ఆవేశంలో రాధ ఇంటికి వెళ్ళింది.
రాధ కనిపించగానే ఆమెకు బి.పి పెరిగిపోయింది. అనరాని మాటలూ అంది. రాధ భయపడి ఏడుస్తుందనీ, మరెప్పుడూ ఇలా జరగదని వేడుకుని విశ్వాన్ని దూరం చేసుకుంటాననీ ప్రామిస్ ఇస్తుందనీ ఆశించింది. కాని రాధ అలా మాట్లాడలేదు. "నన్నెందుకు అడుగుతున్నావు. విశ్వాన్ని అడక్కుండా?" అంది. భర్తను అడిగే అలవాటు విశాలకు ఎప్పుడూ లేదు. ఆమె దృష్టిలో భర్త శ్రీరాముడు స్త్రీలే శూర్పణఖలు.
"నీ భర్త దగ్గర నువ్వెప్పుడూ మంచిదానివి కావాలనే స్వార్ధం నీది. అన్ని రకాలుగా వంచింపబడ్డ నాకు ఓ ఆసరా కావాలి. అది విశ్వం ఇస్తున్నాడు. నేనెందుకు కాదనాలి? చేతనయితే అతడిని నా దగ్గరకు రాకుండా మాన్పించు. నా అంతట నేను అతడి వెంటబడి పిలవను" అంది రాధ. మాటా మాటా పెరిగింది. రాధ తన పట్టుదల విడవక పోవడంతో శాపనార్ధాలు పెడుతూ పక్కనున్న ఫ్లవర్ వేజ్ తీసి తలమీద కొట్టింది. అది తగలకూడని చోట తగులుతుందని ఊహించలేదు. రక్తం కారుతూ రాధ కిందపడగానే భయంతో బిగుసుకుపోయింది. కాస్త తమాయించుకుని చూసేసరికి ఆమెలో కదలిక లేదు. అయితే విశాల చాలా తెలివిగలది, మొదట్లో కొంచెం భయపడినా వెంటనే ఏం చేయాలో ఆలోచించుకుంది. పగిలిపోయిన ముక్కలు ఏరేసి, తన ఇంటిలో వేజ్ ఎవరికీ అనుమానం రాకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది. ఈ అతి తెలివే ఆమెను పట్టించింది. ఈ కేసు ఇన్విస్టిగేట్ చేసే ఆఫీసరు తన చిన్నప్పటి స్నేహితురాలనీ, ఆమె దగ్గర కూడా వేజ్ వుందనీ, పేర్ల సహాయంతో ఏది ఎవరిదో ఆ ఆఫీసర్ గుర్తుపట్టగలదనీ విశాల కలలో కూడా ఊహించి వుండదు. ఆ వేజ్ మీద విశాల వేలిముద్రలు స్పష్టంగా వున్నాయి. విశాల నేరం వప్పుకుంది" అంటూ పూర్తిచేసింది వైజయంతి.
"హత్య ఆయుధం దొరక్కపోతే కేసుండదని ఎక్కడో చదివిందట".
భార్గవి ఇంకా దిగ్ర్భమనుంచి తేరుకోలేదు. తనలో తనే - "ఎంత ఘోరం జరిగింది! నలుగురి స్నేహబృందంలో ఒకరిని మరొకరు చంపటం.. అదీ ఆమెజ్ఞాపకంగా ఇచ్చిన బహుమతితోటే....." అనుకుంది.
పేలవంగా నవ్వుతూ, "కథ ఎటునుంచి ఎటు మలుపు తిరిగినా బాధ పడవలసింది చివరకు స్త్రీయే. అటు అనూరాధ చచ్చిపోయింది. ఇటు విశాల జైలుపాలవుతుంది. మధ్యలో వాళ్ళ భర్తలకి మాత్రం ఏ శిక్షాపడదు. సుఖంగా వుంటారు" అంది.
"అందరూ ఒకేలా వుండరు భార్గవీ! మంచీ, చెడూ ఎప్పుడూ ఇద్దరిలోనూ వుంటాయి. విశాలది కాని, అనూరాధదికాని తప్పు అసలు లేదని నువ్వనగలవా? కాకపోతే స్త్రీల బాధ గురించి మనం వెంటనే రియాక్టు అవుతాం. విశ్వం, మోహన్ లాంటి అవకాశవాదులతోపాటు సుభాష్ లాంటి ఉత్తములూ వున్నారు ఈ సమాజంలో".
"సుభాష్ అంటే అనూరాధ.."
"ఊ... అతడే రాధ విషయం పేపర్లలో చదివి ఈ రోజే భార్యా పిల్లలతో వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ పిల్లల్ని తమవెంట తీసుకెళతామని గొడవ".
"ముందు విశాలను కలుద్దాం. దాన్ని చూడాలనివుంది".
* * *
"విశాలా, నువ్విలా బాధపడితే మాకెలా వుంటుంది? నిన్ను చూడటానికి నేనే వచ్చానుగా". ముఖం తిప్పుకుని ఏడుస్తున్న విశాలను బలవంతంగా తనవైపు తిప్పుకుంది భార్గవి.
"నువ్వయినా నన్ను తిట్టు భార్గవీ! చేయరాని తప్పు చేశాను. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాను. ఇంతమందిని క్షోభ పెడుతున్నాను".
"జరిగిపోయిన దాని గురించి పదేపదే తలచుకుని బాధపడడం మానెయ్యి జరగవలసింది ఆలోచించు".
"ఏం ఆలోచించను? భర్తంటే దైవమని ఎంత చేశాను. ఎన్ని తప్పులు చేసినా మనసులోనే దాచుకున్నాను. ఈ రోజు నేనిలా అవడానికి కారణం ఏమిటి? నా భర్త ప్రవర్తన కాదా? ఇప్పుడు నాకు అండ కావాల్సిన సమయంలో ఆయన కనీసం మొహమైనా చూడటం లేదు". జరిగినదానికంటే విశ్వం ప్రస్తుత ప్రవర్తనకు ఆమె ఎక్కువగా బాధపడుతోంది.
"అతడినలా తయారు చేసింది నువ్వే విశాలా? ఎంత ఆత్మీయులయినా తప్పు చేసినప్పుడు అది చెయ్యడంలో తప్పులేదు. అయినా ఇప్పుడవన్నీ ఆలోచించకు. నేరస్తులంతా చెడ్డవాళ్ళని అర్ధంకాదు. నీకు పడే శిక్షకూడా తక్కువ. ఎంతలో గడిచిపోతుంది" వైజయంతి అంది.
"అదే నా భయం. అప్పుడు నేనెవరికి కావాలి? భర్తకు కూడా అవసరం వుండదు. దానికంటే ఆ జైల్లోనే యెక్కువ రోజులు గడపడం మేలు".
"కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మార్గాలెన్నో వున్నాయి విశాలా. అయినా అవన్నీ ఇప్పుడే ఆలోచించటం దేనికి? నువ్వు నా దగ్గరకు రా, నీకో మంచి కాలక్షేపం కలిగించే భారం నాది. నీ భర్తకు అవసరం లేకపోయినా నీ పిల్లలకు ఏ అవసరం వుంది" అంది వైజయంతి.
* * *
సికింద్రాబాద్ స్టేషన్ లో రైలు బయలుదేరటానికి సిద్దంగా వుంది. భార్గవి వాళ్ళు లోపల కూర్చున్నారు. శ్రీరామ్, శరత్ దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు.
"నేనిన్నాళ్ళూ స్త్రీలను గురించి తక్కువగా అంచనా వేసుకున్నాను. కానీ మీ మిసెస్ ని చూశాక అనిపిస్తోంది. మగవాళ్ళతో ఏ విధంగానూ తీసిపోని స్త్రీలున్నారని" అంటున్నాడు శ్రీరామ్.
"వాళ్ళలో గొప్పదనం గుర్తించలేదని అనొద్దు. దాన్ని మన అహం ఒప్పుకోనివ్వదు అంతే! నేనూ అదే కోవకి చెందినవాణ్ణి ఇన్నాళ్ళూ కాని అదే అహం మన జీవితాలను నాశనం చేస్తొందని అర్ధం చేసుకున్నానిప్పుడే ఇంకెప్పుడూ అలాంటి పొరపాటు చెయ్యను" అన్నాడు శరత్. రైలు కూత వేసింది. లోపల వైజయంతి భార్గవితో-
"భార్గవీ! రాధ మన మధ్యలేదు. విశాల జీవితం అలా అయిపోయింది. మన తరంలో మనకు జరిగిన అన్యాయాలూ, చేసిన పొరపాట్లూ ఈ సమాజపు రీతిలో లొసుగులూ చాలా అనుభవించాం. మన తర్వాతతరం వాళ్ళయినా భవిష్యత్తులో అలాంటి బాధలు పడకుండా సమస్యలని సరయిన పద్దతిలో ఎదుర్కొనే ధైర్యాన్నీ, శిక్షణనీ మనం యివ్వాలి. వీళ్ళది కొత్త తరం కావాలి. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు. కనీసం మన పిల్లలకదే నేర్పాలి" అంది.
"తప్పకుండా వైజూ! పశువుల్లా కాకుండా ఆలోచించే మేధవున్న మనుష్యులం మనం. తరాలు మారుతున్నాయి. అంతరాలు మారడం లేదు. ఒక్క జీవిత కాలంలో యెన్నో చేయగలం అని తెలిసీ రోజులు వృధాచేసుకున్నాను. ఇకమీదట అలాంటి బద్దకానికి స్వస్తి చెపుతాను. సమయాన్ని సార్ధకం చేసుకుంటాను. ఈ విశ్వపు బాధలు తెలిసినప్పుడు నా బాధలు ఎంత చిన్నవో తెలిశాయి. నా సంతోషానికి కేంద్రం ణ ఆభర్త అయితే కావచ్చు కానీ విషాదానికి పరిధి మాత్రం సంసారం గానీ, వ్యక్తిగత సమస్యలు గానీ కాకూడదని తెలుసుకున్నాను".
రైలు కూత వేసింది మళ్ళీ.
వైజయంతి క్రిందకు దిగింది.
కిటికీలోంచి భార్గవి చెయ్యి వూపుతోంది. రైలు కదిలింది.
పట్టాలు రెండుగా విడి, నాలుగ్గా మారి గమ్యాన్ని చేరుకోవటం కోసం దార్లు వెతుక్కుంటున్నాయి.
రైలు ముందుకు సాగుతోంది. కుదుపుతూ- హాయిగా- లయగా - జీవితంలా - కుదుపుతూ- హాయిగా-లయగా-జీవితంలా.
* * *
--అయిపోయింది--