"మా మరిది వెంగళరాయుడువారి వివాహ వేడుకలు యెందువల్ల ఆగిపోయినాయి. మా తండ్రి కశింకోట ప్రభువులు రామరాయుడికి తక్షణమే కబురు పంపండి" అన్నది మార్లిన్.
"అలాగే పంపుతాము మీరు విశ్రాంతి మందిరానికి దయచేయండి" అన్నాను. అందుకు సిద్దపడింది మార్లిన్.
"మీరు రాజమాత వెంట దయచేయండి" అన్నాను.
"ఎక్కడ రాజమాత?" ఆతృతతో అడిగింది.
నేను రాజమాతను చూపెట్టాను.
రాజమాత గాయత్రీదేవి ఆదుర్దాగా ఆమెకేసి చూచారు.
"ఆటలు పట్టిస్తున్నావా? తల తీయిస్తాను జాగ్రత్త" అని హెచ్చరిక చేసింది మిస్ మార్లిన్.
నాకు వొణుకు పుట్టింది.
"అవునమ్మా, నేనే రాజమాతను- గాయత్రీదేవిని" అంటూ ముందుకు పోయాలి గాయత్రీదేవిగారు.
"నువ్వా రాజమాతవా? నీకు పిచ్చి యెక్కిందా? మా అత్తగారిని అవమానించుతావా, పుండు నీపని చెప్తాను" అంటూ రాజమాత మీదికి దూకి ఆమె మెడ పట్టుకుంది మార్లిన్.
అనుకోని యీ సంఘటనకు రంగారావుగారూ, నేనూ ఆశ్చర్యపోయాం. యిద్దరమూ వెళ్ళి ఆమె చేతుల్లోంచి విడిపించేసరికి తాతలు దిగివచ్చారు.
సుకుమారమయిన ఆమె చేతుల్లో యెంత రాక్షసబలం వున్నదో అప్పుడుకాని మాకు తెలిసిరాలేదు. ఆశ్చర్యపోయాం.
ఈమెను యిలాగే స్వేచ్చగా వదిలివేస్తే జరుగరానివి యేవైనా జరుగవచ్చునన్న అనుమానం వచ్చింది నాకు. రాజమాతనూ, రంగారావు గారిని గది వెలుపలకు రమ్మని పిలిచాను.
"ఈ పరిస్థితి పూర్తి స్వరూపమేమిటో అర్ధమయ్యేవరకూ యీమెను యిక్కడనించి పంపివేసే ప్రయత్నం చెయ్యకండి" అన్నది గాయత్రీదేవిగారు.
"అలాగే" అని సమాధానం యిచ్చాను.
"విశాఖనించి సైక్రియాట్రిష్ట్ ను పిలిపించండి. వెంటనే మన కారు పంపండి. అవుసరమనుకుంటే మీరు వెళ్ళండి" అన్నారు రంగారావు.
తెల్లవారగానే సైక్రియాట్రిష్ట్ కోసం కారు పంపాలని నిర్ణయించుకున్నాము. డ్రైవర్ని పిలిచి పెందలాడే బయల్దేరి వెళ్ళమని చెప్పాను.
"అమ్మా! భోజనానికి వేళ అయింది పద" అని పిల్చారు గాయత్రీదేవి.
"ముందు ధర్మారాయుడు బాబాయిని చూడాలి" అంటోంది మిస్ మార్లిన్. ఆమెను నొప్పించితే మరింత కోపోద్రేకానికి లోను అవుతుంది. నొప్పించకుండా వుండాలంటే కాలగర్భంలో రెండువందల సంవత్సరాల నాడు కలసిపోయిన బొబ్బిలి వీరుల్ని లేపుకు రావాలి.
అది మానవమాత్రుడివల్ల అయ్యేపని కాదు కాబట్టి నేను ఒక వుపాయం చేశాను. ఆమెను చెప్పిన మాట వినేట్టు చెయ్యాలంటే ఆమె ఆజ్ఞలకు తలవంచినట్లు నటించటమే మార్గం అనుకున్నాను.
"ధర్మారాయుడు బాబాయి యినుగంటి నరసారాయుడు మహామంత్రిని చూచేందుకు వెళ్ళారు, వారు వచ్చేందుకు కొంత ఆలస్యం అవుతుంది. తమరు భోజనానికి దయచెయ్యండి" అన్నాను వినయంగా.
"అయితే పదండి" అంటూ మావెంట వచ్చింది మార్లిన్ అలియాస్ మల్లమ్మ.
రంగారావుగారికీ, గాయత్రీదేవిగారికీ యీ సంఘటన చూచాక నామీద నమ్మకం పెరిగింది. అయోమయంగా తయారయిన యీ ఘట్టంలో నా తెలివితేటలు పనికి వస్తాయని వాళ్ళకి అనిపించింది. నేను సంవత్సరం నించీ వారింట్లో మానేజరుగా పనిచేస్తున్నా యెన్నడూ డైనింగుహాలు చూడలేదు సరికదా వాళ్ళుకూడా నన్ను డైనింగుహాలులోకి ఆహ్వానించనూ లేదు.
ఈరోజు వెళ్ళక తప్పిందికాదు- వెళ్ళాను.
హాలులోకి ఠీవిగా వెళ్ళి ప్రధానమయిన కుర్చీలో కూర్చుంది మార్లిన్.
మామూలు పరిస్థితుల్లో అయితే ఆ యింటిలోవారు యీ పనిని సహించరు. కాని యీవేళ ఒప్పుకోక తప్పలేదు.
ఆమె ప్రక్కనే వున్న కుర్చీని నాకు వదిలిపెట్టి ఆ యిద్దరూ చెరి ఒక ప్రక్కా కూర్చున్నారు. నేనూ కూర్చున్నాను.
"ముందు ఆ కుర్చీలోంచి లే" ఆజ్ఞాపించింది మార్లిన్.
లేచాను.
'నా ప్రక్కన కూర్చునేందుకు నీకెంత ధైర్యం. తల తీయిస్తాను జాగ్రత్త" అని హెచ్చరించింది ఆమె.
నేను వినయ విధేయతల్ని నటిస్తూ ఆమె ప్రక్కన చేతులు కట్టుకుని నిలబడ్డాను. రాజఠీవితో వంటవాళ్ళు తెచ్చియిచ్చే పదార్ధాల్ని గుటకాయ స్వాహా చేస్తోంది మార్లిన్.
నా నటన రంగారావుగారికీ, రాజమాతకు వచ్చింది. నేను మార్లిన్ విషయంలో తాత్కాలిక ట్రీట్ మెంటుకు పనికివస్తానని వాళ్ళకి అనిపించింది. ఆ పనిని వారు నామీద వదిలిపెట్టారు.
ఆమెను మల్లమ్మగా అందరూ గుర్తించవలసిందనీ, అలా చెయ్యక పోతే ఆమె శరీరం తట్టుకోలేనంత బావ తీవ్రతకు గురి అవుతుందనీ అందువల్ల చాలా అనర్ధాలు జరిగే అవకాశం వుంటుందనీ అందరికీ హెచ్చరిక చేశాను. వంటవాళ్ళకీ, పనివాళ్ళకీ యీ జరుగుతున్నది అంతా బలే తమాషాగా వుంది. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మల్లమ్మదేవికి మార్లిన్) వంగి వంగి సలాములు చేస్తున్నారు. తప్పుకుని దారి యిస్తున్నారు.
రాజమాత పడకగది ప్రక్కన మిస్ మార్లిన్ కు కూడా క్షణాలమీద పడకగది యేర్పాటు చేయించాను. ఆమెను ఆ గదిలోకి తీసుకుపోయాను. ఆమె ముందు పోతూవుంటే వెనుకనే చేతులు కట్టుకు నడిచాను.