టాక్సీ ఆగింది. "దార్లో చిక్కిపోయాను. లిప్టు కోసం" అన్నాడతను.
"సరే ఎక్కండి!" అన్నాను.
అతను టాక్సీ ఎక్కాడు. టాక్సీ కదిలింది.
"టెలిగ్రాం అందిందా?" అనడిగాడు నూతన వ్యక్తీ.
"ఏ టెలిగ్రాం?" ఆశ్చర్యంగా అడిగాను.
"మీకా టెలిగ్రాం నేనే ఇచ్చాను. కానీ అంత తొందరగా బయల్దేరి వెళ్ళి పోతారను కోలేదు. ఏమైతేనేం తిరుగు ప్రయాణంలో నైనా దొరికారు" అన్నాడతను.
"ఎవరు మీరు?"
"పేరు మోసిన వజ్రాల దొంగని" అన్నాడతను.
టాక్సీ ఆగింది.
"మీ టాక్సీ డ్రయివర్ బుద్ది మంతుడు. మీ దగ్గరున్న సూట్ కేస్ నాకిచ్చేయండి. మీ గది వెతికే వచ్చాను. అక్కడ లేవు. చెప్పిన మాట వినకపోతే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి" అన్నాడతను.
అతని చేతిలో రివాల్వర్ ఉంది. నేను సీటు క్రింద చేయి పెట్టాను. సూట్ కేసు లాగుదామని. చేతికి ఏదో కాగితం లాంటిది తగిలింది. తీశాను.
"దారిలో ఎవరైనా నిన్నటకాయిస్తే , నీ సూట్ కేసులో ఉన్నవి వజ్రాలు కాదు, బొమ్మ రాళ్ళని చెప్పు. నన్ను తల్చుకుని వాళ్ళ కళ్ళలోకి చూడు. -- చిత్ర" అని ఉందా కాగితం లో.
"ఏమిటది?" అడిగాడా వ్యక్తీ అనుమానంగా.
"ఏమీ లేదు. బొమ్మ రాళ్లున్న సూట్ కేసు దొంగలించడం కోసం రివాల్వర్ చూపించే మూర్ఖు లుంటారా అని?" అన్నాను.
"ఇలాంటి కబుర్లు చాలా విన్నాను. ట్రిక్కులూ చాలా చూశాం. మర్యాదగా సూట్ కేసు బయటకు తీయి." అన్నాడా వ్యక్తీ.
తీశాను. అతను రివాల్వర్ నా వంటికి తగిలించాడు. సూట్ కేసు మూత తెరిచాడు. నేను మాత్రం కళ్ళు మూసుకుని ఉన్నాను. ఏం జరుగుతున్నది తెలియక, అతను మళ్ళీ సూట్ కేసు మూసేశాడు. టాక్సీ దిగి, బై అన్నాడు. నేను ఒకసారి టాక్సీ దిగాను. అతడేటు వెళ్ళాడో చూద్దామని. కానీ క్షణంలోనే అతను కనుమరుగై పోయాడు.
టాక్సీ కదిలింది.
సూట్ కేసు నా దగ్గరే ఉంది. అందులో వజ్రాలూ ఉన్నాయి. ఆ వ్యక్తీ సూట్ కేసు ఎందుకు వదిలి పెట్టాడో తెలియదు. చిత్ర రాసిన ఉత్తరమేలా వచ్చిందో తెలియదు. అన్ని ఆశ్చర్యంగానే ఉన్నాయి.
గోపాలపురంలో టాక్సీ ఆగింది. నేను సూట్ కేసు తో టాక్సీ దిగాను. టాక్సీ డ్రైవర్ దగ్గరకు వెళ్ళాను. డబ్బు ఇవ్వడానికి , "నీ జీవితంలో అతి ముఖ్యమైన పని చేయబోతున్నావ్ గోపాల్! ఒళ్ళు దగ్గరుంచుకో , నీ జేబులో కాగితముంటుంది. ఆ ప్రకారం అన్నీ మాట్లాడి పని సక్రమంగా ముగించుకు రా" అన్నాడు డ్రైవర్. టాక్సీ కదిలి వెళ్ళిపోయింది. బాడుగ తీసుకోకుండానే . నేను విస్తుపోయాను.
ఆ కంఠం పరిచితమైందే, చిత్రది!
వాచీ చూసుకున్నాను. మూడుం పావు కావొస్తోంది టైము.
12
సరిగ్గా అయిదు గంటలకు విశ్వనాద్ పురం లోని మూడంతస్తుల భవనం ముందు నిలబడి కాలింగ్ బెల్ మ్రోగించాన్నేను. చేతిలో సూట్ కేస్! జేబులో రక్షించు కునేందు కే విధమైన ఆయుధం లేదు.
తలుపులు తెరచుకున్నాయి. పాంటూ షర్టు వేసుకున్న ఒక దృడ కాయుడు "రండి లోపలకు" అన్నాడు. లోపలకు అడుగు పెట్టాను. నా వెనుక తలుపులు మూసుకున్నాయి.
'అయ్యగారు మేడమీదున్నారు" అన్నాడా దృడ కాయుడు.
మెట్లెక్కాను. అక్కడొక అందమైన అమ్మాయి నాచేయి పట్టుకుని "రండి, అయ్యగారి గదిలోకి తీసుకేడతాను" అందామె. ముందుకు నడిచాను.
ఇద్దరం ఒక ఎయిర్ కండిషన్డ్ గదిలో అడుగు పెట్టాం. అక్కడ చూశాను. మెత్తటి కుర్చీలో కూర్చున్న సుమారు నలభై ఏళ్ళ వ్యక్తిని. అతన్ని ఎప్పుడూ ఎక్కడా చూసిన గుర్తు లేదు.
"కమాన్ కింగాఫ్ స్మగ్లర్స్" అన్నాడతను.
ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ముందడుగు వేశాను. అమ్మాయి నా చేయి వదిలి పెట్టింది. గదిలోంచి బయటకి వెళ్ళిపోయింది.
ఆ గదిలో ఇప్పుడు ఇద్దరే ఉన్నాం. నేనూ, అతను'.
"రండి. కూర్చోండి. మీకు నా హృదయ పూర్వక సుస్వాగతం.
అతను లేచి నిలబడ్డాడు. నేను అతని దగ్గరగా వెళ్ళాను. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చునే ముందు టీపాయ్ మీద సూట్ కేసు పెట్టాను.
ఇద్దరం కూర్చున్నాం. అతను ఆత్రంగా సూట్ కేస్ ఓపెన్ చేశాడు.
"ప్లీజ్, వాటిని తాకవద్దు" అన్నాను.
"ఏం?' అన్నాడతను.
"వజ్రాలన్నింటిని స్పెషల్ పాయిజన్ లో ముంచి తీశాం. ముట్టుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు" అన్నాను.
"మరి?" అన్నాడతను.
"ఎల్లుండి పోస్టులో మీకు ఉత్తరం వస్తుంది. అందులో ఈ విషానికి విరుగుడేమిటి అన్నదాని గురించి వివరంగా ఉంటుంది. అంతవరకూ మీరా వజ్రాలను తాకలేరు."
"ఐసీ" అతను సాలోచనగా తల పంకించాడు. "అయితే ఆ ఉత్తరం వచ్చేవరకూ మీరిక్కడ బలవంతంగా ఉంచ బడితే."
"నోనో. నేను బయటకు పడితే గానీ ఉత్తరం రాదు. ఆ ఉత్తరం నేనే స్వయంగా రాసి పోస్టు చేస్తాను. ఎటొచ్చీ విషానికి సంబంధించిన వివరాలు తెలిసినతను వేరే ఉన్నాడు. అతను చెప్పగా నేను రాస్తానన్న మాట!"
"నన్ను నమ్మడం లేదన్న మాట మీరు."
"ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. నా జాగ్రత్తలో నేనుంటున్నాను. నేను చెప్పిన అకౌంట్ల కు డబ్బు క్రెడిట్ చేసినట్లు సమాచారం అందగానే మీ ఉత్తరం రాస్తాను."
'అవి అసలు సిసలు వజ్రాలని నమ్మక మేమిటి?"
"అది తెలుసుకోగల సమర్ధత నీకునందని నాకు తెలుసు" అన్నాను.
అతను నవ్వి, తన జేబులోంచి ఏదో యంత్రం తీశాడు. దాని ద్వారా పెట్టె లోనికి చూశాడు. యంత్రాన్ని అడ్జస్టు చేస్తూ ఓ అయిదు నిముషాలు తంటాలు పడ్డాడు. యంత్రాన్ని జేబులోకి తోసేసి సూట్ కేసు మూసేసి, "రెండు కోట్ల నలభై నాలుగు లక్షలు టూ మచ్" అన్నాడు.
నేను నవ్వి, "ఆ తర్వాత మీ కస్టమర్ కూడా ఆరు కోట్ల అరవై ఆరు లక్షలు టూ మచ్ అనవచ్చు" అన్నాను.
"నేను లాభాని కమ్ముతాననుకుంటున్నారా?" అన్నాడతను.
"మీరేం చేసుకున్నా నాకవసరం లేదు. నాకు కావలసింది డబ్బు."
అతను నవ్వాడు. 'అలాగంటే సరిపోదు. మీరు నాకు కావాలి."
"అంటే?"
"మీలాంటి పార్టనర్ కోసం ఎదురు చూస్తున్నాను. మనలాంటి వాళ్ళం యిద్దరం కలిస్తే "అంటూ తమాషాగా నవ్వాడతను.
"నేనేమిటి? పార్టనర్ ఏమిటి? మా బాస్ చెప్పిన ప్రకారం సూట్ కేస్ ఇవ్వటానికి వచ్చాను. ఇచ్చాను. అంతే నా పని అయిపొయింది" అన్నాను.
"నా దర్శనం కోసం ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. నేనేవ్వరికీ దొరకను. నా అంత వారని గ్రహించకనే మిమ్మల్ని స్వయంగా రిసీవ్ చేసుకోదలిచాను. మీ శక్తి స్వామర్ధ్యాలు పూర్తిగా గ్రహించాక నా కార్యకరమాలకు మీబోటి వారి సహకారం లభించక పోవడం ఒక పెద్ద లోపమని గ్రహించాను" అన్నాడతను.
"ఏమిటి నా శక్తి సామర్ధ్యాలు బాస్ చెప్పిన ప్రకారం నడుచు కోవడమా?"
"కాదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవ్వరూ అనుమాన పడలేని విధంగా నటిస్తూ మీ వ్యవహారాలను నడిపించగలగడం పెద్ద విశేషం."
'అది నటన కాదు- నిజం" అన్నాను.
"అవును-పోలీసాఫీసరింట్లో మీ అనుచరులను కలుసుకోవడం నిజం. మీ ఇంటికి వచ్చిన పోలీసులకు కనబడకుండా వజ్రాలను దాచడం నిజం. మరో పర్యాయం హటాత్తుగా పోలీసులు వస్తే హిప్నటైజ్ చేసి వజ్రాలను కనిపించకుండా చేయడం నిజం" అన్నాడతను.
"నా సంగతులన్నీ తెలుసుకుంటూనే వస్తున్నారన్న మాట!" అన్నాను.
"అవును. మీ ముఠా మీద నేను చాలా కాలంగా నిఘా వేస్తూనే వచ్చాను. అయితే బాస్ ఎవరో తెలుసుకోలేకుండా ఉన్నాను. మీరేనని చూచాయిగా నాకు తెలిసింది. కానీ నమ్మడం చాలా కష్టమని పించింది. ఇప్పటికీ కష్టంగానే ఉంది, కానీ ఆరోజు టాక్సీ లో నా అనుచరుణ్ణి హిప్నటైజ్ చేసేసరికి మరి నమ్మకుండా ఉండడం కూడా కష్టమే."
నేనాశ్చర్యంగా అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయాను.
"అదిగో -- అదే ఆ అమాయకత్వమే నాకు గానీ నా అనుచరులకు గానీ చేత కాకుండా వుంది. ఈ ఒక్క క్వాలిటీ వుంటే ప్రపంచల్నే జయించగలను నేను. నీ ఊహలు, వ్యూహాలు అద్భుతం. మీ చేతలూ, తెలివితేటలూ అద్భుతం. మీ తెలివి తేటలకు నా జోహార్లు అన్నాడతను.
"మీరు పోరాబడుతున్నారని చెప్పడానికి విచారిస్తున్నాను" అన్నాను.
"మిస్టర్ గోపాల్! మనమిప్పుడు చర్చించవలసిన విషయం మీరు బాస్ అవునా కాదా అన్నది కాదు. మీరు నాతో పార్టనర్ గా ఉంటారా, వుండరా అన్నదే!" అన్నాడతను.
ఏం చేయాలో , ఏమనాలో నాకు తోచలేదు. ఒక క్షణం ఆగి, 'ఆలోచించు కునేందుకు వ్యవధి కావాలి అన్నాను.
"ఆ వ్యవధి మీకిప్పుడే లభిస్తుంది. మీ ఇష్టం వచ్చినంత సేపు ఆలోచించు కొండి"అన్నాడతను.
నేనాలోచిస్తున్నాను. అతను నా వంకే తీక్షణంగా చూస్తున్నాడు.
పది నిముషాలు గడిచేక "ప్రపంచానికి బ్యాలన్స్ అవసరం. అమెరికా, రష్యా, ఒకటైతే ప్రపంచంలో చిల్లర దేశాల గతేమిటి? అలాగే మీరూ నేనూ ఏకమైనా అంతే. ఈ దేశంలోని చిల్లర దొంగలే మై పోవాలి" యునైటెడ్ నేషన్స్ లాంటి పోలీసు శాఖే మై పోవాలి! అన్నాను.
"నోనో! దానికీ దీనికీ పోలీక కుదరదు. అమెరికా, పాలసీ వేరు, రష్యా పాలసీవేరు. వాళ దారులు వేరు. కానీ మన దారులు ఒకటే!" అన్నాడతను.
"మన దారులు ఒకటే అయినా పక్షంలో ఇద్దరిలో ఒకరు వెనుకపడి వున్నామన్న మాట. అంటే ఒకరు వేగం పుంజుకోవలసి వుంటుంది" అన్నాన్నేను.
"మీకు వేళాకోళంగా వున్నట్లుంది. నాతొ వ్యవహారం లో వేళాకోళలకు తావు లేదు. మీ అభిప్రాయం చెప్పండి."
"చెబుతాను. కానీ మీ ముఠా కు మీరే బాస్ అని నమ్మక మేమిటి? సరి సమానులతో కానీ నేను మాట్లాడను."