"లేదు".
"మరి గడిచేదెలా?"
"మా తమ్ముడితో వుంటున్నాను. రాధ అడిగితే డబ్బిచ్చేది".
"ఎందుకు చంపావామెని?"
"నేను చంపలేదు. వీళ్ళు వచ్చి చెప్పేవరకూ నాకు తెలియదు. పొద్దున్న అక్కడికి వెళ్ళిన మాట నిజమే. డబ్బు కోసం కొంత గొడవ పడ్డాం కానీ ఇచ్చేసింది వెంటనే వచ్చేశాను".
"ఆ తరువాత ఎక్కడకు వెళ్ళావ్?"
"బ్రాందీ షాపులో బాటిల్ కొనుక్కొని మా ఇంటికి వెళ్ళాను. అక్కడే వున్నాను".
"నువ్వు కావాలని చంపలేదు. ఈ ఉత్తరం చూసి ఆవేశంలో చంపావు అవునా?"
అతడు తలెత్తి చూశాడు. "ఉత్తరమా, ఏం ఉత్తరం?" వైజయంతి చేతిలో ఉత్తరం చూసిన అతడి ముఖంలో మార్పులేదు. "నేనే ఉత్తరమూ చదవలేదు, నాకు తెలియదు. అయినా నేనెందుకు చంపుతాను? నాకు కావలసిన డబ్బు ఎప్పుడు అడిగినా ఇచ్చేది" అన్నాడు.
వైజయంతి ఆలోచనలో పడింది. మల్లికా కూడా అదే మాటంది.
"నువ్వు వెళ్ళిపోయేటప్పుడు రాధ ఏం చేస్తోంది?" అడిగింది.
"ఫ్లవర్ వేజ్ లో పూలు సర్దుతోంది".
వైజయంతికి హఠాత్తుగా ఏదో స్ఫురించింది. ఆమె చూసినప్పుడు అది షోకేస్ లో వుంది. పూలు లేవు.
"ఆ ఇంటికి ఓసారి వెళ్ళాలి పదండి" దారితీసింది వైజయంతి.
షోకేస్ లో ఇంకా అలాగే వుంది అది. దానిమీద వున్న పేరు చూసి కర్చీఫ్ తో తీస్తూ "ఇన్ స్పెక్టర్ ఈ వేజ్ లాబ్ కి పంపండి, వేలిముద్రలు పరీక్షించమనండి" అంది.
"యస్ మేడమ్!"
అతడు వెళ్ళి పోయాక సర్కిల్ వైపు తిరిగి, "మోహన్ ని వదిలి పెట్టండి. అతడు హంతకుడు కాదు" అంది.
* * *
25 ఏప్రియల్ 1988
ఉమెన్స్ కాలేజీలో పొగడచెట్టు పదిహేనేళ్ళ తర్వాత జరిగే ఆ సమావేశాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా అరుగు నిండా పూలజల్లు కురిపించింది. ఎండాకాలం అయినా అంతకు ముందురోజు పెద్దగా వర్షం పడడంతో నేల చల్లబడింది. వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. అందరికంటే ముందు తొమ్మిదిన్నరకే వచ్చింది భార్గవి. రాగానే అనూరాధ కోసం చూసింది. ఎప్పుడూ ముందుగా వచ్చి పొగడపూలన్నీ ఏరిపెట్టేది. అవి దండగుచ్చడం భార్గవి వంతు.
ఆ రోజుల్ని తలుచుకుంటూ పూలన్నీ ఏరింది. ఆమెకెంతో ఎగ్జయిటింగ్ గా వుంది.
సరిగ్గా పది గంటలకు వచ్చింది వైజయంతి. దూరంనించే భార్గవిని గమనించింది. ఆమె పూలు యేరడం చూస్తూ అలాగే నిలబడి పోవాలనిపించింది.
ఆనందం - విషాదం మిళితమై ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"భార్గవీ!" ఆమె పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది భార్గవి. ఒక్క ఉదుటున "వైజూ" అంటూ వచ్చి ఆప్యాయంగా కౌగలించుకుంది. "ఎన్నాళ్ళకు కలుసుకున్నాం" అంది భార్గవి నిష్టూరంగా.
"మిగతా ఇద్దరూ ఇంకా రాలేదు. చూడు, రాధయినా ముందుగా వస్తుందనుకున్నాను" అంది. వైజయంతి సమాధానం చెప్పలేదు.
ఆమె దృష్టి పక్కనే వున్న దండమీద పడింది. మాటమారుస్తూ-
"ఈ పూలు నువ్వు తెచ్చావా?" అని అడిగింది.
"నేనే కొనుక్కొచ్చా మనం విడిపోయే ముందు మనందరకూ అనూరాధ ఒకటే రకం ఫ్లవర్ వేజ్ లు ప్రజెంట్ చేసింది గుర్తుందా? వాటిలో పెట్టుకోవటానికి అందరికీ ఒకేరకం పూలు కొనుక్కొచ్చాను".
వైజయంతి ముఖం మ్లానమవడం గమనించింది భార్గవి. 'బహుశా అది పోగొట్టుకుందేమో అనవసరంగా అన్నాను' అనుకుంది మనసులోనే.
"ఏమిటి విశాల నిజంగానే మర్చిపోయిందనుకుంటా. అయినా రాధ తప్పకుండా రావాల్సిందే" అంది మాట మారుస్తూ.
"వాళ్ళూ ఆలస్యంగా వస్తారేమో! పోనీగాని నీ విషయం చెప్పు. రాగానే డాక్టర్ భార్గవీ అని పిలవాలనుకున్నాను".
"లేదు వైజూ! డిగ్రీతోటే చదువు ఆపేశాను. ఆపైన చదవాలనిపించలేదు. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాను. మా ఆయన బ్యాంక్ లో ఆఫీసర్, పిల్లలు కలగలేదు. బాధలు లేవు, భావనలు లేవు, కాలం అలా గడిచిపోతోంది".
"నీ పుస్తకాలు - కలం స్నేహితులు?"
"ఇంకా గుర్తుపెట్టుకున్నావా అవన్నీ! గుంటూరు వెళ్ళగానే కలం స్నేహం వదులుకున్నాను. ఇక పుస్తకాల పిచ్చి పుడకతోగాని పోదు. నా ఇష్టప్రకారం ఓ లైబ్రరీ గది ఏర్పాటు చేసుకున్నాను. అదే నాకు ముఖ్య కాలక్షేపం".
"అడుగుతున్నానని ఏమీ అనుకోకు. పిల్లలు లేరన్న బాధ నీకు ఎప్పుడూ కలగలేదా?"
"అనుకోవడానికేముంది? మొదట్లో కొద్దిగా బాధపడ్డాను. ప్రస్తుతం బాలవాడీలో పిల్లలతో గడిపితే తృప్తిగా వుంటుంది. నా గురించి చెప్పడానికేం లేదు. కాని ఇక నీ గురించి చెప్పు. ఇంకా టిమిడ్ జీనియస్ గానే ఉన్నావా?"
"లేదు పిరికితనం ఢిల్లీ వెళ్ళగానే తగ్గిపోయింది. అవంతి అనే స్నేహితురాలు నన్ను మార్చేసింది. అతి పిరికిదాన్నయిన నేను ఈ రోజు ప్రతిక్షణం ప్రమాదాలను ఎదుర్కొనే పోలీసు ఆఫీసర్నయానంటే అది ఆమె వల్లనే. ప్రస్తుతం ఇక్కడే ఎస్.పి.గా వున్నాను".
దిగ్బ్రమ నిండిన కంఠంతో - "నువ్వు నువ్వు పోలీసాఫీసరువా? నిజంగా?" ఆశ్చర్యంగా అడిగింది భార్గవి.
"అవును నమ్మలేకపోతున్నావు గదూ!"
"నాకెంతో గర్వంగా వుంది వైజూ! మా బృందంలో ఒకరు జాతీయస్థాయిలో అంత పెద్ద ఆఫీసరవడం అంటే నిజంగా గ్రేట్" తడబడింది ఆవేశంతో.
"ఈ విషయం మనవాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషిస్తారో- అన్నట్టు వీళ్ళేరీ- పదకొండయింది. సంసార తాపత్రయంలో పడి ఈ రోజు సంగతి మర్చిపోయారా?" అంది.
ఆ మాటలకి వెంటనే జవాబు చెప్పలేదు. ఆ తరువాత నిశ్శబ్దాన్ని చీలుస్తూ "వీళ్ళు రారు. రాలేరు భార్గవీ!" అంది వైజయంతి. అంటూంటే ఆమె కంఠం వణికింది.
"ఏం, ఎందుకని?"
"అనూరాధ ఈ లోకంలోనే లేదు, ఆమెను హత్య చేసిన నేరానికి విశాల లాకప్ లో వుంది".
ఒక చల్లటి పవనం వెన్నెముకని వణికించింది. ఒక విద్యుద్ఘాతం శరీరాన్ని కదిలించింది. భార్గవి నిలువెల్లా కంపించింది. వైజయంతి ఆమెకు ఉత్తరాన్ని అందిస్తూ, "ఇదిగో ఇది చదువు, రాధ నీకు వ్రాసింది. ఈ ఉత్తరమే ఆమె ప్రాణాలు తీసింది కూడా-" అంది.
వణుకుతున్న చేతులతో ఉత్తరం అందుకుంది భార్గవి. చదువుతున్నంతసేపూ ఆమెకళ్ళు వర్షిస్తూనే వున్నాయి.
"ఎన్ని బాధలు పడింది.....అసలిదంతా ఎలా జరిగింది వైజూ? విశాల అంత దారుణంగా హత్యెలా చేయగలిగింది?"
"మేము ముందుగా రాధ భర్తనే అనుమానించాం. కాని అతడికి హత్యా చేయాల్సిన అవసరం కనిపించలేదు. అతడికి కాకపోతే మరెవరికి మోటివ్ వుందా అని ఆలోచించాను. రాధ ఇంట్లో ఒక క్లూ దొరికింది. నువ్విందాక ఫ్లవర్ వేజ్ గురించి మాట్లాడినప్పుడు, నా ముఖంలో అందుకే మార్పు కనిపించింది. రాధ ఇంటిలో వున్న ఫ్లవర్ వేజ్ చూశాను. దాని మీద 'విశాల' అని పేరు కనిపించింది. మనకి బహుమతి ఇచ్చేముందు రాధ మనపేర్లు వాటిమీద చెక్కించింది గుర్తుందా? మరి రాధ ఇంట్లో 'FROM RADHA TO VISALA' అన్న వేజ్ ఎందుకుంటుంది? అనుమానంతో విశాలను కలిశాను. నన్ను చూసి ఉలిక్కిపడింది విశాల. ఆమె ముఖం చూడగానే పసిగట్టేశాను. ముందు ఒప్పుకోలేదు. తర్వాత అన్నీ బయటపడ్డాయి. ఆమె వెంటనే వచ్చేసినా ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. కాని డిటెక్టివ్ నవలలు చదివిన మిడిమిడి జ్ఞానంతో జాగ్రత్త పడుతున్నానని అన్నీ పిచ్చిపనులు చేసింది".
వైజయంతి చెప్పటం కొనసాగించింది.
"రాధ ఉత్తరం రాసి పోస్టు చేయమని విశ్వం చేతికిచ్చింది. అతడు మర్చిపోయి ఊరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాని విషయం మర్చిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత అది విశాల చేతిలో పడింది. సునీత రాధ అనే ఆమె ఇంటిలో వుంటుందని వింది. కాని, ఎప్పుడూ వెళ్ళలేదు. కాబట్టి ఆ రాధ మన అనూరాధేనని ఆమెకు తెలియదు. విశ్వం ఎవరితోనో స్నేహంగా వుంటున్నాడని అనుమానించింది గానీ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందీ విశ్వం ఆమెకు తెలియనివ్వలేదు. అతడికి అంతకు ముందు వ్యవహారాలలో అనుభవం వచ్చిందేమో పొరపాటునైనా బయట పడలేదు. ఉత్తరం చదివిన విశాలకు ఆవేశం వచ్చింది.