Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 6


    "ఈ పెళ్ళి జరిగేవరకూ నాకు నమ్మకం లేకపోయింది. మన పెళ్ళి జరుగుతుందని చివరివరకూ అనుకోలేదు" అన్నాడతను.
    
    "ఎందువల్ల?" ఆమె ఆశ్చర్యపోయింది.
    
    "పెళ్ళిచూపులకి నేనూ, మా నాన్న, మధ్యవర్తీ వచ్చామా? తిరిగి వెళుతుంటే కారు ఓ కోడిపిల్లను గుద్దేసింది. నిన్ను చూడడంవల్లే ఈ అపశకునం జరిగిందని, ఈ పెళ్ళి వద్దనీ నాన్న అన్నాడు. కానీ తరువాత మీ నాన్న కున్న అంగబలం, అర్ధబలం కాంట్రాక్టర్ గా నేను ఎదగడానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించి ఓకే చేశాడు. నిశ్చయ్ తాంబూలాలు పుచ్చుకున్నాక ఆయన పోయారు పెళ్ళి అనుకోగానే ఈ కష్టం వచ్చిందని నాకూ అనిపించింది."
    
    ఎవరో తన గుండెను పుస్తకాలు కుట్టే బుక్ షాతో రంధ్రం చేసినట్లు ఆమె విలవిల్లాడి పోయింది. కానీ అది అతను గుర్తించలేదు.
    
    "నీతో పెళ్ళి మానేద్దామనుకున్నాను. కానీ సన్నిహితులు, ఫ్రెండ్స్ అంతా భూపతిరాజుతో వియ్యం వల్ల కలిగే లాభాలను మరీ మరీ చెప్పడం వల్ల సరే అనుకున్నాను" అన్నాడు జగదీష్.
    
    అంతే తనను చూసి, మోహించి, ఇష్టపడి పెళ్ళి చేసుకోలేదన్న మాట. తన తండ్రివల్ల వచ్చే లాభాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్ళి చేసుకొన్నాడన్న మాట.
    
    ఏదో ఆధారం చేసుకుని పాకాలనుకున్న పూలతీగ పుటుక్కున తెగిపోయింది.
    
    ఇలాంటి మాటలు వినడం ఆమెకి ఏమీ కొత్త కాదు. ఎవరయినా పెళ్ళిపత్రిక ఇవ్వగానే "కట్నం ఎంత? బంగారం ఎంత పెడుతున్నారు?" అని అందరూ అడుగుతారు. పెళ్ళికి వెళ్ళి వచ్చిన వాళ్ళతో "అప్పళం వేశారా? పాయం దొన్నెలో పోశారా? గ్లాసుల్లో ఇచ్చారా? పులిహోరలో వేరుశనగపప్పా? జీడిపప్పా?" అని, అడుగుతారు తప్ప అంతకుమించి అమ్మాయి గురించిగానీ, అబ్బాయి గురించిగానీ ఎవరూ అడగరు.
    
    పెళ్ళిచేసుకున్నవాళ్ళు కూడా అంతే. ఈ పెళ్ళి చేసుకోవడం వల్ల వచ్చే లాభాల్నే లెక్కవేస్తారు. అయితే ఇప్పుడు తన గురించీ తన భర్త అలా మాట్లాడడం భరించలేకపోయింది. కానీ ఏం చేయగలదు?
    
    పెళ్ళి చేసుకునేప్పుడు తొంభై శాతం మంది అబ్బాయిలు భార్యవల్ల వచ్చే అదనపు ఆదాయము గురించే లెక్కకడతారు. జగదీష్ కూడా అంతే. అతను మరీ లౌక్యము తెలిసినవాడు కాదు కనుక దాన్ని బయట పెట్టేశాడని సర్ది చెప్పుకుంది.
    
    సరిగ్గా అదే సమయంలో ఆ సిటీలోనే వున్న ఐపిఎస్ కోచింగ్ సెంటర్ హాస్టల్ లో చదువుకుంటున్న వసంత్ రామకోటిలా సూర్యాదేవి పేరును కోటిసార్లు రాయడం పూర్తిచేసి, పెన్ ని అవతల పెట్టి కళ్ళు మూసుకున్నాడు.
    
                                               5
    
    "మూడు రాత్రులై పోయాకగానీ వెళ్ళడం కుదరదంటున్నాడు మావయ్య కానీ ఎల్లుండి టెలికామ్ బిల్డింగ్ కి టెండర్లున్నాయి. తప్పక వెళ్ళాలి కాబట్టి నేవెళ్ళడానికి పర్మిషన్ ఇప్పించడంతో పాటు మీ నాన్నని టెలికామ్ జనరల్ మేనేజర్ కి రికమెండ్ చేయమను" భార్యతో అన్నాడు జగదీష్.
    
    "కాంట్రాక్టులు చేయడం ఎప్పట్నుంచి మొదలుపెట్టారు?" అతని గురించి తెల్సుకోవాలన్న కుతూహలంతో అడిగింది సూర్యాదేవి.
    
    "రెండేళ్ళయింది"
    
    "ఇక ఎప్పుడూ కాంట్రాక్టులేనా?"
    
    "అంతేమరి ఇప్పటికి ఈ రెండేళ్ళలో రెండుకోట్లు సంపాదించాను. ఈ రెండు కోట్లతో ఇంకా పెద్ద కాంట్రాక్ట్ ఆ లాభం, అసలూ కలుపుకుని పెద్ద కాంట్రాక్ట్...." అతను అలా మాట్లాడుతుంటే ఆమెకి తమ ఎదురింట్లో వుండే నరసింహులు గుర్తొచ్చాడు.
    
    మొదట్లో అతను చాలా పేదవాడు. చిన్నగుడిసె భార్యా, ఇద్దరు పిల్లలూ వుండేవాళ్ళు కష్టపడి కూడబెట్టిన డబ్బుతో రెండు పొట్టేలు పిల్లల్ని కొన్నాడు. వాటిని మేపి అమ్మాడు వచ్చిన లాభము, అసలూ కలుపుకుని మొత్తం నాలుగు పిల్లలు కొన్నాడు.
    
    అప్పుడెవరో అడిగారు ఈ నాలుగు పిల్లల్లో వచ్చిన లాభాముతో ఏం చేస్తావని? ఎనిమిది పిల్లల్ని కొంటానని తడుముకోకుండా చెప్పాడు. అలా యాభై పిల్లల్ని కొనేస్థాయికి వచ్చాడు.
    
    అప్పుడూ ఎవరో అడిగారు. ఈ లాభముతో ఏం చేస్తావని? నూరు పిల్లల్ని కొంటాను అని ఖచ్చితంగా చెప్పాడు. అలా నూరు చేశాడు కూడా.
    
    డబ్బుతో పొట్టేలు పిల్లల్ని కొనడము తప్ప మరో ఉపయోగము వుంటుందన్న ధ్యాస వుండేది కాదు నరసింహులికి. అతనికి, జగదీష్ కి ఏం తేడాలేదు. అతను పొట్టేలు పిల్లలంటే, ఇతను అంతకన్నా పెద్ద కాంట్రాక్టు లంటాడు. అంతే భేదం.
    
    కాసేపు అవీ ఇవీ మాట్లాడాక జగదీష్ ఆమె వైపుకి తిరిగి, మీద చేతులు వేశాడు.
    
    ఏ సంచలనమూ కలగలేదామెకు. క్షణం ముందు అతను చేయి పట్టుకున్నప్పుడు కలిగిన సంచలనం ఇప్పుడు లేదు, ఇంతలో ఏమైంది? ఏదో మిస్సయింది. లింకు తెగింది. ఏదో తను మిస్సయ్యానన్న ఫీలింగ్ కోరిక రాజుకోవడానికి అడ్డం పడుతోంది.
    
    భార్యా భర్తల మధ్య వచ్చిన ప్రతి కొట్లాట బెడ్ రూమ్ లో శృంగారం మొదలు కావడంతో పరిసమాప్తమవుతుంది. అలానే ప్రతి ఘర్షణ శృంగారం పూర్తికావడంతో మొదలవుతుంది.
    
    ఈ సూత్రానికి వాళ్ళిద్దరూ అతీతులేం కాదు. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమెలోని చలాకీతనము, ఫాస్ట్ నెస్, భావుకత, జీవితములోని ప్రతిక్షణాల్ని ఎంజాయ్ చేయాలన్న గాఢమైన కొరికా చల్లబడిపోయాయి. మనసు లోపలి పొరల్లో కూరుకుపోయాయి. రొటీన్ నెస్ కి, ఓ విధమైన నిరాసక్తకు అలవాటు పడిపోయింది.
    
    అందుకే రాత్రి అలాంటి కల రావడంతో కంగారుపడింది. ఏదో తెలియని గిల్టీనెస్ క్షణానికోమారు ఆ కలను గుర్తుకు తెస్తుంటే బెంబేలు పడిపోయింది. వివాహిత అయిన తనకు ప్రేమేమిటి? అనుకుంటూ ఆ కలను చెరిపేయాలని నానా తంటాలు పడుతోంది.
    
    అందుకే ఓ దగ్గర కూర్చోలేకపోయింది. కొంతసేపు ఆడియోలో పాటలు వింది. చివరికి వీడియోలో ఇంగ్లీషు సినిమా వేసుకుని చూసింది.
    
    మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతాన జగదీష్ వచ్చాడు లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని ఏవేవో గల గలా మాట్లాడింది. అతను బట్టలు మార్చుకునేలోపు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దించి, అతను వచ్చాక ప్రతీదీ కొసరి కొసరి వడ్డించడం ప్రారంభించింది.
    
    మైక్ టైసన్ జైల్లో ఏం చేస్తున్నాడో దగ్గర్నుంచి మైఖేల్ జాక్సన్ పెళ్ళి వరకు మాట్లాడుతూ ఓ దగ్గర సడెన్ గా ఆగిపోయి గట్టిగా కేక పెట్టింది.
    
    తింటున్న అతనికి పొలమారింది. "ఏమైంది సూర్యా?" కంగారుగా అడిగాడు.
    
    బాధ భయమూ కలగాపులగంగా కలిసిపోయి వణుకుతున్న ఆమె సర్వశక్తుల్నీ కూడదీసుకుని ఒక్కో పదాన్ని చెప్పింది. "మే తలమీద రెండు కొమ్ములు మొలుస్తున్నాయి"

 Previous Page Next Page