Previous Page Next Page 
40 వసంతాల తెలుగుదేశం పేజి 6

                                 


                          

    (ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ ప్రతిష్టించిన తెలుగువారి విగ్రహాలు
    రాబోయే తరాలకు స్పూర్తిదాయకంగా నిలిచాయి. హుస్సేన్
    సాగర్ లో ఎత్తైన బుద్ధ విగ్రహ స్థాపన తెలుగువారి సాంస్కృతిక
    వారసత్వాన్ని కొత్త తరాలకు గుర్తుచేస్తుంది.)

    (తెలుగు దేశం హయంలోనే హైదరాబాద్ నగరంలో తెలుగు భాషకు, తెలుగు
    సాంప్రదాయక కళలకు ఆదరం పెరిగింది. ఆనాటి నుంచే తెలుగువారికి
    రాజధానితో అనుబంధం పెరిగింది.)

    దక్కనీ సంస్కృతీతో విలసిల్లిన హైదరాబాద్ కు తెలుగు సొబగులు అద్దిన ఘనత తెలుగుదేశానిదే. 1956 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, 1980 వ దశకం వరకు హైదరాబాద్ లో తెలుగుకు ప్రాధాన్యం లేదు. ఎన్టీఆర్ రాకతో పరిస్థితిలో గణనీయమైన మార్పు సంభవించింది. నగరంలో తెలుగు భాషకు తెలుగు సంప్రదాయక కళలకు ఆదరం పెరిగింది.
    హైదరాబాద్ కు ఒడ్డాణాంగా ఉన్న హుస్సేన్ సాగర్ మీద ట్యాంక్ బండ్ ను విస్తరించి, తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళాప్రాంగణం పేరుతొ 1986 లో ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు ఎన్టీఆర్ కృషి వల్లే సాధ్యమైంది. ట్యాంక్ బండ్ ను సుందరీకరించి, ఒకవైపు కాకతీయ, మరోవైపు విజయనగర తోరణాలను ఏర్పాటు చేసి, మధ్యలో తెలుగు భాషా సంస్కృతుల కోసం పాటుబడిన 33 మంది విగ్రహాలను ప్రతిష్టించారు.
    వీటిని తన స్వీయపర్యవేక్షణలో ప్రముఖ శిల్పి గణపతి స్థపతి చేత ఎన్టీఆర్ చెక్కించారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు మార్కస్ బార్ ట్లే, జైహింద్ సత్యం సాయంతో చారిత్రక పురుషుల రూప నిర్ణయం చేశారు. వీరిలో రాణి రుద్రమ నుంచి మొదలుకొని, మఖ్దూం మొహియుద్దీన్ వరకు వివిధ రంగాల్లో తెలుగు వారికి చేసిన సేవను ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి రెండు పంక్తుల్లో లిఖించారు. ఉదాహరణకు కవయిత్రి మొల్ల విగ్రహం మీద చెక్కిన పంక్తులివి.
        కవితలల్లిన తోలి తెలుగు విదుషీమణి
           రామాయణ కావ్యరచనా రసధుని
    ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ ప్రతిష్టించిన తెలుగు వెలుగుల విగ్రహాలు రాబోయే తరాలకు సూర్తిదాయకంగా నిలిచాయి. పక్కనే హుస్సేన్ సాగర్ లో ఎత్తైన బుద్ద విగ్రహ స్థాపన కూడా తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుచేస్తుంది. తీరాంధ్ర, తెలంగాణ ప్రాంతంలో ఒకనాడు బౌద్ధం వర్ధిల్లింది. చరిత్రలో వివిధ కాలాల్లో బుద్దుని బోధనలు తెలుగువారిని ప్రభావితం చేశాయి. అమరావతి;లోను, ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో లభించిన అవశేషాలు తెలుగువారికి బౌద్డంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. నాగార్జునసాగర్ లో లభ్యమైన బుద్దుని విగ్రహం ప్రపంచ ప్రసిద్దమైంది. ఈ ఆంధ్ర బౌద్ద శిల్పకళారీతే , శ్రీలంక , థాయలాండ్ , జపాన్ వంటి దేశాలకు పాకింది. ఈ వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ హుసేన్ సాగర్ లో 17 మీటర్ల పొడవైన బుద్దుని ఏకశిలా విగ్రహాన్ని ఎన్టీఆర్ ప్రతిష్టించారు.
    అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా 1986 లో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో తెలుగు లలిత కళాతోరణం నిర్మాణం వల్ల తెలుగు శాస్త్రీయ , జానపద కళాప్రదర్శనలకు ప్రోత్సాహం లభించింది. తెలుగు భాష , సాహిత్యం, కళారూపాల పరిశోధనలకు తోడ్పడిన తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను తెలుగు నగరంగా మార్చడంలో పాత్ర వహించింది.

                           జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర


    ప్రాంతీయ పార్టీగా ఏర్పడినా జాతీయస్థాయిలో చక్రం తిప్పిన ఘనత తెలుగుదేశానిదే. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయానికి కృషి చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రాంతీయ పార్టీ స్థాపకుడైన జాతీయస్థాయి నాయకుడిగా ఎన్టీఆర్ అచిరకాలంలోనే ఎదిగారు. 1983 లోనే విజయవాడలో ప్రతిపక్షాలతో ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసి కకావికలంగా ఉన్న కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. 1980 వ దశకంలో దేశ రాజకేయాల్లో కీలక మార్పులకు కేంద్రంగా డిల్లీ లోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఉండేదనడంలో అతిశయోక్తి లేదు.
    కాంగ్రేసేతర రాజకీయ శక్తుల ఏకీకరణ కోసం ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా పర్వటించారు. ఉత్తరాధితో సహా దేశంలో 16 రాష్ట్రాల్లో అయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుజరాత్ నుంచి బెంగాల్ వరకు, కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు అన్ని చోట్లా జనం ఆయనకు నీరాజనాలు పట్టారు. అస్సాంలో అసోం గణ పరిషత్ గెలుపునకు కృషి చేశారు. హర్యానా పర్యటనలో చైతన్య రధం పై నుంచి అయన హిందీలో చేసిన ప్రసంగాలు స్థానికులను ఊర్రుతులూగించాయి. 1987 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దేవీలాల్ ఘన విజయానికి ఎన్టీఆర్ మద్దతు కారణమని హిందీ పత్రికలు రాశాయి. ఉత్తరాదిలో ఆ స్థాయిలో ప్రజాదరణ పొందిన దక్షిణాది నాయకుడు అప్పటికి ఇప్పటికి మరొక నాయకుడు లేరు.
        దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటి మీదకు తీసుకు రావడంలో ఎన్టీఆర్ పాత్ర చారిత్రాత్మకం. 1977 లో జనతా పార్టీ ప్రయోగం తర్వాత కేంద్రంలో ఏక పార్టీ పాలనకు చరమగీతం పాడి, ప్రత్నామ్నాయ రాజకీయ శక్తిని తయారుచేయడంలో ఎన్టీఆర్ దే కీలకపాత్ర . దేశంలోని ఏడు రాజకీయ పార్టీలను దగ్గరకు చేర్చి, జాతీయ స్థాయిలో నేషనల్ ప్రంట్ ను ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతో శ్రమించారు. ఈ ప్రయత్నంలో అయన పాత్రను గుర్తింపుగానే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ కు గౌరవం దక్కింది. చరణ్ సింగ్, విశ్వనాద్ ప్రతాప్ సింగ్ మధు దండావతే, ఎబి వాజ్ పేయి, ఎల్ కే అద్వాని, దేవీలాల్ , బిజూ పట్నాయక్ , జ్యోతిబసు, ఫరూక్ అబ్దుల్లా, ఎం కరుణానిధి , రామకృష్ణ హెగ్డే, శరద్ యాదవ్ వంటి జాతీయ , ప్రాంతీయ నాయకుల ఆదరణ, అభిమానాన్ని పొందిన నాయకుడు ఎన్టీఆర్.
    1989 లో స్వరాష్ట్రం ఓటమి సంభావించకుండా ఉంటే, దేశంలో అత్యున్నత పదవులు అధిరోహించే అవకాశం ఎన్టీఆర్ కి ఉండేదని పరిశీలకుల అభిప్రాయం. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో ఆయనది ముఖ్యపాత్ర అయినప్పటికీ ఎన్టీఆర్ పదవి కోరుకోలేదు. అంతర్గత విభేదాలతో సతమతమైన ఫ్రంట్ ప్రభుత్వాన్ని నిలపడానికి అయన చివరి దాకా శాయశక్తులా కృషి చేశారు.

    (దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటి మీదకు
    తీసుకురావడంలో ఎన్టీఆర్ పాత్ర చారిత్రాత్మకం. జాతీయ స్థాయిలో
    నేషనల్ ప్రంట్ ఏర్పాటులో ఎన్టీఆర్ ది కీలకపాత్ర .)

                

    (కాంగ్రెసేతర రాజకీయ శక్తుల ఏకీకరణ కోసం ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించారు.
    ఉత్తరాదితో సహా దేశంలో 16 రాష్ట్రాలలో అయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
    గుజరాత్ నుంచి బెంగాల్ వరకు, కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు అన్ని చోట్లా
    జనం ఆయనకు నీరాజనాలు పట్టారు.ఉత్తరాదిలో ఆ స్థాయిలో ప్రజాదరణ పొందిన
     దక్షిణాది నాయకుడు అప్పటికి ఇప్పటికి మరొక నాయకుడు లేరు.)

 Previous Page Next Page