Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 8

   
    "అది మీయిష్టం-" అన్నాడు వేణు.
    మోహన్ ఒక మనిషిని చూపించి- "ఇతడిపేరు అప్పారావు. అప్పుడప్పుడు పోలీసులకు సాయంచేస్తుండే పాత ఖైదీ. ఫిరంగిపురంలో నిర్భయంగా తిరిగిరాగలడు. కానీ అక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు మాత్రం భయపడతాడు-" అని చెప్పాడు వేణు అప్పారావును పరీక్షించిచూశాడు.
    ఆ దృశ్యం మాయమై మరో దృశ్యం.
    డిటెక్టివ్ వేణు ఫిరంగిపురం బస్ స్టాండులో దిగాడు. కొద్ది క్షణాల్లో ఒక రిక్షావాడతడిని సమీపించాడు.
    "ఎక్కడికి సార్!"
    "ఏదైనా మంచి హోటలుకు పోనియ్-"
    "ఎక్కండి సార్-"
    వేణు రిక్షాఎక్కాడు. తదుపరి కార్యక్రమం గురించి కాబోలు అతడు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
    రిక్షా ఓ ఇరుకుసందులోకి వెళ్ళి ఆగింది.
    "ఒక్కసారి రిక్షా దిగండిసార్-" అన్నాడు రిక్షావాడు.
    "ఎందుకు?"
    "చైను ఊడింది-"
    వేణు రిక్షా దిగగానే ఓ పక్కనుంచి-బల్యాధ్యుడైన మనిషి అతడి మీద ఉన్నపళంగా పడ్డాడు. అతడు ఏం జరుగుతున్నదీ తెలుసుకునేలోగా గుండెల్లో కత్తిదిగిపోయింది.
    హత్యచేసిన మనిషి ముఖం కనిపించడంలేదు. అతడు రిక్షావాలాను సమీపించి- "చెప్పినట్లే చేశావు. ఈ వందాఉంచు. శవాన్ని స్మశానికి చేర్చి నాకు కనబడితే నీకింకో వంద ఇస్తాను-" అన్నాడు.
    రిక్షావాలా అతడికి సలాంచేశాడు.
    ఆ దృశ్యం మాయమై మరో దృశ్యం.
    హంతకుడు ఒక మైదాన ప్రాంతంవైపు వెడుతున్నాడు. అప్పారావు దూరంగా ఉండి అతడిని అనుసరిస్తున్నాడు.
    ఉన్నట్లుండి హంతకుడు ఆగాడు. పాకెట్లోంచి పాకెట్ ట్రాన్సిస్టర్ వంటి చిన్న సాధనం తీశాడు.
    అప్పారావు తన సాకెట్లోంచి చిన్నపాకెట్ ట్రాన్సిస్టర్ వంటి సాధనం తీశాడు. వీడియోపై చిన్న స్లయిడ్ వచ్చింది. అందులో అప్పారావు చేతిలోని సాధనం గురించిన వివరాలున్నాయి.
    మనం ఒకమనిషికి ఎలక్ట్రానిక్ బగ్ తగిలిస్తే- ఆ మనిషీ ఏం మాట్లాడుతున్నదీ ఈ సాధనంద్వారా వినవచ్చును.
    అప్పారావు వింటున్నాడు.
    "బాస్-" అన్నాడు హంతకుడు.
    "ఎస్..." బాస్ గొంతు కాబోలు-బదులు పలికింది.
    "పని జయప్రదంగా ముగిసింది. డిటెక్టివ్ వేణు ఫినిష్...."
    "ఎక్కన్నుంచి మాట్లాడుతున్నావు?"
    "మీరుచెప్పిన చోటునించే-"
    "శభాష్-" అన్నాడు బాస్.
    అంతే!
    అక్కడ పెద్ద ప్రేలుడు సంభవించింది. హంతకుడు ముక్కలు ముక్కలుగా విడిపోయి గాలిలోకి ఎగిరిపోయాడు.
    
                                 *    *    *    *
    
    గోపీకి వళ్ళంతా చెమటలు పట్టాయి.... "ఏమి టిదంతా?" అన్నాడతను.
    "ఫిరంగిపురంలో పోలీసుల మనిషి అడుగుపెట్టనున్నట్లు- వాళ్ళకు ముందే తెలుస్తున్నది. అడుగు పెట్టిన అరగంటలో పోలీసుల మనిషిని అంతం చేస్తున్నారు. ఆ తరువాత హంతకుడినీ మట్టుపెడుతున్నారు. అంతే! ఆ కేసు గురించి మనకింకే వివరాలూ తెలియవు-"అన్నాడు చంద్రశేఖర్.
    "ఇవన్నీ మీరు సినిమాగా ఎలా తీశారు?"
    "ఇది నిజంగా జరిగినవి కాదు. అప్పారావులాంటి వాళ్ళు కొందరు అందజేసిన సమాచారాన్ని బట్టి ఊహించి ఫిల్ముగా షూట్ చేశాం. విషయం కొత్తవాళ్ళకు అర్ధమయ్యేలా చెప్పడంకోసం ఇది చూపిస్తూ వుంటాం-"
    "ఆ హంతకుడెలా చనిపోయి ఉంటాడు?"
    "కనెక్షన్ ట్రాన్స్మిటర్లోనే ఉండి ఉంటుంది. ఆ బాస్ శభాష్ అనగానే ఆ ట్రాన్స్మిటర్ ప్రేలడానికి ఏర్పాటుండి ఉంటుంది. ఈ రోజుల్లో అలాంటి ఏర్పాట్లు కష్టంకాదు-"
    "ఇవన్నీ నా ఊహకు కూడా అందనివి. ఈ దృశ్యాలు తలచుకుంటేనే నాకు వళ్ళు గగుర్పొడుస్తోంది. వాటిలో తలదూర్చడం నా వల్ల కాదు..."
    "నీ వంటివాడే ఇందుకు పూనుకోవాలి. నిన్ను వాళ్ళు అనుమానించరు. నువ్వు పోలీసుల మనిషివి కాదు-"
    "అదొక్కటే సరిపోదు. అందుకు ధైర్య సాహసాలు కావాలి. శక్తి సామర్ధ్యాలు కావాలి-"
    "అవి నీకులేవని ఎందుకనుకుంటున్నావు?"
    "నా తల్లి ఎలా చనిపోయిందో మీకు తెలియదు. చూపాలన్నా నా వద్ద వీడియో ఫిల్ములేదు. కానీ ఆ దృశ్యం ఇప్పటికీ నా కనులముందు మెదుల్తూనే ఉంది...." అంటూ గోపీ తన తల్లి ఎలా హత్యచేయబడిందీ చెప్పి- "వాడు నేను చూస్తూండగా నా తల్లిని చంపాడు. వాడే నా తండ్రిని కూడా చంపాడని తెలుసు. కానీ వాడికి భయపడి చాటుగా దాక్కుని నా ప్రాణాలు కాపాడుకున్నాను. నేను పిరికివాణ్ణి ఒప్పుకుంటారా?" అన్నాడు.

 Previous Page Next Page