ఆ అరవిచ్చిన గులాబీపువ్వు సౌందర్యంతో పోటీపడగలదనిపించే రూప ముఖసౌందర్యం వంక రెప్ప వెయ్యకుండా చూస్తూ, "పిన్నలనుండి పెద్దలవరకూ ఒకటే బుద్ధి. చెట్టుమీది పువ్వు చటుక్కున కోసి వాసన చూస్తేగాని మనస్సుకు సంతృప్తిలేదు. కోసిన పువ్వు చేతిలో తన రేకుల్ని విడగొట్టుకోని సోయగాన్ని కోల్పోయి చూడరాకుండా నలిగిపోతుందని తెలుసు. అయినా, పువ్వు కోయాలనే అనిపిస్తుంది మనిషికి" అన్నాడు.
"ఎలాగూ ప్రకృతిధర్మంలో తమ అందాలు కోల్పోయి లయించిపోతాయని మనిషి వాటిని కరుణించడు. క్షణకాలమైనా వాటి సౌందర్యాన్నీ, సుగంధాన్నీ అనుభవించాలనుకొంటాడు. అతడిది తప్పులేదు."
'బ్రతికాం', అనుకొన్నాడు కళ్యాణ్.
"మీ అక్కగారు రాలేదా?" అంటూ ఇంట్లోకి దారి తీసింది రూప, గోకుల్ ను కిందికి దించి చెయ్యిపట్టి నడిపిస్తూ.
"ఇవాళ ఏకాదశికదూ? పూజలూ, ఉపవాసమూను. ఏమీ అనుకోవద్దన్నది."
గదులు గదులుగా ఉన్న ఆ పెద్ద ఇంటిని చూచి ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. "ఉండేది మీరొక్కరేకదూ? ఇంత ఇల్లెందుకు?" అన్నాడు హాలులో ప్రవేశించాక.
"కావలసినంతే పెట్టుకొని తక్కినది కూలగొట్టెయ్య మంటారా?" తమాషాగా నవ్వింది.
"అదికాదు. ఇంత ఇల్లు అద్దెకు తీసుకున్నారెందుకూ అని."
"అద్దెకు కాదండోయ్. అయితే నా జీతమంతా తగలేసినా ఇంత ఇల్లురాదు. ఇది మా వదిన ఇల్లు. ఆవిడ తల్లికి ఒక్కతే సంతానం. తల్లి ఆస్తంతా ఆమెదే."
"ఓహో!"
కాలేజీలో తీయించుకొన్న గ్రూప్ ఫోటో ఒకటి గోడన వేలాడుతూంది. కళ్యాణ్ పరిశీలనగా చూచి, "మీకు కుడిపక్కనున్న ఆమెపేరు రత్నకదూ?" అని అడిగాడు ఆశ్చర్యకుతూహలాలతో.
"రత్నే. మీరెరుగుదురురా?"
"రైల్లో పరిచయం. అంతే ఆమెది ఏ ఊరో మీకు తెలుసా?"
"తెలియదు కాని, ఇక్కడికి సమీపంలోనే ఏదో పల్లెటూరు అనుకొంటాను. తండ్రి లేడనీ, తల్లికి ఒక్కతే సంతానం అనీ, బాగా స్థితిపరులనీ తెలుసు. ఇంటర్ నుండి ఎమ్. ఎ. వరకు నా క్లాస్ మేట్. యూనివర్శిటీకి రెండవదిగా పాసయింది. తరవాత ప్రేమించిన లెక్చరర్ తో వివాహమై అత్తవారి ఇంటికి వెళ్ళిపోయింది.
"ఆమె అత్తవారి ఊరైనా మీకు తెలుసా?"
"తెలియదు. మీకెందు కామె సంగతి?"
"ఊరికేనే!" ఒక్క నిట్టూర్పు విడిచాడు కల్యాణి. ఒకవిధంగా సంతృప్తి చెందాడు, 'గోకుల్ తల్లితండ్రుల రహస్యం ఇలాగే తెలియకుండా దాగిపోవడమే నయం' అనుకొని.
భోజనానంతరం తాంబూలచర్వణం చేస్తూ కూర్చొన్నాడు కళ్యాణ్.
రూప పడకగదినుండి ఏదో ఫోటో తీసుకువచ్చాడు గోకుల్. కళ్యాణ్ కి ఇస్తూ "అమ్మ జోత ఎత్తమంతే పెత్తాను దీనికి" అని చెప్పాడు.
"అమ్మా? అమ్మ ఎవర్రా?"
గోకుల ద్వారంకేసి వేలు చూపించాడు, వంటింట్లో పని ముగించుకొని వస్తూన్న రూపను చూసి.
"ఎవరు చెప్పారు, ఆమెను అమ్మ అనాలని?"
తిరిగి రూపవంకే చూపాడు.
ఆ చర్యలో ఏదో అర్ధం స్ఫురించగా క్రీగంట వీక్షించాడు రూపను. సిగ్గుతో అరుణిమా దాల్చవలసిన ఆమె ముఖం నల్లబడింది.
"తేబుల్ మీదుంతే కులిచీ ఎక్కి తెచ్చా." కళ్ళు తిప్పుతూ చెప్పాడు ఏదో ఘనకార్యం చేసినట్లు. ఫోటో కింద వ్రాసి ఉంది, 'కిషన్' అని.
కళ్యాణ్ ఆశ్చర్యసంభ్రమాలతో అన్నాడు: "ఇతడు ప్రఖ్యాత చిత్రకారుడు కిషన్ కదూ?"
తల ఊపింది రూప. "మీకు తెలుసా?"
"తెలియకపోవడమేమిటి? ఏదో చిత్రకళాప్రదర్శనంలో ఇతడిలో పరిచయమయింది. పాపం, పాముకాటుతో చనిపోయాడని ఆమధ్య పత్రికలో చదివాను. ఇతడు మీకు బాగా తెలిసినట్లుంది?"
"మా ఊరివాడు; మా బంధువు. సెలవుల్లో సరదాపడి ఇతడి దగ్గిర చిత్రాలు గీసేందుకని వెళ్ళేదాన్ని. రెండేళ్ళు అవుతూంది ఇతడు చనిపోయి," విచారంగా చెప్పింది.
"ఇతడికి నమస్కారం పెట్టించారా గోకుల్ చేత? ఎందుకూ?"
"అంతటి కీర్తిపురుషుడు కావాలని బాబు." ఏదో ఒకటి చెప్పక తప్పదన్నట్లు చెప్పింది, ఫోటో అందుకొంటూ.
ఫోటోకు పూజ చేస్తున్నారనడానికి గుర్తుగా కుంకుమచారికలు ఉన్నాయి. సందేహాందోళనలకు లోనయింది కళ్యాణ్ హృదయం. 'అతడి ఫోటో పెట్టు కొని పూజించేటంత సన్నిహితత్వం ఏర్పడిందా అతడితో రూపకు?'
ఫోటో లోపలపెట్టేసి వచ్చింది రూప, చిరునవ్వు ముఖంతో. అభ్యంగనంవల్ల ద్విగుణీకృతమైన ఆమె సౌందర్యం కళ్యాణ్ ఆలోచనలను పారదోలింది.
కళ్యాణ్ సోఫా వెనక నిలబడి అతడి వీపుమీద వాలి ఉన్న గోకుల్ తో ఆట ప్రారంభించింది రూప. వంగి గోకుల్ ను ముద్దిడుకున్నప్పుడల్లా రూప చెంప కళ్యాణ్ శిరసును తాకుతూంది. సోగవెంట్రుకలు అతడి భుజాలమీద జీరాడుతూన్నాయి ఆమె ఆడుతున్నది గోకుల్ తోనో తనతోనో తేల్చుకోలేకపోతున్నాడు కల్యాణ్. రూపకు బహుమతిగా ఇవ్వడానికి తెచ్చిన పుష్యరాగం పొదిగిన ఉంగరం గోకుల్ చేతికి ఇచ్చి, "అమ్మకియ్యి, నాన్నా" అన్నాడు.
"బాబు చేతినుండి ఇస్తే అతడు ఇచ్చినట్లే, మీరిచ్చినట్లు కాదు." నవ్వుతూ అన్నది.
"అయితే, వెయ్యి ఇలా ఇయ్యి." గోకుల్ నుండి ఉంగరం తీసుకొని ఆమె చేతిని చనువుగా అందుకొన్నాడు, రూప ముఖపద్మం చుట్టూ చూపులభ్రమరాలను భ్రమింపజేస్తూ.
కోమలంగా ఉన ఆమె చేతివేలికి ఉంగరం తొడుగుతూ కళ్ళలోకి ఓరగా చూచి సొగసుగా నవ్వాడు. "వలపుబాస లేమైనా చెయ్యవా, రూపా?" చిలిపిగా, మృదువుగా అన్నాడు.
రూప ముఖం వెలవెలబోవడం అతడు గుర్తించనే లేదు. ఆమె ముఖాన్ని రెండు చేతులా అందుకొని ఆమె పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టుకొంటూ పక పక నవ్వాడు..
బెదిరిపోయిన లేడిలా కళ్యాణ్ చేతిలో నొక్కబడుతూన్న తన చేతిని విడిపించుకొని ముఖం చేతుల్లో దాచుకొని పరిగెత్తి పోయి పడక గదిలోపడి తలుపులు బిగించుకొంది.
"రూపా! రూపా!" కంగారుగా తలుపు తట్టాడు కళ్యాణ్. వెక్కివెక్కి ఏడుస్తున్నట్లు వినిపించి నిశ్చేష్టుడయ్యాడు. "రూపా, తలుపు తియ్యి!"
తలుపు తెరవబడలేదు. ఏడుస్తూన్న శబ్దం వినిపిస్తూనే ఉంది. కళ్యాణ్ కిటికీదగ్గరికి వెళ్ళి లోనికి తొంగిచూశాడు. మంచంమీద బోర్లాపడి కుమిలికుమిలి ఏడుస్తూంది రూప. ఏం చెయ్యాలో తోచలేదతనికి.
"నా మాట వినండి. మీరు ఇవ్వని చనువు ఏమైనా నేను తీసుకొని ఉంటే క్షమించండి. వస్తానిక." మందస్వరాన అన్నాడు. గోకుల్ ను ఎత్తుకొని బయటపడ్డాడు.
కృష్ణప్రియ వరండాలోకే 'ఎదురు వచ్చింది. "ఏమంటూంది, నీ రాజకుమారి? మెప్పించే పని ఏమైనా చేశావా, లేదా?"
"నమ్మకూడని ఆడది. దాని మాట ఇంక ఎత్తకునాదగ్గిర." చరచరా తన గదిలోకి వెళ్ళిపోయి విసురుగా తలుపు వేసుకొన్నాడు కళ్యాణ్.
ఆశ్చర్యపోయింది కృష్ణప్రియ, తమ్ముడి ప్రవర్తనకు "ఏం జరిగింది, కృష్ణా? ఏదీ చెప్పకుండా తలుపులు బిగించుకు కూర్చొంటే ఏమనుకోవాలి నేను?" తలుపు తట్టి,తట్టి విసిగిపోయింది.
సాయంత్రం నాలుగింటికి హాస్పిటల్ కు వెళ్ళడానికి బయటికి వచ్చిన తమ్మున్ని చూచి ఒక్క నిట్టూర్పు విడిచింది కృష్ణప్రియ. తాగినవాడి కళ్ళలాగ అతడి కళ్ళు అరుణిమ దాల్చిఉన్నాయి!
* * *