"అమ్మవారు కాదు, అవతారం!" అన్నాను.
ఇంతలో మరోబేరం వచ్చింది. రాజేశ్వరి మాత్రం ఇంకా నిలబడే ఉంది. బేరం చూసుకున్నాక, "ఇంతకూ మీకేం కావాలో చెప్పండి!' అనడిగాను.
"కొత్త షాపు గదా, ఏమున్నాయో చూద్దామని వచ్చాను. మీరు కనపడ్డారు. ఇంక చూడ్డానికేముంది?"
"మీ అమ్మగారు కులాసానా?"
"ఆ నాన్న గారు కూడా కులసానే, మరి వస్తాను" అంటూ వెళ్ళబోయింది రాజేశ్వరి.
'అరే, ఏదైనా తీసుకు వెళ్ళండి" అన్నాను.
"ఏం తీసుకోనా అని ఆలోచిస్తున్నాను."
"బొట్టు పెన్సిల్ తీసుకోండి."
"తోపు రంగు ఉన్నాయా?"
'ఆహా" అంటూ ఒక ప్యాకెట్ ఆమె ముందుంచాను. అమెందులోంచి ఒక పెన్సిల్ తీసుకుని, "ఎంత?" అనడిగింది.
"మీకు నేనే అమ్ముతానా?" తీసుకోండి" అన్నాను.
ఇద్దరు యువకులు షాపులోకి వచ్చారు. పెన్నులు కావాలని చూసుకుని కాసేపు బేరాలాడి చివరకు నేను చెప్పిన ధరకే కొనుక్కు పోయారు.
"బేరాలు బాగానే వున్నాయి కానీ, పెన్సిలు ధర చెప్పండి!' అన్నది రాజేశ్వరి.
"ధర కాదండీ, అది గిప్టు"
"గిప్టయితే పెన్సిల్ వద్దు. కాస్మిటిక్స్ తీసుకుంటాను.
"మీ యిష్టం."
'డబ్బు తీసుకునే పక్షంలో."
'అలా అయితే నేనేమీ ఇవ్వను."
"ఇలా అయితే మీ వ్యాపారం మూన్నాళ్ళ ముచ్చట అవుతుంది."
"భలేవారే, మీలాంటి అందమైన అమ్మాయి మా షాపులో ఓ గంట సేపు ఉన్నదంటే చాలు , బేరాల మీద బేరాలు...." అంటుండగా మరో నలుగురు యువకులు షాపులోకి వచ్చారు. రెండద్దాలు, రెండు దువ్వేనలూ కొనుక్కు వెళ్ళారు.
'అదా సంగతి! ఇంకా మీరు నిజంగానే ఉదార స్వభావులనుకున్నాను" అంది రాజేశ్వరి మూతి ముడిచి.
"తెలిసింది గదా! మరి మీ క్కావాల్సినవి తీసుకోండి అన్నాను!
"పెన్సిల్ చాల్లెండి" అంటూ ఆమె పెన్సిల్ తీసుకుని వెళ్ళిపోతూ 'ఆదివారం మీ షాపుకి సెలవను కుంటాను గాంధీ పార్కు కి సాయంత్రం రాగలరా?" అనడిగింది.
"ఎన్ని గంటలకి?"
"అరు సరిగా ఆరు" అని వెళ్ళిపోయిందామె.
ఒకనాడు నాతో తిరస్కారంగా మాట్లాడిన రాజేశ్వరి ఈరోజు నన్ను ప్రేమగా ఆహ్వానించింది. అదో వింత మలుపు నా జీవితంలో.
9
ఆదివారం, సాయంత్రం , ఆరు గంటలు....
సరిగ్గా ఆరు గంటలకు రాజేశ్వరి వచ్చింది ఎదురు చూస్తున్న నా దగ్గరకు.
నన్ను చూస్తూనే నవ్వింది. నేనూ నవ్వాను.
దగ్గరగా వచ్చింది. "రండి, అలా లాన్ లో కుర్చుందాము" అంది. ఇద్దరం లాన్ లో కూర్చున్నాం.
"ఏమిటి విశేషం?' అనడిగాను.
"మీ బొట్టు పెన్సిల్ కు థాంక్స్ చెబుదామని."
"దాని కింత దూరం రావాలా?"
"నాకోసం ఇక్కడకు రావడానికి మీకు చాలా కష్టమని పించిందనుకుంటాను. అందుకే ఇంత దూరం రావాలా?" అనడిగారు."
'అబ్బే అదేం కాదు." నసిగాను. "నేనిచ్చినది గోరంతలు, కొండంతలు చేస్తే ఇబ్బంది అనిపించి...."
"ఆడదాన్ని కదా....' నవ్వింది రాజేశ్వరి.
"అదే విశేషం! నేనిచ్చిన అతి చిన్న కానుక గురించి ఇంత ఇది చేసిన మీరాడడి కావడం నా సంతోషాన్నిపెంచింది" అన్నాను ఒక్క క్షణం అలోచించి.
"ఇప్పుడు నేను పెట్టుకున్న బొట్టు మీ షాపులోనిదే మీ కానుకే!"
నేనేం మాట్లాడలేదు.
"బొట్టుకు పెన్సిల్ వాడే అలవాటు లేదు నాకు. మీరే అ అలవాటు చేశారు" అంది రాజేశ్వరి మళ్ళీ.
"నా కానుకను మన్నించినందుకు ధన్యుడ్ని."
"నా ఆహ్వానాన్ని మన్నించినందుకు నేనూ ధన్యురాలి నయ్యాను."
ఏమిటో సంభాషణ చప్పగా ఉన్నదని పించింది . ఇలా ఒకరి కొకరు అభినందించుకుంటూ కూర్చోవడం కంటే దెబ్బలాడుకోవడం , మాటకు మాట అనుకోవడమే సరదాగా ఉంటుంది నాకు.
రాజేశ్వరి నావైపు అదోలా చూస్తుంది. ఆమెను సూటిగా చూశాను. ఆ కళ్ళు ఏమేమిటో చెబుతున్నాయని పించింది. కళ్ళ భాషకు కళ్ళలోనే జవాబివ్వాలనుకుంటే నా కళ్ళకు మాట్లాడ్డం వచ్చునో రాదో నాకు తెలియదు. కానీనేనూ ఆమె వంక అదోలా చూస్తూ ఉన్నాను.
అలా ఒక గంట గడిచేక నేనే లేచాను. రాజేశ్వరి కూడా లేచింది.
"ఎన్నో మాట్లాడదామనుకున్నాను. కానీ మాటలు రాలేదు" అంది రాజేశ్వరి.
"ఒకోసారి అలాగే అవుతుంది. ఇలా కలుసుకోవటం మొదటిసారికదా, మరోసారి కలుసుకుంటే ఇంకాసిని మాటలోస్తాయి. ఇంకోసారి కలుసుకుంటే ఇక అన్నీ మాటలే ' అన్నాను.
రాజేశ్వరి నవ్వి "మనం మళ్ళీ మళ్ళీ ఇలా కలుసుకుంటామంటారా?" అంది.
"మీ కభ్యంతర ముండని పక్షంలో నా కిష్టమే అన్నాను.
అప్పటి కిద్దరం విడిపోయాం.
ఇంటికి వెళ్ళేసరికి గదిలో ఉత్తరం మొకటి వుంది. తీసి చదివాను. ఇంటి దగ్గర్నుంచి వచ్చింది. చెల్లాయికి పెళ్ళి చూపులు జరిగాయట. పెళ్ళి కొడుక్కి, పిల్ల నచ్చినట్లే అనిపిస్తోంది. కట్న కానుకల విషయంలో కూడా మాటలు సంతృప్తి కరంగా జరిగినట్లే అనిపిస్తోంది వుత్తరం చూస్తుంటే, వారం రోజుల్లో మళ్ళీ ఉత్తరం రాస్తానని రాశారు నాన్నగారు.
10
"సమయం వచ్చింది గోపాల్!" అంది చిత్ర ఒక ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతాల నా గదికి వచ్చి.
"ఏ సమయం?' అనడిగాను.
"నీ గదిలోని వజ్రాలను కదల్చవలసిన సమయం!"
"అమ్మయ్య!" అంటూ నిట్టుర్చాను.
"రేపే" అంది చిత్ర.
"రేపే , ఏం చేయాలి?' అనడిగాను.
"ముందు నువ్వు వేషం మార్చుకోవాలి. ఆ తర్వాత వజ్రాలున్న సూట్ కేసు తీస్కోవాలి. విశ్వనాధపురం వెళ్ళాలి. అక్కడ బస్టాప్ దగ్గర ఒక రెండతస్తుల మేడ వుంది. అందులో అడుగు పెట్టాలి. అక్కడ నీకు ఎవరు కనబడి ఏం చెప్తే అలా ప్రవర్తించాలి."
"ఆ తర్వాత?"
"నీకు రెండు లక్షలు ముడతాయి.నీ ఇచ్చ వచ్చిన రీతిలో జీవితాన్ననుభవించవచ్చు. ఇంక నిన్ను దొంగల ముఠా వారు కానీ, స్మగ్లింగ్ రాకెట్ వారు కానీ బాధించరు. నీ ఫ్యాన్సీ షాపు మూసేసినా బాధ లేదు. కానీ...."
"ఊ.....ఇంకా.....కానీ ఏమిటి?" అన్నాను.
చిత్ర కళ్ళల్లో నీళ్ళు కనబడ్డాయి. "మరి చిత్ర నీకు కనిపించదు" అంది.
"అదేమిటి?"
"అదంతే! ఆ భవనంలోంచి నువ్వు బయట అడుగు పెట్టెక ఈ జన్మలో చిత్రను చూడలేవు."
నా మనసు బాధగా అయిపొయింది. "ఇటువంటిది అని వర్ణించి చెప్పడానికి వీల్లేని అనుబంధం మనది చిత్రా. నువ్వు మరి నాకు కనిపించవన్న విషయాన్ని నేను నిజంగా నమ్మలేను. నమ్మి బ్రతకలేను. నువ్వు చెప్పేది నిజమైతే నేనా భవంతిలో అడుగే పెట్టను"అన్నాను.
"నువ్వా భవనానికి వెళ్ళి తీరాలి. లేకపోతె చిత్ర ఈ లోకంలోనే వుండక పోవచ్చు" అంది చిత్ర.
"ఏమిటి నువ్వనేది?" అన్నానాశ్చర్యంగా , భయంగా.
"నన్నేమీ అడగొద్దు. నావృత్తి రహస్యం ప్రాణం పోయినా చెప్పను నేను" అంది చిత్ర.
"ఏం చెప్పినా ప్రాణాలుండగానే చెప్పాలి. ప్రాణం పోయాక ఎవరు మాత్రం చెప్పగలిగే దేముంది?' అన్నాన్నేను.
'అలాగనకు. ఒకోసారి శవాలు కూడా మాట్లాడతాయి. అనుభవం తక్కువ నీకు. ఆవేశం ఎక్కువ. నేను చెప్పిన కార్యం ముగించేక నైనా తెలివిగా బ్రతకడం నేర్చుకోవాలి నువ్వు ' అంది చిత్ర.
నా మనసు ఏదో తెలియని బాధకు లోనైంది. మనసంతా దిగులు గా వుండి పోయింది.
11
"సార్ ! టెలిగ్రామ్ ."
పోస్టు మాన్. నా చేత సంతకం చేయించుకొని టెలిగ్రాం ఇచ్చి వెళ్ళిపోయాడు.
నాన్నగారి దగ్గర్నుంచి. తక్షణం బయలుదేరి రామ్మనమని వుంది.
ఏమిటో విశేషం. కాస్త భయం కూడా వేసింది. అంతలోనే గుర్తు కొచ్చింది నా బాధ్యత.
సాయంత్రం అయిదు గంటలకు సరిగ్గా అయిదు గంటలకు విశ్వనాధ పురం లోని ఒక భవనం లో ఉండాలి నేను.
టైము చూసుకున్నాను. పన్నెండు ముప్పై అయిదు అయింది.
ఎక్కువసేపు అలోచించలేదు నేను. అయిదు నిముషాల్లో డ్రస్సయ్యాను. వజ్రాలున్న సూట్ కేసు తీసుకున్నాను. రోడ్డు మీదకు వచ్చాను. హోటల్లో దొరికింది మెక్కాను. తర్వాత మా వూరికి రానూ పోనూ వచ్చే కండిషన్ మీద ఎనభై రూపాయలకో టాక్సీ బేరమాడాను.
సరిగ్గా పావు తక్కువ రెండు గంటలకు నేను మా ఊరులో వున్నాను.
నేను వెళ్ళేసరికి ఇంట్లో అందరూ నిద్ర పోతున్నారు. నన్ను చూసి ఆశ్చర్యాన్ని ప్రదర్శించారు. "టెలిగ్రాం చూసుకు వచ్చాను" అన్నాను.
"టెలిగ్రాం ఏమిటి?' అన్నారు నాన్నగారు.
నేను జేబులోంచి రెండు వందల రూపాయల నోట్లు తీసి నాన్న గారికిచ్చాను. 'అర్జంటు పనుంది. మళ్ళీ వస్తాను. అని వివరాలూ అప్పుడు మాట్లాడుకుందాం" అన్నాను.
వాళ్లింకా ఆశ్చర్యం లోంచి తేరుకునే లోపల టాక్సీ ఎక్కాను.
టాక్సీ దూసుకుపోతోంది. ఇరవై నిముషాలు గడిచాయి. నిర్మానుష్యమైన ఆ రోడ్డు మీద ఎవరో అడ్డంగా నిలబడి ఉన్నారు. దూరాన్నుంచే హారన్ , మ్రోగిస్తున్నాడు టాక్సీ డ్రైవర్. కానీ పని జరుగలేదు. ఆ వ్యక్తీ అలాగే రోడ్డు కి అడ్డంగా నిలబడి ఉన్నాడు. చేత్తో టాక్సీని ఆపమని సైగ చేస్తున్నాడు.