రాజారాంతో పాటు ఇంచుమించు ఒకేసారి రాజకీయాల్లో అడుగు పెట్టిన బ్రహ్మాజీ.
ప్రతిసారీ యిలాగే వంచించబడుతున్నందుకు చాలా కలతపడ్డాడు.
ఏడాదిక్రితం పార్టీ గెలిచాక మంచి స్నేహితుడనుకున్న రాజారాంకూడా తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోవటంతో కనీసం ఏ కార్పోరేషన్ కో చైర్మన్ కావాలనుకున్నాడు. అదీ దక్కలేదు.
అహం దెబ్బతినడంతో అసమ్మతి వర్గాన్ని కూడగట్టుకొని కేంద్రనాయకులకి తనకున్నపరపతిని నిరూపించుకోవాలనుకుంటుండగా రాజారాం రాజకీయాన్ని ప్రదర్శించి మరో నలభైమందిని మంత్రుల్నిచేసి దారుణంగా దెబ్బతీశాడు.
ఇక మిగిలిన మామూలు ఎమ్మెల్యేలు పదిమందిలో తనుఒకడు......
"బా....... స్ట ....... "మరో ఫ్లవర్ వాజ్ ని అందుకోబోతుంటే అడ్డం పడ్డాడు ముకుందం.
"వద్దు...... యిప్పటికి ఏడు ఫ్లవర్ వాజ్ ల్ని బద్దలుకొట్టారు ....... నిజానికి నువ్వుకాదు...... యింతకాలం నీకు పెట్టుబడి పెడుతూ నీకోసం లక్షలు విరజిమ్మిన నేను నా తల బద్దలుచేసుకోవాలి......." ఉక్రోషంగా చూశాడు ప్రముఖపారిశ్రామికవేత్త కాంట్రాక్టరూ అయిన ముకుందం.
తలపట్టుకు కూర్చుండిపోయాడు బ్రహ్మాజీ.
నిజమే.......
ముకుందంప్రతిసారీ తన గెలుపుకోసం లక్షలు విరజిమ్ముతున్నాడు.....ఏనాటికైనా తనురాష్ట్రాధినౌతానని తనకన్నా ఎక్కువనేత ఆశపడుతున్నాడు.
"మీరు మాట్లాడాలి....." పక్కకి చూశాడు ముకుందం.
అప్పటికింకా ఒక్క పెగ్గూ పూర్తి చేయని పరమహంస ప్రశాంతంగా నవ్వాడు కళ్ళు మూసుకునే.
"మీరు తపస్సు చాలించాలి" విసుక్కున్నాడు బ్రహ్మాజీ.
సుమారు అయిదుపదుల వయసున్నపరమహంస అలనాటిపరమ హంసలాగే కనిపిస్తాడు కాని వేదాంతి కాదు.....రాజకీయ సిద్దాంతి......అరుదుగా కొందరికే దర్శనమిస్తుంటాడని ప్రతీతి ..... అతడి క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసుకోవాలని చాలామంది రాజకీయనాయకులు ప్రయత్నించిఓడిపోయారు...... అయినా అతడి ఆశ్రయంకోసం అంతా అంగలార్చుకు పోతుంటారు.
అలా అని అతడికి పార్టీ అధిష్టానవర్గాల్లో పలుకుబడి వుందనికాదు ...... అతడు రాజకీయాలకిచెందిన మేథావి...... రాజకీయాల్ని ఉత్పత్తిచేస్తుంటాడు......రాజకీయాల్లో ఎదిగే వ్యక్తుల భవితవ్యానికి రూపకల్పన చేస్తుంటాడు..... మొత్తానికి.
అతడు ఫ్యాంటూ, షర్టూ వేసుకునే మహర్షి......
కేంద్రంలో ముఖ్య పదవుల్లో వున్న యిద్దరు తెలుగు మంత్రులు ఆ స్థానాలు చేరటానికి, ప్రస్తుత ముఖ్యమంత్రి రాజారాం ఓ బ్లాక్ మార్కెటీర్ స్థానంనుంచి ఆ స్థాయికి చేరటానికి అతడి గైడెన్స్ కారణమని చాలా మందికి తెలిసినవిషయమే అయినా అందరూఅలాంటి మేధావి సహాయాన్ని పొందలేకపోవటానికి కారణం ఆయన అంగీకరించకపోవటమే.
అలాంటి వ్యక్తిని ఒప్పించగలిగాడు ముకుందం.
దానికికారణం అయోమయంలో పడిన బ్రహ్మాజీ పరిస్థితి ..... అంతకుమించి వృధా అయిపోయిన డబ్బు.
"అసలుపరమహంస లాంటివారు మనతో వుండగా మనం భీతిచెందాల్సిన పనిలేదు" ఇప్పటికి వందోసారి ముకుందం అతని గురించి అని వుంటాడు.... "నిన్నటిదాకా రాజారాంకి అండగా వున్న పరమహంసగారు మనకి సహకరిస్తాననడం మనం చేసుకున్న అదృష్టం"
ఇప్పటికి 'కిక్కు' అనిపించిందేమో కళ్ళు తెరిచాడు పరమహంస. వెంటనే బ్రహ్మాజీ, ముకుందాన్ని మార్చిమార్చి చూశాడు.
"రాజారాంగురుద్రోహి...." గంటన్నరతర్వాత పరమహంస గారితొలి స్టేట్ మెంటిది "ఏరు దాటాక తెప్పతగలబెట్టే కృష్ణుడు...."
ఆయన మూడ్ లోకి వస్తున్నట్టు బోధపడిపోయింది.
"అంతకుమించి రాజకీయ ద్రోహి...."
ఏ విషయంలోకి రాజారాం ఘాటుగానే ద్రోహించేసి వుంటాడని తెలిసిపోయింది ముకుందానికి. అయినా ఆ ప్లోకి అడ్డం పడలేదు.
"పరమనీచుడు....." క్షణం ఆగేడాయన" అందుకే రాజకీయాల్లో నేను చెప్పిన స్థానాన్ని చేరుకోగలిగాడు"
అర్ధంకానట్టు చూశాడు బ్రహ్మాజీ.....ఇంతసేపూ తన వ్యక్తిగతమైన ఆంకాంక్షతో శాపనార్ధాలు పెడుతున్నాడనుకుంటే చివరికి అవన్నీ గొప్ప అర్హతలుగా తేల్చిచెప్పాడు.
"అంచేతరాజకీయాల్లో ఎదగాలనుకున్నాడు తప్పనిసరిగా అంత నీతిమాలిన వాడు అయ్యుండాలి"
"మనవాడూ తక్కువ వాడేం కాదు" ముకుందం అన్నాడు బ్రహ్మాజీని చూస్తూ- "అవకాశం దొరికితే అంతకన్నా లోఫర్ గా నిరూపించుకోగలడు"
మృదుమందహాసంతో చూశాడు పరమహంస" ముందు నీ బయోడేటా గురించి ఆ తర్వాత యిప్పటిదాకా రాజకీయాల్లో నువ్వు వెలగబెట్టిన వెధవ పనులుగురించి వివరంగా చెప్పు."
కంగారుపడ్డాడు బ్రహ్మాజీ.
"అలాతెల్లమొహంవేయకు.......నేను అడుగుతున్నది ద్రోహ బుద్దిలో నీకున్న అనుభవంగురించి"
"నిర్మొహమాటంగాచెబితే నీభవితవ్యం గురించి ఆలోచించలేదు"
"నేనుపుట్టింది స్వాతంత్ర్యసమరయోధుడి కడుపునే అయినా చిన్నతనంనుంచి చిత్రంగా పెరిగినవాడ్ని...." సగర్వంగా చెప్పుకు పోయాడు బ్రహ్మాజీ, "నాన్న చెప్పే గాంధిభగత్ సింగ్ కథలకన్నా చంబల్ లోయలోని బందిపోటు దొంగలకథల్ని ఆసక్తిగా వినేవాడ్ని.....స్కూల్లో అబద్దాల పుట్టగా కీర్తి గడించాను..... చదువువంటపట్టక కాపీలు కొడుతూ ఇంటర్ మీడియెట్ దాకా నెట్టుకురావడమే కాక కాలేజీల్లో చిల్లరమల్లర దొంగతనాలూ చేసేవాడ్ని కష్టపడడం చేతకాకపోవడంతో కబుర్లు చెప్పి అందర్నీ మోసం చేసి అలగాజనంతో కలిసి తిరిగి అనక ఏ పనిచేత కాక నాకు అనుకూలంగావున్న రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను.....అలా కాలేజీ విద్యార్ధినాయకుడిగా ఆనక యువజనసంఘ సభ్యుడిగా స్మగ్లర్ గా చాలా అవతారాలెత్తి, తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టాను....తొలిసారి తొంభైశాతం రిగ్గింగ్ తో గెలిచినా నేను ఆ తర్వాత రిగ్గింగ్ గెలుపుకి అస్త్రంగా మలచుకున్నాను, నలుగురి మధ్యగుర్తింపు రావాలని గుడిసెవాసులతో, రిక్షా కార్మికులతో సంబంధ బాంధవ్యాలు పెంచేవాడ్ని ఒక్కో గుడిసెకి వెయ్యి చొప్పున తీసుకుని ఆనకక్కడ చట్టపరమైన సమస్య రాకుండా ఆ మురికివాడలకి రాష్ట్రాల్నిపాలించే నేతలపేర్లు పెట్టి అలా పేరూడబ్బూ సంపాదించాను."
"బాగుంది.....చెప్పు"
గర్వంతో బ్రహ్మాజీగుండెలు పైకుబికాయి "ఇక్కడితో ఆగడం యిష్టంలేనినేను ఫ్యాక్టరీల కార్మికులకి నాయకుడ్నయిపోయాను.....మేనేజ్ మెంట్ తో చేతులు కలిసికార్మికుల డిమాండ్స్ ని మంటగలిపి అటుడబ్బు చేసుకుంటూ ఇటు కార్మికుల్ని రోడ్డుమీదకి ఈడ్చి చాలా ద్రోహం చేశాను. అంతేకాదు, నా అసలు రంగు కనిపెట్టినవ్యక్తులు నోరు విప్పకుండా అయిదారు హత్యలూచేయించాను"
"ఇంతచరిత్ర గల నువ్వు యీ రాష్ట్రానికే ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నావు"
వినయంగా తలపంకించాడు బ్రహ్మాజీ.
"ఇదోచరిత్ర కాదు..."
ఉలికిపడ్డాడు బ్రహ్మాజీ...
"నాయకుడుకావటానికి యీ మాత్రంచరిత్ర చాలదు,"
"ఆమాటకొస్తే...." ఉద్రేకపూరితంగా అన్నాడు బ్రహ్మాజీ" రాజారాం నాకంటే ఎందులో ప్రజ్ఞ గలవాడు"
చిదానందంగా నవ్వాడు పరమహంస" రాష్ట్రస్థాయికి ఎదగాలి అంటే గుడిసెల స్థాయిచాలదు బ్రహ్మాజీ.....కేంద్రస్థాయికి ఎదగాలి. అర్ధం కాలేదు కదూ"
"అవును" బుద్దిమంతుడైన విద్యార్ధిలా అన్నాడు.
"చిన్న ఫేక్టరీల్లో స్ట్రయికుల్ని నిర్వహించగాలిగావు తప్ప ఏ రోజయినా రాష్ట్రస్థాయి బందుల్నీ, హర్తాళ్ళని నిర్వహించగలిగావా......మహా అయితే అయిదారుగుర్ని హత్యచేయించావు తప్ప పోలీసు కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోయేట్టు ఉద్యమాలు నడపగలిగావా? అమావాస్యకి పున్నానికి ఢిల్లీ పరిగెత్తి ప్రధానమత్రికి పూలబొకేల్ని యివ్వగలిగావు తప్ప సంచులతో డబ్బుని పార్టీ ఫండ్ గాయివ్వగలిగావా? ఏదో పని కల్పించి ప్రధాన మంత్రిని నీ నియోజకవర్గంలోకి వచ్చేట్టు ఏనాడైనా చేయగలిగావా......అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి నీ సొంత డబ్బులు ఖర్చుచేసైనా లక్షల సంఖ్యలో మనుష్యుల్ని రప్పించి నీ ప్రశస్తిని కేంద్రప్రభుత్వ దృష్టిలో ఎరుక పరచగలిగావా.....ఇవేమీ నువ్వు చెయ్యలేదు. రాజారాం చేశాడు."
పరమసత్యాల్ని వింటూ తానెంత వెనుకబడి వున్నదీఅర్ధం చేసుకున్న బ్రహ్మాజీ చేతులు జోడించాడు.