విద్యారంగంలో పెనుమార్పులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంది. అధికారాన్ని చేపట్టిన వెంటనే విద్యాసంస్థలు, మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజీలు , డొనేషన్లు తీసుకునే విధానాన్ని ఎన్టీఆర్ నిషేధించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యనూ పెంపొందించడానికి తెలుగు విశ్వవిద్యాలయం , యూనివర్శీటీ ఆఫ్ మెడికల్ సైన్సేన్స్ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాలను స్థాపించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదరాబాదు లోను, మెడికల్ యూనివర్సిటీ విజయవాడ లోను, మహిళా విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలోనూ ప్రారంభించారు. ఓపెన్ యూనివర్సిటీ ఆలోచన కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో రూపుదిద్దుకున్నా, దానిని సాకారం చేసింది కూడా ఎన్టీఆరే. ఉన్నత విద్యలో ప్రమాణాలను మెరుగుపర్చడానికి తొలిసారిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ) ని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే , పోటీ పరీక్షల ద్వారా మెడికల్ , ఇంజనీరింగ్ వంటి ప్రోఫెషనల్ కోర్సుల్లో విద్యార్ధులను చేర్చుకోడానికి ఎంట్రన్స్ పరీక్షా విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో కొత్తగా 63 డిగ్రీ కళాశాలలు , 860 ఉన్నత పాఠశాలలు, 3,008 ప్రాధమిక పాఠశాలతో పాటు 18,655 పాఠశాల భవనాలు నిర్మించింది.
రాష్ట్రంలో ఎంతో ఆదరణ పొందిన ఆశ్రమ పాఠశాలలను (రెసిడెన్షియల్ స్కూల్స్) ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దే. పల్లెల్లో నివసించే పిల్లలకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే తలంపుతో అయన ప్రతి జిల్లాలో రెండు ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించారు. 1983-84 కు పూర్వం రాష్ట్రంలో పది ఆశ్రమ పాఠశాలలు , రెండు కళాశాలలు ఉండగా , తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 69 ఆశ్రమ పాఠశాలలు, నాలుగు కళాశాలలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించడంలో ఈ ఆశ్రమ పాఠశాలలు గొప్ప పాత్ర పోషించాయి. ప్రతిభావంతులైన విద్యార్ధులను ప్రోత్సహించేందుకు విజ్ఞాన పారితోషకం అనే పధకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు కొత్తగా వసతి గృహాలు నిర్మించారు.
ప్రస్తుత విద్యావిధానం పట్ల ఎన్టీఆర్ అసంతృప్తితో ఉండేవారు. మన విద్యావిధానం గుమాస్తాలను తయారుచేయడానికి మాత్రమే పనికి వస్తుందని, తమ కాళ్ళ మీద నిలబడగలిగే సామర్ధ్యాన్ని భావిభారత పౌరులకు నేర్పడం లేదని అయన ఉద్దేశం. అందుకే ఆరు నెలలు తరగతి గదుల్లో విద్యాభోధన , ఆరు నెలలు ప్రాక్టికల్
(రాష్ట్రంలో ఎంతో ఆదరణ పొందిన రెసిడెన్షియల్ స్కూల్స్ ను
పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దే. గ్రామీణ విద్యార్ధులకు
నాణ్యమైన విద్యనందించడంలో ఇవి గొప్ప పాత్ర పోషించాయి.)
నైపుణ్య శిక్షణ ఉండాలని అయన భావించారు. ఇందుకు అనుగుణంగా 345 కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టారు. స్వయం ఉపాధి వైపునకు విద్యార్ధులను ఆకర్షించడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయని ఆశించారు. దేశంలో మొదటిసారిగా ఆడియో విజువల్ పద్దతుల ద్వారా విద్యాభోధనకు శ్రీకారం చుట్టిన ఘనత కూడా ఎన్టీఆర్ దే. దృశ్య శ్రవణ విద్యా కార్యక్రమాల పేరుతొ తొలుత 600 పాఠశాలకు టెలివిజన్ సెట్లు, వీడియో టేపులను అందజేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఈ వీడియో పాఠాలను తెలుగువారికి సుపరిచితులైన బాపు, రమణ ల అధ్వర్యంలో తయారుచేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల పాఠశాలల్లో దృశ్యశ్రవణ విధానంలో పాఠాలు నేర్పించాలని నిశ్చయించారు. తర్వాతి ప్రభుత్వాలు వీటిని నిర్లక్ష్యం చేశాయి.
ప్రాధమిక విద్యారంగంలో మౌలిక మార్పులు తీసుకురావడానికి ఎన్టీఆర్ ఆలోచన చేశారు. అందుకోసం కోనేరు రామకృష్ణారావు కమిటి ని ఏర్పాటు చేశారు. గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని, ప్రోఫెషనల్ స్టడీస్ ఇన్ స్టిట్యుట్ ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచించారు. ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఒకేచోట ఉండి గురుకుల విధానంలో విద్యను అభ్యసించడానికి వీలుగా ఒక ఆదర్శ వ్యవస్థను నిర్మించాలని ఎన్టీఆర్ కలలు గన్నారు. ఇందుకోసం గురుకుల వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు కూడా సిద్దం చేశారు. విద్యారంగంలో విలువలు ప్రవేశపెట్టడానికి ఎన్టీఆర్ పడిన తపన అయన తీసుకున్న అనేక నిర్ణయాల్లో వెల్లడవుతుంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత రాష్ట్ర విద్యారంగంలో కొత్త ఉత్తేజం వచ్చింది.
తెలుగుదేశం హయాంలో తెలుగుదనం పల్లవించింది. తెలుగు భాషా సంస్కృతులకు తెలుగుదేశం ప్రభుత్వం పునరుజ్జీవనం కల్పించింది. మూర్తిభవించిన తెలుగువాడిగా తెలుగు భాషకు ఎన్టీఆర్ పట్టం గట్టారు. తెలుగు భాషను ప్రధాన భాషగా, అధికార భాషగా అన్ని స్థాయిల్లో అమలు చేసిన ఘనత ఆయనదే. పాలనా సంబంధమైన కార్యకలాపాలు మాతృభాష లోనే జరగాలని, విద్యాబోధన అమ్మనుడిలోనే ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి, అందుకోసం అనేక చర్యలు తీసుకొంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో తెలుగును పాలనా భాషగా ప్రవేశపెడుతూ ఉత్తర్వులు చేసింది. అన్ని శాసనేతర అంశాలకు సచివాలయ స్థాయిలో తెలుగు ప్రధాన భాషగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఆయా శాఖల్లో వాడే ఇంగ్లీష్ పదాలకు తెలుగులో 30 పద కోశాలను వెలువరించింది. 1987 ఉగాది నుండి
(తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ తెలుగు భాషకు పట్టం గట్టారు.
పాలనలో తెలుగు అమలును తప్పనిసరి చేశారు. శాసనసభలో అధికార
బిల్లులు తెలుగులోనే ప్రవేశపెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. సాంకేతిక
విద్యాబోధనకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
శాసనసభలో బిల్లులు తెలుగులోనే ప్రవేశపెట్టాలని ఆదేశాలు ఇచ్చిన
ప్రభుత్వం ఎన్టీఆర్ దే. ప్రభుత్వ పధకాలకు గ్రామీణ క్రాంతి పధం వంటి
అచ్చ తెలుగు పేర్లు పెట్టింది కూడా ఎన్టీఆర్ దే.)
సచివాలయ శాఖల్లో , శాఖాధిపతుల కార్యాలయాల్లో అన్ని శాసనేతర అంశాలకు తెలుగునే వాడాలని, తెలుగు వాడకాన్ని విధిగా పాటించేందుకు ఆయా శాఖల కార్యదర్శులను బాధ్యులను చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. శాసనసభలో అధికార బిల్లులు తెలుగులోనే ప్రవేశపెట్టాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు తెలుగు, ఇంగ్లీషు భాషల సౌలభ్యంతో ఉండాలని కూడా నిర్ణయించింది.
సచివాలయంలోని వివిధ విభాగాల అధికారులకు తెలుగు అకాడమీ అధ్వర్యంలో 1983 ఏప్రిల్ లో తెలుగు తరగతులను మొదలుపెట్టి, ఆ తర్వాత కార్యదర్శుల స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఇంగ్లీషు టైపిస్టులకు, స్టెనోలకు తెలుగు టైప్ రైటింగ్ లో, తెలుగు షార్ట్ హ్యాండ్ లో శిక్షణ ఇచ్చారు. మొత్తం నాలుగు శిక్షణా కేంద్రాల్లో 1,800 మంది ఉద్యోగులకు తెలుగు టైప్ రైటింగ్ నేర్పించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో తెలుగు, ఇంగ్లీషు , టైప్ రైటర్లు సమాన నిష్పత్తిలో ఉండాలని 1986 లో నిర్ణయించి ఆ మేరకు ఎన్టీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల నమూనాలను చిన్న పుస్తకంగా ప్రకటించి , జిల్లాస్థాయిలో పంపిణీ చేసింది. 1987 లో మరొక ప్రధాన నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ ఉద్యోగాలలో నేరుగా నియమితులయ్యే టైపిస్టులకు తెలుగు టైప్ రైటింగ్ అర్హత విధిగా ఉండాలని, ఇంగ్లీషు టైప్ రైటింగ్ అర్హత విశేషార్హతగా ఉండాలని ప్రకటించింది. తెలుగు విశ్వవిద్యాలయంగా తర్వాత మార్పు చెందిన తెలుగు విజ్ఞాన పీఠం ఏర్పాటు తెలుగు పరిశోధనలకు ఊతమిచ్చింది.
ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వ ప్రకటనలన్నీ అచ్చ తెలుగులో ఆకర్షణీయంగా ఉండేవి. ఏటా జరిగే తెలుగుదేశం మహానాడు సమావేశాల్లో తెలుగుదనం ఉట్టిపడేది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, తెలుగు ఆటలు, తెలుగు పాటలతో అలరారేది. ప్రభుత్వ పరంగా జరిగే సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సావాలల్లో తెలుగు సాంస్కృతిక రూపాలకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద పీట వేశారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తెలుగులో చేసే ఉపన్యాసాలు వీనులవిందుగా ఉండేవి. తెలుగు గ్రామీణ క్రాంతి పధం, తెలుగు చిరంజీవ సుఖీభవం వంటి తెలుగు పేర్లను ప్రభుత్వ పధకాలకు పెట్టె సంప్రదాయాన్ని ఎన్టీఆరే మొదలుపెట్టారు.