుకాన్ని  పట్టుకుని  ముఖాన్ని మృదువుగా  పైకెత్తుతూ  అంది. "సిగ్గంతా  ఇప్పుడే ఖర్చు పెట్టుకుంటే  ఎలా గమ్మా కోడలా! ముందు ముందు కొంత అవసరమవుతుంది_దాచిపెట్టుకో. ఏదీ? చక్రాల్లాంటి  నీ కళ్ళు  రెపరెపలాడటం  అబ్బాయీ తప్ప నేను చూడకూడదా? కళ్ళు తెరు మరీ!" అంది.

    భారతి బలవంతంగా  కన్నులు  తెరిచి  "పొండి అత్తయ్యా! మీరు కూడా!" అంది అప్రయత్నంగా.

    "ఏం అమ్మా! నువ్వనుకున్నది నేను బయటకు  చెప్పానా? పద, పైకి పోదాం" అంది చెయ్యి పుచ్చుకుని  ముందుకు తీసుకుపోతూ.

    మెట్లెక్కుతుండగా  అంది! " ఈ ఇంట్లో  పట్టింపులకూ ,ఆవారాలకూ  చోటులేదు. అందుకనే 
పెళ్ళికూతుర్ని  పెళ్ళి అవకుండానే  ఇక్కడికి  తీసుకురావటానికి అభ్యంతరం లేకపోయింది. కొన్ని పద్ధతులు మంచివే"

 Previous Page Next Page