కళ్యాణ్ కొట్టిన బంతి రివ్వున వస్తూంది. బాట్ ఎత్తి పరిగెత్తాడు గోకుల్. బంతి అతడిపై నుండి వెళ్ళిపోయి అతడు బోర్లా పడ్డాడు. బాట్ అంతదూరం వెళ్ళి పడింది. వరండాలో నిల్చుని తండ్రీ కొడుకుల ఆట ముచ్చటగా చూస్తూన్న కృష్ణప్రియ, "చెబితే ఎందుకు వింటావు? శాస్తి జరగద్దూ?" అంటూ పరిగెత్తింది.
ఎప్పుడో వచ్చివారి ఆటచూస్తూన్న రూపకూడా బాబుదగ్గిరకి పరిగెత్తింది.
కాని వారికంటే ముందే బాబుదగ్గిర వాలిన కళ్యాణీ, అతడిని ఎత్తుకొని కంగారు కంగారుగా అతడి ఒళ్లంతా నిమరసాగాడు "దెబ్బలు తాకాయా, నాన్నా? ఏదీ? ఎక్కడ?" అంటూ.
మోకాటి చిప్పా, గడ్డమూ రాచుకుపోయి రక్తం చెమర్చుతూంది. కల్యాణి కంఠం కౌగలించుకొని గుక్కపట్టి ఏడుస్తున్నాడు గోకుల్.
"వేలెడు లేడు, వీడికొక బాట్ కావాలిట చూడు, రూపా! మొన్న తండ్రి బాట్ తీసుకొని ఆటకి వెళుతూంటే చూశాడు. నాకూ కావాలంటూ మారాం చేసి తెప్పించుకొన్నాడు. ఈ తండ్రికి వీడి చేష్టలన్నీ మురిపాలే గదా?"
కృష్ణప్రియ ప్రేమపూర్వకమైన సాధింపులు చెవిని బడుతూండగా, గోకుల్ ను తీసుకుని లోనికి వెళుతూ రూపకేసి కోరాగా చూశాడు కళ్యాణ్. 'వచ్చావూ? ఎందుకో! మాయలాడివి. ఎక్కడ నేర్చావో కవ్వింపులూ, ఆపైన విదిలింపులూ!'
రూపను హాలులో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది కృష్ణప్రియ. తాగాక వక్కపొడి ఇచ్చి, ఆమె భుజం మీద చెయ్యివేసి "నామీద ఏ కొంచెం స్నేహాభిమానాలు ఉన్నా మొన్న ఏం జరిగిందో చెప్పాలి" అంది కృష్ణప్రియ, ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.
రూప ముఖం వివర్ణమయింది. "డాక్టర్నే అడగవచ్చుగా?" అంది అవనతముఖి అయి.
మందస్వరంతో అన్నది కృష్ణ ప్రియ: "చిన్ననాడే తల్లితండ్రుల్ని పోగొట్టుకొన్న దురదృష్ట వంతులం నేనూ, కల్యాణూ. మేనమామ ఆదరించాడు కనక ఈనా డీ విధంగా మనుష్యులంగా నిలువగలిగాం. దురదృష్టంకొద్దీ ఆయన దయాభిమానాలకుకూడా దూరమయ్యాం.
"చక్కగా సాగిన ప్రతి లతా పుష్పించదు. కొన్ని లతలు పుష్పించినా సంతానవతులు కాలేవు. కాని, తన జాతిని నిలబెట్టుకోగల ఏ ఆధారమో ఉండి తీరు తుంది. నా జీవనం పెన్నిధి, నా దైవం నన్ను విడిచి పోయారు, నా జీవనలత పుష్పించీ పుష్పించకముందే. నాకు కల్యాణ్ తప్ప ఆధారం ఎవరూ లేరు. అతడి శాంతి సౌభాగ్యాలే కాంక్షిస్తూ జీవిస్తున్నాను.
"అతడి జీవితంలో ఏర్పడిన విచిత్రం చూడు, రూపా. తల్లితండ్రుల మమకారానికి దూరమై వదలి వేయబడిన బిడ్డకు తను తండ్రి అయి, ఆ బిడ్డను తల్లిగా ఆదరించగల స్త్రీని తప్ప అతడు వివాహమాడే స్థితిలో లేడు. ఏ వయస్సుకు ఏది అవసరమో అది లభ్యమైతేనే ఆ జీవితానికి సంతృప్తి సార్ధక్యాలు. తావిలేని పూవులా ఇల్లాలు లేని అతడి జీవితం నిరర్ధకం.
"రూపా, నీ చేతులుపట్టి ప్రార్ధిస్తున్నాను. కళ్యాణ్ కు భార్యగా, గోకుల్ కు తల్లిగా ఈ ఇంటిలో ప్రవేశించాలి నువ్వు. ఈ ఇంటికి వెలుగు తీసుకురావాలి. నువ్వు తప్ప ఈ స్థానానికి ఎవరూ అర్హులు కాలేరు. నా మాట కాదనకు, రూపా!" అణుచుకోలేని ఆవేశంతో రూప చేతులు తన చేతుల్లోకి తీసుకొని అశ్రుపూర్ణ నేత్రాలతో ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది.
"క్షమించు, కృష్ణక్కా!" ఆమె చేతులనుండి తన చేతులు విడిపించుకొని నిస్సహాయంగా రోదిస్తూ వడి వడిగా వెళ్ళిపోయింది రూప, ముఖం కొంగులో దాచుకొని.
రూప సంబోధనకు రెక్కలు తెగిన విహంగంలా కుప్పకూలిపోయిన కృష్ణప్రియ, "కృష్ణక్కా!" అన్న తమ్ముడి ఉరుములాంటి పిలుపుతో అదిరిపోయింది.
గోకుల్ దెబ్బలకు అయోడిన్ రాస్తూ రాస్తూనే వచ్చిన కళ్యాణ్, "ఆడదాని కాళ్ళు పట్టుకొని పెళ్లాడ వలిసిన దిక్కుమాలిన గతి నాకేం పట్టింది?' అంటూ గద్దించాడు.
"....."
"నెరజాణ! మనస్సులో సోదరభావం ఉండే మనిషి భామవేషాలెందుకు వెయ్యాలో?"
వెటకారంగా నవ్వుతూన్న తమ్మున్ని చూచిన కృష్ణ ప్రియ మనస్సు చివుక్కుమంది. "రూప వేషాలు వేసే రకం కాదు. ఆమెది మంచి మనస్సు. అసలు సంగతేమిటో బయటపడందే నా ఆశ, ప్రయత్నం వదులుకోను. ఇదిమాత్రం నిశ్చయం" అంది గంభీరంగా.
"నా ఇల్లాలుగా కాదు; అసలది న ఇంట్లో అడుగుపెట్టేది చూస్తాను." భీకరంగా గర్జించి బూట్లు ధన ధనా చప్పుడు చేస్తూ వెళ్ళిపోయాడు కళ్యాణ్.
* * *
ఒక మిత్రుని పెళ్ళి శుభలేఖ అందుకొని రెండు రోజుల క్రితం పెళ్ళికి వెళ్ళిన కళ్యాణ్ తిరిగి వచ్చాడు పదిగంటల రాత్రివేళ. తన గదిలో కూర్చొన్న కృష్ణ ప్రియ లేచివచ్చింది, తమ్ముడు వచ్చిన అలికిడి విని.
"పెళ్ళి బాగా జరిగిందా, కృష్ణా?"
"బాగానే జరిగింది. గోకుల్ పడుకొన్నాడా, అక్కా?"
"నా దగ్గిరే పడుకొన్నాడు. కాళ్ళు కడుక్కో, పద. వడ్డిస్తాను."
కళ్యాణ్ భోజనం చేసి తన పక్క సర్ది గోకుల్ ను తెచ్చుకోడానికి వెళ్ళాడు కృష్ణప్రియ గదిలోకి. "గోకుల్ ను ఇటుతే. నాదగ్గిర పడుకోబెట్టుకొంటాను."
పక్కమీద ఒక్కతే కూర్చొని వెలవెలబోతూన్న అక్కను చూచి, "గోకు ఏడీ, కృష్ణక్కా?" అనడిగాడు ఆదుర్దాగా.
తను చెప్పబోయే సంగతి తమ్ముడిలో కలిగించే క్రోధార్భాటాల్ని ఊహించిన కృష్ణ ప్రియ, తన భయాన్ని చిరునవ్వులోకి మార్చివేస్తూ, "నీ గోకుల్ ని ఏ రాక్షసుడూ ఎత్తుకు పోలేదులే! ఎందుకంత కంగారు పడతావు?" అంది.
ముఖంలో చిరాకు ప్రదర్శిస్తూ అన్నాడు: "మరి...గోకుల్...."
"సాయంకాలం రూప తీసుకువెళ్ళింది వాణ్ణి." నెమ్మదిగా చెప్పింది.
కళ్యాణ్ ముఖంలో ఆదుర్దా తొలగిపోయి గాంభీర్యం అలుముకొంది. "ఎవరి అనుమతితో గోకుల్ ను తీసుకుపోయింది ఆమె, తనింటికి?"
"అనుమతి ఇచ్చేవారు దగ్గిర లేరుకదా?" అతని కోపాన్ని చిరునవ్వుతో తేల్చివెయ్యబోయింది. "కాస్సేపు ఉంచుకుని పనిమనిషితో పంపిస్తానని తీసుకుపోయింది. చీకటిపడుతూనే నేనే దాసూని పంపించాను బాబును తెమ్మని, అన్నం తిని అక్కడే పడుకుంటాడనీ, ఉదయం తెచ్చి దిగబెడతాననీ చెప్పిపంపింది రూప. ఎలాగూ నువ్వు లేవుకదా, ఉండనీ అనుకొన్నాను."
"ఒక్క క్షణం నా బాబు దాని ఇంట్లో ఉండడానికి వీలులేదు." విసురుగా వెళ్ళాడు. బయట గదిలో ముసుగుతన్ని పడుకొన్న నౌకర్ని లేపి, "దాసూ, రూపాదేవి ఇంటికి వెళ్ళి గోకుల్ ను తీసుకురా, వెళ్ళు" అంటూ ఆజ్ఞాపించాడు.
"ఇంత రాత్రివేళ ఎందుకండీ? ఉండనీండి. రేపు ఉదయం తీసుకువస్తాను." నిదమత్తులో సణిగాడు దాసు.
"వెధవా! ఎదురు చెప్పడం ఎప్పటినుండి నేర్చావ్?"
యాజమాని గద్దింపుతో నిద్రమబ్బు విడిపోగా లేచి పరిగెత్తి వెళ్ళాడు దాసు.
కళ్యాణ్ వెళ్ళి మంచంమీద ముళ్ళమీద కూర్చొన్నట్లుగా కూర్చొన్నాడు, గోకుల్ కోసం ఎదురు చూస్తూ క్షణక్షణం ఆలస్యమౌతూన్న కొద్దీ వాచీకేసి చూచుకొంటున్నాడు విసుగ్గా.
అరగంట తరవాత వచ్చాడు దాసు ఒక్కడే. యజమాని తీక్షణస్వభావం ఎరిగి ఉన్నవాడు కనక సంకోచిస్తూ భయపడుతూ చెప్పాడు! "చినబాబుగారు నిద్రపోతున్నారండీ. నిద్రపోతున్నవాణ్ణి లేపి ఎలా పంపించనన్నారండి అమ్మగారు. ఉదయం తామే స్వయంగా...."