Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 8

    "మందు పని చేయకపోతే చచ్చిపోతావంటే మృత్యువును ఎలాగైనా ఎదుర్కోవాలన్న మొండిధైర్యం వస్తుంది. జీవితేచ్ఛ పెరుగుతుంది.

    శరీరంలోని ప్రతి జీవకణం ప్రాణం నిలుపుకోవడానికి పెనుగులాడుతుంది. అందుకే ఆమె రెండు నిముషాల్లో నడవగలిగింది."
   
    "ఇంతకీ నువ్వు ఇచ్చిన ఆ దివ్యఔషధం ఏమిటి? నెల రోజుల నుంచి దారికి రాని పక్షవాతాన్ని రెండు నిముషాల్లో బాగుచేసింది.

    చంద్రరేఖ తెరలుతెరలుగా నవ్వి "ఆదామందూ గామ- మాకూ గాదు -చక్కెరనీళ్ళు" అంది.

    ఆమెను అనుసరించి నడుస్తున్న చిట్టి ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిపోయాడు.

    చంద్రరేఖ, చిట్టి భోజనాలు ముగించేటప్పటికి రాత్రి ఎనిమిది దాటింది. ఆకాశంలో చంద్రవంక మొగలి పూలరేకులా వేలాడుతోంది. ఎక్కడో వర్షం కురుస్తోందన్న సమాచారాన్ని మోసుకొస్తున్నట్లు గాలి చల్లగా వీస్తోంది. చెట్లన్నీ జావళి ఆలపిస్తున్నట్లు సన్నగా ఊగుతున్నాయి. ఆకాశంలో అక్కడక్కడ పొగముద్దలావున్న మబ్బులు క్షణానికో రూపు మార్చుకుని తమ చపలచిత్తాన్ని చాటుతున్నాయి.

    ఇక పడుకోవడానికి ఉపక్రమిస్తుండగా తన ఇంటి ముందు ఎవరో తచ్చాడుతున్నట్లు గ్రహించింది చంద్రరేఖ.

    "ఎవరదీ?" అని అడిగింది కాస్తంత గొంతును పెంచి.

    తడికలమాటున తోలుబొమ్మలాగా కదలాడుతున్న నీడ కొంతసేపు తటపటాయించి చివరికి ధైర్యంచేసి ఆమె ముందుకి వచ్చింది.

    "ఎవరూ?" అప్పటికీ పోల్చుకోలేకపోయిందామె.

    "నేను" ఆ నీడ నీళ్ళు నములుతోంది.

    "నేనంటే"

    "రమణని"

    ఆ సమయంలో రమణ అక్కడ కనపడడం వింతగా వుంది ఆమెకి. అతను చాలా మొహమాటస్తుడు. ఆడపిల్ల గాలికూడా శరీరానికి సోకనివ్వడు. అలాంటివాడు ఇలా తచ్చాడుతుండడం ఏమిటి?

    "రా రమణా! ఏమిటిలా వచ్చావ్?" అంటూ లోపలికి ఆహ్వానించింది.

    అతను మెల్లగా వచ్చి మంచంమీద కూర్చున్నాడు.

    ఆమెకూడా అతని పక్కన కూర్చుంటూ "వ్యవసాయం బాగా జరుగుతోందా?" అని అడిగింది.

    "ఆఁ ఓ మోస్తరుగా"

    "పెళ్ళటకదా - ఎప్పుడు?"

    రమణ తేదీ చెప్పాడు.

    "ముహూర్తం దగ్గరవడింది మరి"

    "అవునాంటీ -అదే భయంగా వుంది"

    "పెళ్ళంటే ఖుషీగా వుండాలిగానీ భయమెందుకు?"

    "అదీ....అదీ" రమణ చెప్పలేకపోతున్నాడు.
 
    "భయమెందుకంటే అలా నాలుకను లోపలికి లాక్కుంటావేమిట్రా అల్లుడూ"

    "అది కాదు ఆంటీ"

    "చెప్పు జంకెందుకు?"

    "అదే అంటీ - నా కేమో ఆడపిల్ల తో మాట్లాడ్డమంటేనే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. మరి నా భయాన్ని చూసి ఆ పిల్ల ఎగతాళి చేస్తుందేమోనని బెంగగా వుంది. అందుకని....." మరి చెప్పలేకపోయాడు.

    "అందువల్ల" అనునయంగా అడిగింది.

    "నువ్వే నాకు ఆ భయం పొగొట్టాలాంటి. నాకు గుడువులా అన్నీ వివరంగా చెప్పాలాంటీ" అని నీటముంచినా పాలముంచినా నీదే భారం అన్నట్లు ఆమె చేతులు పట్టుకున్నాడు.

    రమణ ఎందుకొచ్చాడో అర్ధమైంది ఆమెకి.

    అతని భుజంచుట్టూ ఆప్యాయంగా చేయివేసి -  "ఇందులో భయపడవలసింది ఏమీలేదు. కొద్దిగా బెరుకుగా వుండచ్చు. అదీ పెళ్ళితంతులో పోతుందిలే. బిందెలో ఉంగరం కోసం వెతకడం, బెల్లం జీలకర్ర తలపై పెట్టడం, పూలచెండ్లు విసురుకోవడం ఇవన్నీ ఎందుకు పెట్టారనుకుంటున్నావ్? ఇద్దరిలోనూ బెరుకు పోగొట్టడానికే. పెళ్ళి తతంగం ముగిసేటప్పటికి కొత్త అనేదీ ఇద్దరిలోనూ పోతుంది. కాబట్టి నువ్వేం బెంగపడక"

 Previous Page Next Page