"పెట్టు......కాని ఓ విషయం గుర్తుంచుకో. నువు చేస్తున్న పని కేవలం జరుగుతున్న దోపిడిని, అన్యాయాన్ని భరించలేక ఓ మనస్సున్న మనిషిగా చేస్తున్నట్లు, ఇది ప్రీప్లాన్డ్ అని గాని, మనం ఏం ఆశించి ఈ పనిచేస్తున్నామన్నది గాని మన ఐదుగురిలోనే సమాధి అయిపోవాలి. బయటికొస్తే తెలుసుగా.....ఈ రాజ్ సాబ్ ఏం చేస్తాడో-ఏం చేయిస్తాడో!?" సత్యరాజ్ మాటల్లో ఉన్న సలహా, దాని వెనుక వున్న హెచ్చరికను కూడా ఆ నలుగురూ అర్థం చేసుకున్నారు.
ముందుగా దీపక్ రాజ్ లేచాడు. మిగతా ముగ్గురూ లేస్తుండగా మరలా అన్నాడు సత్యరాజ్ "ఓ చెడ్డవాణ్ని మంచివాడిగా చేయటానికి వెధవ తెలివితేటలు అక్కర్లేదు. కాని సహనం, మంచితనం, లక్ష్యం వుండాలి. అదే ఓ మంచివాడ్ని చెడగొట్టటానికి వెధవ తెలివి తేటలేకాదు__ చావు తెలివితేటలు కూడా వుండాలి. హసీంఖాన్ ని తోడుగా ఉంచుకో లక్ష్యంలో మంచి, చెడూ వుండవచ్చుగాని, లక్ష్యసాధనలో మాత్రం ఒకే పట్టుదల వుండాలి. అవసరం అనుకుంటే సరస్వతి సహాయం కూడా తీసుకో. డబ్బు అవసరం వుంటే బిర్క్ కి తెలియజేయ్....." చివర మాటలు ఇక వెళ్ళిరావచ్చు అనట్లుగా వున్నాయి.
నలుగురూ ఆ ఎయిర్ కండీషన్ డ్ హాల్లోంచి బయటపడ్డారు.
ఊరికి కాస్త దూరంగా, కార్మిక పురానికి దగ్గరగా వున్న ఆ ఇంటి బయట నిరాడంబరతను తెలిసినవాళ్ళు లక్షల్లో వున్నా, లోపలున్న రిచ్ నెస్ ని చూసినవాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది.
అప్పటివరకు సత్యరాజ్ బంగ్లా ముందు ఆగివున్న పాత మిలటరీ జీప్ ఆ నలుగుర్ని ఎక్కించుకున్న మరుక్షణం రివ్వున ముందుకు పోతోంది చీకటిని చీల్చుకుంటూ, రోడ్డును మ్రింగుకుంటూ.
"ఎక్కడికి......?" జీప్ ని డ్రైవ్ చేస్తున్న లాల్ సింగ్ బిర్క్ అడిగాడు- సరిగ్గా అదే సమయంలో దీపక్ రాజ్ సరస్వతి భుజంమీద చేయి వేసి మృదువుగా నిమురుతున్నాడు. అలా నిమరాలనేవుద్దేశ్యం జీప్ ఎక్కేముందే కల్గటంతో సరస్వతిని చేయిపట్టుకొని వెనుకవేపుకి లాగాడు.
హసీంఖాన్ మాత్రం బిర్క్ పక్కనే ముందు సీట్లో కూర్చున్నాడు.
"ఇప్పుడు టైమెంత.......?" సరస్వతి వేపే చూస్తూ బిర్క్ ని అడిగాడు దీపక్ రాజ్.
"ఎక్కడికి అని నేనడిగాను___టైమెంత అని నువ్వడిగావు...!" కోపంగా అన్నాడు బిర్క్.
"టైమ్ ని బట్టే ఎక్కడికీ అనేది చెబుతాను" శాంతంగా అన్నాడు. దీపక్ రాజ్.
బిర్క్ ఓసారి వాచీ చూసుకొని "12-45" అన్నాడు.
"ఓ పావుగంట టైముందన్నమాట అయితే ఓ పని చేయ్ రోడ్డు పక్కన జీప్ ఆపేసి నువ్వు, ఖాన్ అలా రోడ్డుమీద పచార్లు చేయండి ఓ పది నిమిషాలు అప్పటికి 12-55 అవుతుంది. సరిగ్గా 12-55కి బయలుదేరితే ఒంటిగంటకల్లా కార్మికపురం, స్మశానం దగ్గరకు చేరుకుంటాం అక్కడే సత్తెయ్య క్వార్టర్స్....." దీపక్ రాజ్ మాటలు పూర్తవుతుండగా జీప్ సడన్ బ్రేకుతో రోడ్డుపక్కగా ఆగింది.
బిర్క్ ఇంజన్ ఆఫ్ చేసి జీప్ దిగుతూ అన్నాడు. "కొన్ని కోట్ల రూపాయల పథకాన్ని మనల్ని నమ్మి మన చేతుల్లో పెట్టాడు. రాజ్ సాబ్ డానికి సంబంధించిన టెన్షన్ ఏమీ నీలో లేదు సరికదా-చాలా తాపీగా మూడ్ బావున్నప్పుడు చేయాల్సిన పనులు, చేస్తున్నావ్....." బిర్క్ గొంతులో చిరాకు తొంగి చూసింది.
హసీంఖాన్ మౌనంగా రోడ్డు ఆవలి వేపుకి వెళ్ళిపోయాడు.
దీపక్ రాజ్ తల మాత్రం ముందుకువంచి "మనం వున్నది నిశ్చింతగా గుండెలమీద చేతులువేసుకొనే వృత్తిలోకాదు. ఏ క్షణాన చస్తామో తెలియదు. ప్రతిక్షణం విలువైనదే, అందుకే ఈ పది నిముషాల కాలానికి సరస్వతితో విలువ కడుతున్నాను. నీవన్న టెన్షన్ నాకు పనికిముందే ప్రారంభమవుతుంది. అయితే నీకది కనిపించదు. ఆ టెన్షన్ పోవటానికే ఈ పదినిమిషాలు ఉపయోగించుకుంటున్నాను. అనవసరంగా ఇప్పటికేనిమిషం తినేశావు నోర్మూసుకొని అవతలకెళ్ళు. ఇంక నేను ఆగలేను" అంటూ కరకుగా హెచ్చరించి సరస్వతివేపు ఒరిగిపోయాడు దీపక్ రాజ్. బిర్క్ పళ్ళు పటపటా కొరుకుతూ హసీంఖాన్ వున్నవేపు నడిచాడు.
రోడ్డు పక్కవున్న ఓ మైలురాయిమీద కూర్చున్న ఖాన్ వేట కుక్కలా అటూ, ఇటూ చూస్తున్నాడు. ఖాన్ కు తెలుసు దీపక్ రాజ్ బలహీనత ఆ సమయంలో ఎవరి మాటవినడని కూడా తెలుసు. సత్యరాజ్ ఎప్పుడయితే దీపక్ రాజ్ తో హసీంఖాన్ సహాయం తీసుకో అని చెప్పాడో అప్పటి నుండే డ్యూటీ ప్రారంభమయిందని ఖాన్ కి తెలుసు.
నగర శివార్లలో ఉన్న బందిపెటు దొంగల బెడద మూలంగా పోలీస్ డిపార్ట్ మెంట్ గస్తీ ఎక్కువగా వుంది ఏ క్షణానైనా పోలీస్ పెట్రోల్ వేన్ ఆ వేపుకి రావిచ్చు. ఆగి ఉన్న తమ జీప్ ని చూస్తే అనుమానం రావచ్చు సోదాలో ఏం దొరకకపోయినా తమ నలుగురి మొఖాలు వారి మెమొరీలో నిక్షిప్తం కావచ్చు. అదంతా క్షేమం కాదని ఖాన్ దూరాలోచన అందుకే ఆలర్ట్ గా ఉన్నాడు.
క్షణాలు.....నిముషాలు భారంగా దొర్లిపోతున్నాయి.
సరిగ్గా 12-55కి బిర్క్ లేచాడు. ఆ వెనుకే ఖాన్ లేచి జీప్ వేపు నడక సాగించాడు.
బిర్క్, ఖాన్ జీప్ దగ్గరకు వచ్చేసరికి దీపక్ రాజ్ చొక్కా గుండీలు పెట్టుకుంటూంటే, సరస్వతి చీర సవరించుకుంటోంది.
బిర్క్ కోపంగా సీట్లో కూర్చున్నాడు. ఖాన్ కూడా ఎక్కగానే బిర్క్ ఇగ్నిషన్ కీ వేపు చేయిచాచాడు.