Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 9


    చంద్రశేఖర్ వెంటనే చప్పట్లు కొట్టి- "అయితే నువ్వే నాకు కావలసిన మనిషివి-" అన్నాడు.
    గోపీ తెల్లబోయి-"ఎలా?" అన్నాడు.
    "హంతకుడు నీ కళ్ళెదుట తల్లిని చంపుతున్నా చూస్తూ ఊరుకున్నావు నువ్వు. ఆ క్షణంలో నువ్వు ఆవేశపడి ఉంటే నీ ప్రాణాలు పోయివుండేవి. ఎందుకంటే ఆవేశం మనిషి ప్రాణాలు రక్షించదు. శక్తి సామర్ధ్యాలే మనిషిని రక్షించగలవు. నీలో అద్భుతమైన వివేచన వున్నది. అటువంటి వివేచనా పరుడే నాక్కావాలి. ఎందుకంటే నిన్ను నేను శక్తి సామర్ధ్యాలతో నింపగలను. కానీ వివేచన ఎక్కన్నుంచి తేగలను?" అన్నాడు చంద్రశేఖర్.
    "అంటే?"
    "నీలో శక్తి సామర్ద్యాలున్నవనుకోండి- నీ ప్రత్యర్ధులని గుర్తిస్తారు. నీ మీద అందమైన ఆడవాళ్ళను ప్రయోగిస్తారు. నువ్వు ప్రేమావేశానికి లొంగకూడదు. నీ రక్తం మరిగే మాటలంటారు. నువ్వు భావావేశానికి లోనుకాకూడదు. నీకు ఎన్నో ఆశలు చూపిస్తారు. మోహావేశానికి తల ఒగ్గకూడదు. నీ దృష్టిలో నీవు తలపెట్టిన కార్యక్రమం ఒక్కటే వుండాలి"
    గోపీ అయోమయంగా డీఐజీ వంక చూసి- "మీరు నా నుంచి ఏ ప్రయోజనమాశిస్తున్నారో తెలియదు. కానీ నన్ను శక్తి సామర్ద్యాలతో ఎలా నింపుతారో తెలుసుకోవాలని ఉన్నది-" అన్నాడు.
    "అస్త్రశస్త్రాలను సాధించడంకోసం పూర్వం తపస్సు చేసేవారు. తపస్సుకు ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రతకు ఒక లక్ష్యం వుండాలి. ముందు నీవు లక్ష్యం ఏర్పరచుకుంటే-అటుపైన ఏకాగ్రత, తపస్సుల విషయం నేను చూసుకుంటాను."
    "ఏమిటి నా లక్ష్యం?-"
    "ఫిరంగిపురంలో అడుగుపెట్టి-చౌదరినీ, నాయుడినీ మట్టుపెట్టాలి. అక్కడి రహస్యాలను ఛేదించి-అవినీతిని శాశ్వతంగా నిర్మూలించాలి. ఈ పనికి నీవు పూనుకుంటే-మొత్తం పోలీసుడిపార్టుమెంటు నీకు బాసటగా నిలుస్తుంది-" అన్నాడు చంద్రశేఖర్.
    గోపీ ఆలోచనలో పడ్డాడు. అతడి కనులముందు ఒక దృశ్యం-అది నాయుడు శాంతమ్మను కత్తితో పొడిచి చంపుతున్న దృశ్యం!
    ఈ నాయుడిలా ఎందరు తల్లులను పొడిచి చంపుతున్నాడో!    
    తను ఫిరంగిపురం వెళ్ళాలి. వెడితే.....
    "శభాష్...." అనగానే పేలిపోయిన హంతకుడతడి కనులముందు మెదిలాడు.
    ప్రత్యర్ధులు సామాన్యులు కారు. తను నిజంగా సామాన్యుడు. అసామాన్యుడని డీఐజీ అంటున్నప్పటికీ తనకూ ఆ హంతకుడి చావు తప్పదు.
    "మిస్టర్ గోపీ! ఈ లక్ష్యం ఏర్పరచుకుని-లక్ష్యసాధన చేశావంటే నువ్వు అసలు సిసలు హీరోవని నితూపించుకుంటాఉ. హీరోగా ఈ దేశం నీకు నివాళులందిస్తుంది-" అన్నాడు చంద్రశేఖర్ మళ్ళీ.
    "హీరో!"
    ఈ మాట వినగానే గోపీ కనులముందు తన వీధి యువకులు కదిలారు. హీరో వస్తున్నాడంటూ వాళ్ళు తన్ను గేలిచేస్తున్నారు. నిజానికి వాళ్ళూతనవంటి సామాన్యులే! వాళ్ళుకూడా తన్ను గేలిచేశారు.
    అలాంటప్పుడు తను బ్రతికి మాత్రం సాధించేదేముంది? రోజూ కడుపునింపుకుని-ఓ యాభై యేళ్ళు జీవించి అటుపైన ఓ రోజున తనువు చాలించేందుకేనా ఈ జీవితం.....
    నీ తల్లి.....నీ తండ్రి.... నీ దేశం.....
    ఫిరంగిపురం నాయుడు.....
    ఎవ్వరూ చేయలేని పని.....
    హీరో!
    "సార్! ఈ లస్ఖ్యం నాకు నచ్చింది-అనుకున్న పని సాధించలేకపోయినా, ప్రాణాలు కోల్పోయినా ఇందులో ఏదో తృప్తి వున్నదనిపిస్తున్నది నాకు......సార్! ఇదే నా లక్ష్యం...." అన్నాడు గోపీ.
    "శభాష్!" అన్నాడు చంద్రశేఖర్.
    అప్పుడు పెద్ద చప్పుడయింది.
    గోపీ వులిక్కిపడ్డాడు.
    "కంగారుపడకు. ఇప్పుడు నిన్ను తపస్సుకు తీసుకుని వెళ్ళబోతున్నాను. ఈ ఇంట్లోని రహస్యపు గదికి తలుపు తెరుచుకుంది. అదే నీవు విన్న చప్పుడు...." అన్నాడు చంద్రశేఖర్.
    గోపీ వెనక్కు తిరిగాడు. అంతవరకూ అటువైపున్న గోడలో ఇప్పుడొకద్వారం ఏర్పడింది.
    
                                                                       5
    
    ఆ గదిలో మొత్తం నలుగురు బలాధ్యులున్నారు. ఒక్కొక్కడూ కండలు తిరిగిన అజానుబాహువు.
    "వీళ్ళు నలుగుర్నీ నువ్వొక్కడివీ అయిదు నిముషాల్లో చిత్తుచేయగలగాలి. అప్పుడే నీ శిక్షణ పూర్తి అయినట్లు-" అన్నాడు చంద్రశేఖర్.
    గోపీ భయంభయంగా- "అంతవరకూ నేనుంటానా?" అన్నాడు.
    "నీ లక్ష్యాన్ని గుర్తుంచుకుంటే ఉంటావు-" అన్నాడు చంద్రశేఖర్.
    "డీ ఐజీ సాబ్-నన్ను మన్నించండి. ఈ మనుషుల్ని చూడగానే నా లక్ష్యం విషయం మరిచిపోయాను-" ఆనందు గోపీ.
    "అయితే ఏమంటావ్?" అన్నాడు చంద్రశేఖర్ చిరాగ్గా.
    "నాకీ ఉద్యోగంవద్దు. మీకో మనవడుంటే చెప్పండి. వాడి ఆలనా పాలనా చూసుకుంటాను. వంటకూడా చేస్తాను. నెలకు వందరూపాయలిచ్చినా ఒప్పుకుంటాను. కానీ వీళ్ళతో ఫైటింగ్ చేయమనకండి-"అన్నాడు గోపీ.
    చంద్రశేఖర్ నవ్వి- "నిన్నీగదిలోనికి తీసుకుని రావడంనావంతు. బయటకు వెళ్ళాలంటే ఆ వస్తాదుల అనుమతి తీసుకోవాలి-" అని తను చటుక్కున బయటకు వెళ్ళిపోయాడు. అతడి వెనుకనే పెద్ద చప్పుడుతో గోడలోని ద్వారం మాయమైపోయింది.
    అప్పుడు వస్తాదుల్లో ఒకడు గోపీనిసమీపించి- "తపస్సు చేస్తావా?" అనడిగాడు.
    గోపీ తల అడ్డంగా ఊపి-"చెయ్యను-" అన్నాడు.
    "అలాంటప్పుడుడీ గదిలో ఎందుకు అడుగు పెట్టావు?"
    "ఏదో కుర్రతనం. తాత్కాలికావేశం...."

 Previous Page Next Page