ఏ ప్రపంచంలో అయితే ఒకనాడు మహారాణిలా బ్రతికిందో ఆ ప్రపంచంలో ఎవరికీ అవసరంలేని అనాథ ప్రేతమైన అమ్మని చూస్తూ దుఃఖం ఆగడంలేదు.
"వెంటనే ట్రీట్ మెంట్ ప్రారంభించాలమ్మా" అన్నాడు డాక్టర్ సుకృతిని చూస్తూ.
అతడి గొంతులో జాలి ధ్వనించిన మాట నిజమే అయినా అంతకుమించి డబ్బు అవసరాన్నీ గుర్తుచేస్తున్నట్టుగా వుంది.
ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజ్యం శరీరంలోని పక్కటెముక చర్మం చిట్లిన కళేబరాన్ని స్ఫురణకి తెస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ అంది సుకృతి- "వెంటనే ట్రీట్ మెంట్ చేయండి డాక్టర్! డబ్బు తీసుకొస్తాను.
"ఎక్కడనుంచి?" అనే ప్రశ్నకి ఆమె దగ్గర జవాబు లేదు. బయటికి నడవబోయిన సుకృతి చేయి పట్టుకుంది అలివేలు.
"ఎక్కడికమ్మా?"
తెలిస్తేగా చెప్పటానికి! మానసికమైన అలసట, ఆకలి దప్పుల్ని మించిన ఆరాటం సుకృతిలోని ఆకర్షణని చంపి క్రూరంగా గెలుపు సాధిస్తున్న ఓ ఉన్మాదిలా వెళ్ళిపోయింది.
ఆ క్షణాన దేవుడు కాదు ఆమెకు గుర్తొచ్చింది సుదర్శనరావు దేవుడు గుర్తొచ్చేవాడేమోకాని అమ్మ బాగున్న రోజుల్లో తరచూ ఆమెని పూజించే వెంకటేశ్వరుడు ఆ తర్వాత కనీస బాధ్యతని పాటించనందుకు అతడి మీద సుకృతికి కక్షగా వుంది.
* * * *
అరగంట వ్యవధిలో సూరి చెప్పిన అడ్రసు ప్రకారం కోడంబాలోని సుదర్శనరావు గెస్ట్ హౌస్ కి వచ్చింది. ఆటోడ్రైవర్ కి ఏభై అందించగానే "చిల్లర లేదమ్మా" అన్నాడు తమిళంలో.
అదే తనదంటూ మిగిలిన ఆఖరి నోటు! తన ఘనతను ఘనంగా చాటిచెప్పుకొనే చివరి సన్నివేశం కూడా అదే!
తిరిగి చిల్లర అడగని ఆమెను ఆటోడ్రైవర్ విస్మయంగా చూస్తూ వుండగానే గెస్ట్ హౌస్ లో అడుగు పెట్టింది.
విద్యుద్దీపాల మధ్య ఖరీదైన సమాదిలా వెలిగిపోతూంది గెస్ట్ హౌస్.
అందమైన పరిసరాల్ని కాక, తన అవసరాన్ని గుర్తుచేసుకుంటూ హాల్లోకి వచ్చింది.
"హూ ఈజ్ దట్?" స్నేహితులతో కాదు, ఎవరో స్త్రీతో మందు సేవిస్తున్న సుదర్శనరావు కాంక్షగా చూశాడు ఇరవయ్యేళ్ళ సుకృతిని.
"నా పేరు సుకృతి"
"వెల్ కమ్....." అప్పటికి ఖచ్చితంగా ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్టుగా పైకి లేచాడు. అంతసేపూ అతడికి కంపెనీ యిచ్చినట్టుగా అతడికి సంజ్ఞచేసి బయటికి నడిచింది.
"రండి లోపలికి"
వెనుక గదిలోకి అతడు నడుస్తుంటే జీవితం పులిలా గాయపరిచిన లేడిపిల్లంత ఒద్దికగా అనుసరించింది.
"నాకు డబ్బు కావాలి"
వెనక్కి తిరిగాడు సుదర్శనరావు. "ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేనిదెవరికి?"
జవాబు చెప్పలేకపోయింది.
సుమారు నలభై అయిదు సంవత్సరాల వయసున్న సుదర్శనరావు ప్రజల నాడి తెలిసిన తిరుగులేని దర్శకుడు! కాబట్టే యిక్కడ వయసులో వున్న అందమైన అమ్మాయి డబ్బుకోసం తనేమన్నా చేస్తానని పరోక్షంగా వ్యక్తం చేయడాన్ని అభినందించాడు. "మాట్లాడు సుకృతీ!"
"నేను సినిమాల్లో సెంటిమెంటల్ టచ్" నవ్వాడు నిషాగా అతడికి అమ్మాయిలు కొత్తకాదు. ఇలాంటి కన్నెపిల్లలు కొత్త. అనుభవమూ కొత్తకాదు. ఓ ఏపిల్ పండులా నిగనిగలాడే యిలాంటి అమ్మాయితో అనుభవం కొత్త. "అయితే నేను అదోలాంటి మగాడ్ని సుకృతీ! అన్న మాట ప్రకారము డబ్బు కోసం నటించే అవకాశం యివ్వడం మాత్రమే కాదు, ముందు నీలాంటి అమ్మాయితో రాత్రి గడపటాన్ని కోరుకుంటాను. సూటిగా విషయానికి వచ్చేశానుగా.....ఇప్పుడు చెప్పు దానికి నువ్వు సిద్దమేనా?"
శిలాప్రతిమలా నిలబడిపోయింది.
అటు రాహువులా అమ్మను కబళిస్తున్న కాలం....
ఇటు తనను కబళించాలని ఉవ్విళ్ళూరుతున్న ఓ మగాడు. అమ్మ కూడా అతడి సినిమాలలో నటించినందుకు వయసులో తనకు తండ్రిలాంటి వాడే అనుకుంది. కానీ యిలాంటి బేరం పెడతాడని వూహించలేకపోయింది.
"బలవంతం లేదు సుకృతీ.....నీ యిష్టం....నువ్వు నా ప్రపోజల్ కి సరేనంటే ఈ బాటిల్ లోని మందు టేస్టు చెయ్....లేదూ అంటే వెనక్కి వెళ్ళి పో.....అయిదు నిముషాలు టైం యిస్తున్నాను."
సుకృతి కళ్ళనుంచి నీళ్ళు రాలుతున్నాయి.... కాదు. బ్రతుకు యాగంలో మనసు ఆహుతై గుండెల రుధిరాన్ని నీళ్ళుగా మార్చిలిప్తల్ని ప్రశ్నిస్తూంది.
"అమ్మ" పులికి బలికాబోతున్న లేగదూడ చివరి ఆర్తనాదంలా మనసు ఆక్రోశిస్తుంది.
అయిదు నిముషాలు కాదు. రెండు నిమిషాలకే ఆమె బాటిల్ అందుకుని కొద్దిగా తాగింది. పొలమారింది. ఉక్కిరిబిక్కిరౌతూ.....తొలిసారి రుచిచూడటం మందునే కాదు ఆమెను అతడు కూడా.....
అంతే....