"ఇంతేనన్నమాట నామీద ప్రేమ. నీకు నిజంగా నా మీద ప్రేమ వుంటే ఎందుకు వద్దంటావు?" అన్నాడు కినుకగా. రూప చప్పున అతని గుండెలమీద తల ఆన్చి
అతని మెడ చుట్టూ చేతులు బిగించి ......"సురేష్.....సురేష్! ఐ లవ్ యార్, సురేష్!
అది నీకు తెలియదా.....అని ...ఇది....వద్దు.....ఏదన్నా అయితే...." అంది భయం భయంగా.....సురేష్ లో చల్లారిన ఆవేశం తిరిగి రాజుకుంది. "యూ సిల్లీ! అంతేనా నీ భయం. నాకా మాత్రం తెలిదా. ఆ జాగ్రత్తలో నేను రాను." "సురేష్! అదికాదు సురేష్! పెళ్ళయ్యేవరకు అదంతా వద్దు..." భయంగా అతనికి కోపం వస్తుందేమో నన్నట్టు నెమ్మదిగా అంది.
"డోంట్ టాక్ ట్రాష్ ...పెళ్ళి ....పవిత్ర....శీలం.....అమ్మమ్మ కబుర్లు చెప్పకు. నీవింకా డేరింగ్ టైపు అనుకున్నాను. ఇంతేనా నీ ధైర్యం? ప్రేమించవచ్చు, కిస్ చెయ్యొచ్చు, కలిసి తిరగచ్చు, దినికేనా తప్పు....అప్పుడు లేని తప్పు ఇప్పుడొచ్చిందా.
పవిత్రత అవన్నీ చేసినప్పుడు పోలేదా. ప్రేగ్నేన్సి వస్తుందని ఆడదానికి శీలం, పవిత్రత వుండాలని, మనవాళ్ళు యీ నీతి సూత్రాలన్నీ తయారుచేసి ఆడదాన్ని బంధించారు. అవన్నీ నీవూ నమ్ముతావా! ఇదంత అంత యిష్టం లేనిదానివి యింట్లో కూచుని చక్కగా అమ్మ నాన్న తెచ్చినవాడిని పెళ్ళాడవలసింది...." సురేష్ కి కోపం వచ్చిందని రూపకి అర్ధం అయింది.
సురేష్ ని ఏ పరిస్థితిలోను దూరం చేసుకోవడం ఆమె కిష్టం లేదు. సురేష్ కి, అతని ప్రేమకి దూరమయి తను బతకలేదు రూప మోహంలో భావాలు చదువుతూ, ఆమె కాస్త మెత్తపడుతుందని గ్రహించాడు సురేష్. తరువాత ఒక అరగంట....ప్రేమగురించి, సెక్స్ గురించి లెక్చరిచ్చాడు. సెక్స్ లేని ప్రేమ నిలవదన్నాడు. సెక్స్ కి ప్రేమకి అవినాభావ సంబంధం వుందన్నాడు. మగవాడి విక్ నెస్ సెక్స్ కనుక ఆ విషయంలో మగాడ్ని తృప్తి పరచి బానిస చేసుకోవాలి ఆడది అన్నాడు.
సెక్స్ వాంఛ తప్పు, పాపం అవన్నీ పాత భావాలన్నాడు. ఆకలి ఎలాగో సెక్స్ కూడా ఒక ఆకలే. అది తిర్చుకోవాలనుకోవడం సహజం ఏదో పెళ్ళికాకుండా పిల్లలు పుడితే ఆ పిల్లలకి సంఘంలో స్థానం ఉండదని యిన్ని కట్టుబాట్లు పెట్టారు. ఇప్పుడా భయం లేకుండా పది పైసలు పారేస్తే వచ్చే ఫామిలి ప్లానింగ్ సాధనాలు వుండగా భయపడడంలో అర్ధం లేదన్నాడు. విదేశాలలో ఏంచక్కగా ఎలా లైఫ్ ఎంజాయ్ చేస్తారో చెప్పాడు.
పెళ్ళికి ముందే చక్కగా అన్ని ఎంజాయ్ చేస్తారు. పెళ్ళి కేవలం పిల్లలకోసం కుటుంబంకోసం మాత్రమేనన్నాడు. ఎవరికి ఎలా తెలుస్తుంది అని ధైర్యం చెప్పాడు. నీకేం జరగకుండా చూసే పూచి నాదన్నాడు. అంతసేపు రూప దగ్గరికి లాక్కుంటూ, ఆమె మొహాన్ని రెండు చేతులతో బిగించి పెదాలతో అద్దుతూ, ఆమె జుత్తు సవరిస్తూ.....ఆమె చెంపలు నిమురుతూ....మృదువుగా ఆమెకి నచ్చజెప్తు ఆమెని వశపరుచుకుంటూ, నెమ్మది నెమ్మదిగా అక్రమించుకోడం ఆరంభించాడు. రూప మైమరపు, మత్తులోపడి అతన్ని వారించే శక్తి కోల్పోయి బలహీనంగా అతని చేతుల్లో ఇమిడిపోయింది. రూపకీ ఆ అనుభవం చవిచూడాలని వుంది గాని ఏం అవుతుందో నన్న భయం సురేష్ పోగొట్టి అభయ హస్తం ఇవగానే యింక అడ్డు చెప్పి సురేష్ కి కోపం తెప్పించలేకపోయింది. మరుక్షణంలో అంతా మరిచిపోయింది రూప.
ఇప్పుడు చెప్పు, ఎవరా కుర్రాడు. చదువుకున్నడా, ఉద్యోగమా.... వాళ్ళు మనవాళ్ళేనా?....." భోజనాలు అయ్యాక రూపని పిలిచి డాబా ఎక్కింది పద్మావతి, డాబా మీద చలిగా వున్న అక్కడయితే ఏకాంతంలో కూతుర్ని సావకాశంగా అన్ని విషయాలు అడగచ్చని అక్కడికి పిల్చుకు వెళ్ళింది. రూపకి మనసులో జంకుగా వుంది. ఇన్నాళ్ళు ఇలాంటి స్థితినే ఎదుర్కోవాల్సి వుంటుంది ఏదో ఒక రోజు అన్న ఆలోచనే ఆమెకు రాలేదు. తల్లి ఏం అడగబోతోందో, వాటికీ జవాబులు ఎలా చెప్పాలో కూడా ఆలోచించే వ్యవధిలేక పోయిందామెకి. భోజనం చేస్తున్నంతసేపూ అదే విషయం ఆలోచించింది. తనకు తాను ధైర్యం చెప్పుకుంది. ఏం చేస్తారేం, తనకి వచ్చిన వాడిని తను చేసుకుంటుంది అని ధైర్యం కూడదీసుకుంది.
"అతని పేరు సురేష్. కిందటేడు బ.కాం. పాసయ్యాడు ఐ.ఎ.ఎస్. పరిక్షకి ప్రిపేర్ అవుతున్నాడు బ్యాంకు పరీక్షలకి కూడా కడ్తాదట. కాలేజిలో నాకో ఏడాది సీనియర్..."
"అంటే అప్పటినించి అతను నీకు ఫ్రెండా?"
"కాదు . అసలు అప్పుడు ఏదో కాలేజిలో అప్పుడప్పుడు చూశాను కాని పరిచయం లేదు. టైపు ఇన్ స్టిట్యుట్ లోనే కల్సుకున్నాం....."
"అంటే ఈ మూడు నాలుగు నెలల్లోనే ఇంత స్నేహం అయిందన్నమాట. అతని తండ్రేం చేస్తాడు?మనవాళ్ళేనా?" పద్మావతి అరాతీసింది. కులాల ప్రసక్తి రూప ఎత్తలేదు. అతని తండ్రి లాయరు అన్నమాట మాత్రం ఏదో మాటల్లో వింది. బ్రాహ్మలా? ఆబ్రాహ్మాలా.....ఇలాంటి కులాల ప్రసక్తి తీసుకురావడం ఆధునికతకి భంగం అని ఈతరం వాళ్ళ నమ్మకం. నిజంగా రూపకి ఆ విషయం తెలియదు. మనిషిని చూసి కులం గుర్తించడం కష్టం ఈరోజుల్లో సాధారణంగా మాటల్లో యాసనిపట్టి కొంచెం పోల్చవచ్చు. సురేష్ మాటల్లే అదేం గుర్తించలేదు రూప. నిజంగా అతని కులం గురించి అడగాలని కూడా అంతవరకు ఆమెకి తట్టలేదు.
"అదేమిటే ఏ కులం వాడో తెలుసుకోకుండానే ఎలా ప్రేమలో పడ్డావే.....రేపు పెళ్ళి ఎలా చేసుకుందామానుకుంటున్నావు.....బ్రాహ్మడు కాకపోతే మీ నాన్న ఒప్పుకుంటారనుకుంటావా? ఒసేయ్! ఎన్ని పెద్ద కబుర్లు చెప్పినా పెళ్ళి దగ్గరకు వచ్చేసరికి అందరికీ కులాల మతాల పట్టింపులు వాటంతట అవే వస్తాయి. మనం ఇంకా అలా ప్రగతి సాధించలేదు. కాగితాలలో తప్ప కార్యాచరణలో లేదు...."
"అబ్బ ప్రేమకి కులాలు అడ్డురవమ్మా....ముందన్ని అడిగి ప్రేమించుకుంటారేమిటి?" రూప విసుగ్గా అంది." పెద్ద కబుర్లు చెప్పకుండా ముందు అతని కులం గురించి తెలుసుకో......ఇంతకీ అతనితో పెళ్ళి విషయం ఎత్తావా?" ఏమన్నాడు?" ఆరాటంగా అడిగింది పద్మావతి. రూప కొంచెం తడబడింది.
"ఇంకా అడగలేదమ్మా.....ముందురోజే ఎవరన్నా అడుగుతారేమిటి?.....అడుగుతాను..." అంది గొణుగుతూ.
"ఒసే నీకు బుర్ర వుందో లేదో నాకర్ధం కావడం లేదు. మూడు నాలుగు నెలలబట్టి అతనితో తిరుగుతున్నావు. ఇప్పటివరకు పెళ్ళి విషయం అడగలేదంటున్నావు రేపు అతనికా ఉద్దేశం లేదంటే ఏం చేస్తావు? ఇప్పటికే నలుగురి నోళ్ళలో నానావు. రేపు ఇదంతా అందరికి తెల్సి ఎవడు చేసుకోక అలా వుంచి నీ బతుకేం అవుతుందో ఆలోచించావా. నీకంత బుద్దిలేకుండా పొయిందేం? ఎందుకీ చదువు ఈ మాత్రం లోకజ్ఞానం లేకపోయాక" పద్మావతి తీక్షణంగా అంది.
తల్లి మాటలు వింటుంటే రూపకి కొద్దిగా భయం కల్గింది. నిజమే, అను వెర్రిగా సురేష్ ని ప్రేమించింది.....కానీ పెళ్ళి గురించి ఆలోచించలేదు. ఇంతవరకూ ఆ ప్రసక్తే తీసుకురాలేదు......తను అతిగా ప్రవర్తించి, చాలా దూరం వెళ్ళింది. అన్న భావం ఆ క్షణంలోనే కల్గింది. జవాబు ఇవ్వకుండా తల దించుకుంది. కూతురి మొహం చూసేసరికి పద్మావతికి ఏదో అనుమానం కల్గింది.
"వుట్టి షికార్లు, సినిమాలేనా ఇంకా ఏమన్నా వుందా...నిజం చెప్పు" అంది నిలేస్తూ.
"అబ్బ ఏమిటమ్మా......నాకామాత్రం బుద్ది లేదనుకుంటున్నావేమిటి?" అంది.
దబాయింపుగా. వట్టి షికార్లే కాదు....కనీసం అరుసార్లన్న అతనితో హోటలులో గడిపినట్లు తల్లి తండ్రికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచిస్తుంటే రూప తను తొందర పడిందేమోనన్న భావం కల్గింది. పద్మావతి ఆ జవాబుతో కాస్త భారం దిగినట్లు సంతృప్తి పడింది. ఈకాలం పిల్లలు చదువుకున్నవాళ్ళు అంత త్వరగా మాయ మాటలకి బోల్తపడరులే. ఏదో టినేజ్ వయసు ఈ ఆకర్షణలు, ప్రేమలు అదంతా ఏదో ఎడంచర్ అనుకుంటారు గాని అంత సాహసం చెయ్యదు రూప అని నమ్మింది.
"రూప! అయిందేదో అయింది ఆ అబ్బాయి ఇంకా చదువుతున్నాడు. ఇంకా చిన్నవాడే.......ఉద్యోగం సద్యోగం లేకుండా ఇప్పటినించి పెళ్ళిచేసుకుంటాడా? అసలు అతని అభిప్రాయాలు ఏమిటో అడుగు. పెళ్ళి ప్రసక్తి తీసుకురా....అతనితో నీవు ముందు మాట్లాడక తరువాత సంగతి ఆలోచిద్దాం. తరువాత మీ నాన్న వాళ్ళ వాళ్ళని కలుస్తారు....పాస్తులు, ఆ అబ్బాయి ఉద్దేశం అన్నీ అడుగు రేపు వివరంగానే నీకు మీ నాన్న సంగతి తెలుసు. ఈ ప్రేమలు, తిరుగుడు అవన్నీ అయన ఒప్పుకోరు. ఆ అబ్బాయి కానీ కాదు అన్నాడంటే.....నాకు భయంగా వుంది...."పద్మావతి ఊహించడానికే భయపడింది.
"ఆ.....లేదు అంటాడు. ఎందుకు చేసుకోడు ఇన్నాళ్ళు తిరిగి చేసుకోనంటే ఊరుకుంటానేమిటి?" దబాయింపుగా అంది రూప.
"ఊరుకొక ఏం చేస్తావేం?" కూతుర్ని పరీక్షగా చూస్తూ అంది పద్మావతి.
"ఏం చేస్తానో చూద్దువుగాని, నేనేం అంత వెర్రిదాన్ని కాదు. ఇదివరకులా చదువు సంధ్య లేని అమాయకురాలిని కాదు" ధీమాగా అంది.
"హు....అనుకుంటున్నావు. ఆడది ఎప్పుడూ మోసగింపబడడం అన్నది యుగయుగాలనించి వస్తున్నది. ఎంత చదువుకున్నా ఎంత అనుభవం వున్నా మగాడిదే పై చెయ్యి. శారీరకంగా మానసికంగా బలవంతులు వాళ్ళు. ప్రకృతే ఆ వరం ఇచ్చింది వాళ్ళకి. మనం ఈనాడు మార్చలేం చదువుకున్నందుకు లోకజ్ఞానం అలవరచుకున్నందుకు మనం వాళ్ళ చేత వంచించ బడకుండా చూసుకోవడంలో తెలివితేటలు చూపాలి గాని, ఓసారి వాళ్ళ వలలో పడ్డాక వాళ్ళు మోసగించినా, ఎంత అన్యాయానికి అక్రమానికి వడిగాట్టినా మనం చెయ్యగల్గింది ఏమి వుండదన్నది తెల్సుకో, రూపా! ఇదంతా నాకేదో భయంగా వుంది. నీవు రేపు ఆ అబ్బాయిని కల్సుకుని అన్ని విషయాలు మాట్లాడేవరకు నా మనసు మనసులో వుండదు.
మీ నాన్న సంగతి తలచుకుంటే నాకు భయం వేస్తుంది. ఒసేయ్....ఇన్నిసార్లు అడిగాను కన్నతల్లిని, నా దగ్గిర ఇలా అబద్దాలాడి, మోసం చేస్తావా?రూపా! కూతురు ఏదో తప్పు చేసిందన్నది వీళ్ళనోట వాళ్ళ నోట అనడం ఎంత భాధకరమో నీకూ బిడ్డలు పుట్టాకకానీ తెలియదు. నీవేం చేసేది.....మంచో.....చెడో.....దాచకుండా తల్లితండ్రుల దగ్గిర దాపరికం లేకుండా చెప్పగలిగిన పిల్లలు మంచి పెంపకానికి గుర్తులు. నీవు సినిమా కెళ్ళు, షికారు కెళ్ళు , ఫ్రెండ్ తో తిరుగు.....ఏం చేసినా ధైర్యంగా ఫలానా చోటికి వెళ్ళానని చెప్పగలిగిన ఆత్మస్థయిర్యం నీకు నేను ఇవ్వలేకపోయనంటే బహుశా నా పెంపకంలో లోపమేమో?రూపా! నీకోసం మీ నాన్నతో ఎన్ని విషయాలలో దెబ్బలాడలేదు -బెల్ బాటమ్స్ వేసుకుంటానంటే, జుత్తు కత్తిరించుకుంటానంటే, పార్టిలకి వెడతానంటే, టైపుకి వెడతానంటే....ఏది వద్దన్నాను అన్నింటికి మీ నాన్నతో వాదించి ఒప్పించాను.
ఇది నీవు నాకు అలా ముందు ఎందుకు చెప్పలేదు? నీ కంతగా అతను నచ్చితే మీ నాన్నని ఒప్పించి పెళ్ళి అయ్యేట్టు చూసేదాన్ని కదా....ఇలా నలుగురి నోళ్ళలో పడేకంటే, తల్లితండ్రుల పరువుతో అడుకునేకంటే తల్లితండ్రులతో నిజాయితీగా వున్న విషయం చెప్పడం మంచిదని తోచలేదా.....నీ మేలు కోరేవాళ్ళు మాకంటే ఎవరన్నా వుంటారా?" పద్మావతి ఆవేదనగా అంది.